ఏడుకొండ‌ల‌వాడా..వేంక‌ట‌ర‌మ‌ణా..!

TTD ఆస్తులు విక్రయించాలన్న బోర్డు నిర్ణయం ప్రకంపనలు సృష్టిస్తోంది. వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తున్నాయి విపక్షాలు. గజం కూడా అమ్మకుండా అడ్డుకుంటామని ఉద్యమానికి సిద్దమైంది BJP. భూముల అమ్మకంపై విమర్శలు ఎక్కుపెట్టింది TDP. విక్రయానికి తీర్మానం చేసిందే టీడీపీ, బీజేపీలని స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చింది YCP. ఎట్టికేలకు దీనిపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. భూముల అమ్మకంపై గత 2016లో ఇచ్చిన జీవోను నిలుపుదల చేసింది. దీంతో వ్యవహారం సర్దుమణుగుతుందా.. లేక రాజకీయంగా ఇంకా కాక రేగుతుదా.. […]

ఏడుకొండ‌ల‌వాడా..వేంక‌ట‌ర‌మ‌ణా..!


TTD ఆస్తులు విక్రయించాలన్న బోర్డు నిర్ణయం ప్రకంపనలు సృష్టిస్తోంది. వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తున్నాయి విపక్షాలు. గజం కూడా అమ్మకుండా అడ్డుకుంటామని ఉద్యమానికి సిద్దమైంది BJP. భూముల అమ్మకంపై విమర్శలు ఎక్కుపెట్టింది TDP. విక్రయానికి తీర్మానం చేసిందే టీడీపీ, బీజేపీలని స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చింది YCP. ఎట్టికేలకు దీనిపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. భూముల అమ్మకంపై గత 2016లో ఇచ్చిన జీవోను నిలుపుదల చేసింది. దీంతో వ్యవహారం సర్దుమణుగుతుందా.. లేక రాజకీయంగా ఇంకా కాక రేగుతుదా..

శ్రీవారి నిరర్థక ఆస్తుల విక్రయానికి సిద్దమైంది TTD. తమిళనాడులో ఉన్న 23 ఆస్తులను అమ్మడం ద్వారా కోటిన్నర ఆదాయం వస్తుందని TTD అంచనా వేసింది. ఇందుకోసం TTD 23 ప్రాపర్టీస్‌ తో 30 ఏప్రిల్‌ 2020న నోటిఫికేషన్‌ జారీ చేసింది.వీటి విలువ రూ.కోటీ 50లక్షలు ఉంటుందని అంచనా వేసింది. ప్రాసెస్ పూర్తి చేయడానికి 2 ప్రత్యేక టీంలు కూడా ఏర్పాటు చేసింది TTD. ఒక్కో టీంలో 4 అధికారులుంటారు.

Proceedings for sale of TTD properties by TTD Teams  

284_16948.pdf

 

TTD నిర్ణయాన్ని విపక్షాలు తప్పబడుతున్నాయి. ఆలయాల ఆస్తులు అమ్మే హక్కు లేదని… దీనిని అడ్డుకుంటామంటోంది బీజేపీ. రాష్ట్ర వ్యాప్తంగా క్వారంటైన్‌ దీక్షలకు పిలుపునిచ్చింది. అటు టీడీపీ కూడా ప్రభుత్వంపై దుమ్మెత్తిపోసింది. వెంకన్నస్వామి ఆస్తులు అమ్ముతున్న ప్రభుత్వం… రేపు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని మతాల ఆస్తులను కూడా వేలం వేస్తుందంటూ మండిపడింది టీడీపీ. దేవునిపై విశ్వాసంతో భక్తులు ఇచ్చిన ఆస్తులను నిరర్థకం అంటూ వ్యాఖ్యానించడం అవమానించడమేనంటోంది జనసేన. దేవుని ఆస్తులు విక్రయానికి వ్యతిరేకమని స్పష్టం చేశారు పవన్‌ కల్యాణ్‌. అటు కమ్యూనిస్టులు సైతం TTD నిర్ణయాన్ని తప్పబడుతున్నారు.

