పశ్చిమ బెంగాల్ లో కిడ్నాప్ ల ఘటనలు కలకలం రేపుతున్నాయి. అధికార పార్టీని వీడి కమలం గూటికి చేరుతున్న నేతలపై వరుస దాడులు జరుగుతుండటంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గత నెలలో ఓ బీజేపీ నేత భార్యపై లైంగిక దాడి ఘటన మరువక ముందే నిన్న మరో బీజేపీ నేత కూతరుని అగంతకులు అపహరించుకుపోయారు. బీర్బమ్ జిల్లాలోని లబ్ పూర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. జిల్లాకు చెందిన బీజేపీ నేత సుప్రభాత్ బత్యాబ్యాల్ నివాసంలో అతని కుమార్తె (22)కు తుపాకీ గురిపెట్టి కొందరు గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ జరిగిన సమయంలో ఇంటివద్ద సుప్రభాత్ లేరు. ఐదు నెలల క్రితమూ ఈయన టీఎంసీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరారు. టీఎంసీలో చేరకముందు ఆయన సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడిగా ఉన్నారు. కాగా కిడ్నాప్ కు ముందు ఐదుగురు దుండగులు ఇంట్లోకి ప్రవేశించి..తమనందరినీ ఓ రూంలో బంధించి తాళం వేశారని సుప్రభాత్ సోదరుడు తెలిపారు. ఆ తర్వాత తుపాకిని ఎక్కుపెట్టి ఇంటిబయట ఉంచిన కారు వద్దకు లాక్కెళ్లి, ఆమెను తీసుకెళ్లిపోయారని తెలిపారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని తెలిపారు.