బండి ఒకరోజు ఉపవాస దీక్ష.. ఎందుకంటే?

బండి సంజయ్ కుమార్ ఒకరోజు ఉపవాస దీక్షకు రెడీ అవుతున్నారు. ఒకవైపు కరోనా వైరస్ కారణంగా దేశం యావత్తు లాక్ డౌన్‌లో వున్న నేపథ్యంలో బీజేపీ అధ్యక్షుడీ దీక్షను ఎందుకు చేపట్టారన్న చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది.

బండి ఒకరోజు ఉపవాస దీక్ష.. ఎందుకంటే?

Updated on: Apr 23, 2020 | 4:23 PM

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఒకరోజు ఉపవాస దీక్షకు రెడీ అవుతున్నారు. ఒకవైపు కరోనా వైరస్ కారణంగా దేశం యావత్తు లాక్ డౌన్‌లో వున్న నేపథ్యంలో బీజేపీ అధ్యక్షుడీ దీక్షను ఎందుకు చేపట్టారన్న చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. అయితే, కరోనా నియంత్రణ చర్యలు చేపడుతున్నాం.. లాక్ డౌన్ పక్కాగా పాటిస్తున్నాం అంటూనే రైతాంగాన్ని ఆదుకునేందుకు 30వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం ఆచరణలో దాన్ని అమలు చేయడం లేదనేదే బండి సంజయ్ ఉపవాసానికి దారితీసిందంటున్నాయి బీజేపీ వర్గాలు.

శుక్రవారం (ఏప్రిల్ 24వ తేదీ) తెలంగాణ రైతాంగానికి సంఘీభావంగా బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఒక రోజు ఉపవాసం పాటించనున్నారు. రైతుల సమస్యలపై కేసీఆర్ ప్రభుత్వం స్పందించకపోవడంతో రైతులకు సంఘీభావంగా ఉపవాస దీక్ష చేపడుతున్నట్లు ఆయన ప్రకటించారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఉపవాస దీక్ష చేయనున్నారు బండి సంజయ్.

లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రజలు, రైతులు ప్రభుత్వానికి సహకరిస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సమస్యలు పట్టించుకోవడం లేదని బండి ఆరోపిస్తున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట కొనుగోలు చేసే వారు లేకపోవడం, కొంటామన్న ప్రభుత్వం జాప్యం చేస్తుండడంతో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సంజయ్ అంటున్నారు. ప్రభుత్వం సరైన ఏర్పాట్లు చెయ్యక పోవడంతో ఐకెపి సెంటర్లో ఆత్మహత్యలకు పాల్పడే దుస్థితి ఎదురవుతుందని ఆయన ఆరోపిస్తున్నారు.

శుక్రవారం తాను రాష్ట్ర కార్యాలయంలో ఉపవాస దీక్ష చేస్తున్న సమయంలో పార్టీ రాష్ట్ర పదాధికారులు, కోర్ కమిటీ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, మండల అధ్యక్షులందరు ఎవరి ఇంట్లో వారు ఉపవాస దీక్ష చేపట్టాలని పిలుపునిచ్చారు సంజయ్. అత్యుత్సాహంతో బీజేపీ వర్గాలెవరూ రోడ్డెక్కవద్దని, సోషల్ డిస్టెన్స్ తప్పకుండా పాటించాలని ఆయన సూచించారు.