చరిత్రలోకి వెళితే…

వాస్తవానికి దేవాదాయ చట్టాలకు అనుగుణంగా సబ్‌ కమిటీలు వేసి… ఆస్తులు అమ్మకానికి నిర్ణయం తీసుకుందే గత పాలకమండలి. ఇందులో BJP భాగస్వామ్యం కూడా ఉంది. 28-07-2015న కీలక నిర్ణయం తీసుకుంది గత టీటీడీ పాలకమండలి. అదేరోజు జరిగిన బోర్డు సమావేశంలో 84వ తీర్మానం చేసింది.

ఇందులో భాగంగా నిరర్థక ఆస్తులు గుర్తించి అమ్మకానికి అవసరమైన సలహాలు, సూచనలు, మార్గదర్శకాలు ఇవ్వాలని సబ్‌ కమిటీ వేసింది. ఇందులో ప్రస్తుతం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న తిరుపతి బీజేపీ నేత భానుప్రకాశ్‌ రెడ్డి తో పాటు అప్పటి బోర్డు సభ్యులు జె. శేఖర్‌, డి.పి. అనంత
ఎల్లా సుచరిత, సండ్ర వెంకటవీరయ్యలున్నారు.

2016 జనవరి30న సబ్‌ కమిటీ నివేదిక ఇచ్చింది. 253 తీర్మానం ద్వారా దీనిని ఆమోదించారు. మొత్తం 50 ఆస్తులను గుర్తించిన కమిటీ అమ్మకానికి అనుసరించాల్సిన విధానాన్ని కూడా సూచించింది. మొత్తం ఏపీలోని రూరల్‌ ప్రాంతాల్లో 17, అర్బన్‌ ఆస్తులు 09, తమిళనాడులో రూరల్‌ ఆస్తులు 23, రిషికేష్‌లోని ఎకరం 20 సెంట్ల భూమి అమ్మకానికి పెట్టాలని నివేదిక ఇచ్చారు. వీటివిలువ రూ.23 కోట్లు అని అంచనా వేసింది.

గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఆస్తులను కలెక్టర్‌ ద్వారా వేలం వేయించాలని… అర్బన్‌లో ఆస్తులు MSTC సంస్థ ద్వారా ఈవేలం వేయడం, ఇతర కొన్ని ఆస్తులు నేరుగా TTD ద్వారా వేలం వేయడం ద్వారా విక్రయించాలని నిర్ణయించారు. పైగా దేవాదాయ శాఖమంత్రిగా BJP నేత మాణిక్యాలరావు ఉండటం గమనార్హం.

తాజాగా చేసిందేంటి?
గత టీటీడీ పాలకమండలి నిర్ణయానికి అనుగుణంగా తాజాగా సమావేశమైన బోర్డు… విక్రయానికి 23 ప్రాపర్టీస్‌ను సిద్దం చేసింది. 30 ఏప్రిల్‌ 2020న నోటిఫికేషన్‌ ఇచ్చారు. దీనిపైనే ఇప్పుడు వివాదం రాజుకుంది. గతంలో ఎవరైతే దీనిని రూపకల్పన చేశారో… వాళ్లే వ్యతిరేకించడాన్ని వైసీపీ నేతల తప్పుబడుతున్నారు. ప్రజా అభిప్రాయాలు… భక్తుల మనోభావాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. టీవీ9 వేదికగా ఆయన తన అభిప్రాయాలూ పంచుకున్నారు. ఆస్తులు కాపాడలేని సందర్భంలో ఏం చేయాలనేదానిపై సమీక్ష చేశామని.. అమ్మాలని తమ అభిమతం కాదంటున్నారు… భక్తుల సెంటిమెంట్‌తో రాజకీయం చేయాలన్న ఉద్దేశం తమకు లేదంటోంది. 1974 నుంచి 129 ఆస్తులు అమ్మిన చరిత్రను గుర్తుచేస్తున్నారు.

