డెలివరీ చేసిన నర్సులు, ఆయాలు.. మగశిశువు మృతి..మరీ ఇంత నిర్లక్ష్యమా !
వైద్యుల స్థానంలో నర్సులు కాన్పు చేయడంతో శిశువు మృతి చెందాడంటూ సూర్యపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో బాధితులు నిరసన వ్యక్తం చేశారు.
వైద్యుల స్థానంలో నర్సులు కాన్పు చేయడంతో శిశువు మృతి చెందాడంటూ సూర్యపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో బాధితులు నిరసన వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలతో వైద్యులు చెలగాటమాడుతున్నారని ఆస్పత్రి ముందు బైఠాయించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆస్పత్రి ఎదుట ధర్నా చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే…సూర్యపేట జిల్లా పెన్ పహాడ్ మండల కేంద్రానికి చెందిన శ్రీలత కాన్పు కోసం సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో చేరారు. ఉదయం పదకొండు గంటలకు ఆసుపత్రిలో చేరగా… రాత్రి పది గంటల సమయంలో కాన్పు కోసం గదిలోకి తీసుకెళ్లారు. అయితే కాన్పు సమయంలో మగ శిశువు తలకు కత్తెర గుచ్చుకోవడంతో ప్రాణాలు విడిచాడు.
డాక్టర్ లేకుండానే నర్సులు, ఆయాలు కాన్పు చేయడంతో శిశువు మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. లేక లేక కలిగిన బిడ్డను ఆస్పత్రి వైద్యులు పొట్టనబెట్టుకున్నారని బాధిత కుటుంబ సభ్యులు రోధిస్తూ ఆసుపత్రి ముందు బైఠాయించారు. విషయాన్ని ప్రశ్నిస్తే పోలీసు కేసు పెట్టుకోమంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని మండిపడ్డారు. పేదలు ప్రభుత్వ ఆసుపత్రికి వైద్యం కోసం వస్తే ప్రాణాలు పోయాల్సింది పోయి ఉన్న ప్రాణాలను తీస్తున్నారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధితుల ఆందోళన నేపథ్యంలో ఆసుపత్రిలో కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు ఆస్పత్రికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు.
Also Read :
ఆసిఫాబాద్ జిల్లాలో పెద్ద పులి పంజా