Bhainsa Violence: భైంసా ఘటనలో అమాయకులు రోడ్డున పడ్డారని అన్నారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. పోలీసులు అప్రమత్తంగా లేకపోవడంతోనే దాడులు జరిగాయన్నారు. భైంసాలో పర్యటించిన కేంద్ర మంత్రి బృందం.. బాధితులకు ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహాయం అందలేదన్నారు. కోర్బా, కిషాన్‌గల్లిలో పర్యటించిన కిషన్‌రెడ్డి.. స్థానికులతో మాట్లాడారు. ఆ రోజు జరిగిన ఘటనకు సంబంధించి వివరాలను అడిగి తెలుసుకున్నారు.
భైంసా దాడుల్లో 101 మంది నష్టపోయినట్టు గుర్తించామన్నారు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి. కేంద్రం తరపున నివేదిక సేకరించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి నష్టపరిహారం ఇచ్చేలా చూస్తామన్నారు. తన మూడు నెలల జీతాన్ని బాధితులకు సాయంగా అందిస్తానన్న కిషన్‌రెడ్డి.. తమ ఎంపీల తరపున మరో 25 లక్షలను ఇస్తున్నట్టు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి కూడా ఆర్థిక సాయం అందేలా చూస్తామని హామి ఇచ్చారు.
గత నెలలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణతో.. భైంసాలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో పోలీసులు 144 సెక్షన్ విధించి.. శాంతిభద్రతలకు విఘాతం కల్గకుండా చూశారు. అల్లర్లకు కారణమైన వారిని గుర్తించి 17 మందిని అరెస్టుచేశామని పోలీసులు తెలిపినా.. రాజకీయంగా విమర్శలు ఆగలేదు. ఈ నేపథ్యంలోనే బీజేపీ నేతలు భైంసాలో పర్యటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. ఆయన వెంట లక్ష్మణ్, ఎంపీలు అరవింద్, సంజయ్, సోయం ఉన్నారు.