అసలు TTD ఆస్తులు అమ్మడానికి జీవో ఉందా?

ఉమ్మడి రాష్ట్రంలో 1990 ఏప్రిల్‌ 9న అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం రెవిన్యూ ఎండోమెంట్స్‌ G.O.Ms No. 311 తీసుకొచ్చింది. TTDకి చెందిన స్థరాస్తులు విక్రయం లేదా మార్టిగేజ్‌ అధికారం కట్టబెడుతుంది.

అయితే 3 నిబంధనలు పెట్టిన ప్రభుత్వం ఇందులో 1. తిరుమల తిరుపతి దేవస్తానం ప్రయోజనాలుండాలి. 2. ఖచ్చితమైన లక్ష్యం ఉండాలి. 3. పద్దతి, మరియు సరైన విధానంలో విక్రయించాలి.

దీంతో పాటు.. 04 జులై 2002లో మరోసారి జీవో తెచ్చింది AP ఎండోమెంట్స్‌(2) G.O. Ms 405. నిర్వహణ సాధ్యం కాని అర్బన్‌ ఆస్తులు కూడా విక్రయించవచ్చని ఈ జీవో చెబుతోంది. ఈ GOల ఆధారంగానే TTD బోర్డు గతంలో 165 నెంబర్‌ తీర్మానం చేసింది.

అయితే ఆలయాల ఆస్తులు అమ్మకం ఏంటంటూ GOలపై హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఫస్ట్‌ GOపై రిట్‌ పిటిషన్‌ 21148/2002, రెండో జీవోపై GO రిట్‌ పిటిషన్‌ 11812/2005 ఇంకా విచారణలో ఉన్నాయి. అయితే మొదటి రిట్‌ అయిన 21148/2002రిట్‌ మధ్యంతర ఉత్తర్వు రావడంతో గతంలో ఆస్తుల అమ్మకాలపై ప్రభుత్వాలు ముందుకెళ్లాయి.

37 ఆస్తులు విక్రయించింది TTD. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లో 27, తెలంగాణ 01, తమిళనాడు 10, కర్నాటక 04 ఉన్నాయి.

అయితే ఆస్తుల అమ్మకం ఇప్పుడు మొదలైంది కాదు… 1974 నుంచే ఉంది. ఇప్పటివరకూ దాదాపు 129 ఆస్తులు విక్రయించారు. దీని వల్ల టీటీడీకి 6 కోట్ల 90లక్షల రూపాయల ఆదాయం వచ్చింది. దీనిని కార్పస్‌ ఫండ్‌కి ఇచ్చారు.

ఆస్తులు అమ్మకంపై రాజకీయ పార్టీల వాదన ఎలా ఉన్నా… అసలు భక్తులు దేవుడి కోసం ఇచ్చిన ఆస్తులను విక్రయించడం ఇప్పుడు చర్చగా మారింది. భక్తికి విలువ కట్టడమేనా? కాపాడలేనప్పుడు అసలు తీసుకోవడం ఎందుకన్న చర్చా జరుగుతోంది.

TTD ఆస్తుల వివరాలు….
క్యాష్‌ డిపాజిట్స్ రూ.14వేల కోట్లు
వడ్డీ రూపంలో ఆదాయం రూ.48 కోట్లు
8 రాష్ట్రాల్లో TTDకి భూములు
తిరుపతిలో 3వేల ఎకరాలు
తెలంగాణలో 188 ఎకరాలు
తమిళనాడులో 170 ఎకరాలు
ఉత్తరాఖండ్‌లో 15 ఎకరాల భూమి
తిరుమల భూముల విలువ సుమారు రూ.70వేల కోట్లు
బ్యాంకుల్లో బంగారం 8టన్నులు

ఇదే అంశంపై బిగ్‌ న్యూస్‌ బిగ్‌ డిబేట్‌ జరిగింది… లింక్‌ కోసం కింద క్లిక్‌ చేయండి.