60ఏళ్ల క్రితం వీరమరణం పొందిన సైనికుడు.. నేటికీ భారత సైన్యంతో కలిసి చైనాను వణికిస్తున్నాడు..
మన దేశ సైనికులు నిరంతరం దేశ రక్షణలోనే నిమగ్నమై ఉంటారు. రాత్రిపగలు తేడా లేకుండా శత్రువుల బారి నుంచి దేశాన్ని కాపాడుతారనేది మనందరికీ తెలిసిన విషయమే. అయితే 48 ఏళ్ల అమరవీరుడై ఓ సైనికడు.. నేటికీ మన దేశాన్ని కాపాడుతున్నా వీరుడి కథ ఎప్పుడైనా విన్నారా? ఇది వింతగా అనిపించవచ్చు, కానీ ఇది నిజం.
హర్భజన్ సింగ్..అనే యోధుడు వీరమరణం పొంది 60 దాటినప్పటికీ అతను సరిహద్దులో ఉండి కనిపించకుండానే దేశాన్ని కాపాడుతున్నాడు.. అంతే కాదు,ఈ సరిహద్దులోనే అతని పేరిట ఓ ఆలయాన్ని కూడా నిర్మించారు. సైనికులు ఆ ఆలయాన్ని సందర్శించి హర్బజన్ సింగ్ దర్శనం చేసుకుంటారు. హర్భజన్ సింగ్‌ను ఇక్కడి ప్రజలు, సైనికులు ఎంతగా ప్రేమించి పూజిస్తు్న్నారో అతని శత్రువులు కూడా అతని పేరుకు భయపడతారు. చైనా చేస్తున్న కుట్రలను హర్భజన్ ముందుగానే తమకు తెలియజేస్తాడని సైనికులు భావిస్తున్నారు. అంతేకాదు.. చైనా సైనికులు కూడా బాబా హర్భజన్ సింగ్ ఆత్మను నమ్ముతారు. అతనికి భయపడుతున్నారు. దీన్ని బట్టి వీరుడైన హర్భజన్ సింగ్ శక్తిని ఈ వాస్తవాన్ని బట్టి అంచనా వేయవచ్చు. ఇవన్నీ మీకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు.. కానీ, పూర్తి వివరాల్లోకి వెళితే…
సైనికులు బాబా హర్భజన్ సింగ్ ఆలయానికి వెళ్లినప్పుడు, అక్కడ వారు అతని ఉనికిని అనుభవిస్తారని చెబుతారు. అలాగే భారత్-చైనాల మధ్య సమావేశం జరిగిన ప్రతిసారీ బాబా హర్భజన్ సింగ్ కోసం ఓ కుర్చీని ఖాళీగా ఉంచుతారు. బాబా మరణానంతరం కూడా ఆయన సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తున్నారని సిక్కిం సరిహద్దులో నియమించిన సైనికులు చెబుతున్నారు. ఇందుకోసం బాబా హర్భజన్ సింగ్‌కు సరైన పారితోషికం కూడా ఇవ్వనున్నారు. అతనికి ఆర్మీలో ర్యాంక్ కూడా ఉంది. ఆలయంలో బాబా కోసం ఒక గదిని నిర్మించారు. అక్కడ అతని కోసం ఒక మంచాన్ని కూడా సిద్ధం చేసి ఉంచుతారు. రోజూ ఆ మంచం శుభ్రం చేస్తారు. బాబా ఆర్మీ యూనిఫాం, షూలను ఒక గదిలో ఉంచుతారు. ప్రతి రోజూ వాటిని శుభ్రం చేస్తున్నప్పటికీ బూట్లపై బురద, బెడ్ షీట్లలో ముడతలు పడుతున్నాయని అక్కడి ప్రజలు చెబుతున్నారు.
ఇంతకీ ఎవరీ బాబా హర్భజన్ సింగ్?
“బాబా” హర్భజన్ సింగ్ భారత సైన్యంలో సైనికుడు. 1946 ఆగస్టు 30న గుజ్రావాలాలో జన్మించాడు. 1962 చైనా-భారత్ యుద్ధంలో డోగ్రా రెజిమెంట్‌లో పనిచేశాడు. ఈ సైనికుడు డ్యూటీలో ఉండగా తూర్పు సిక్కింలోని నాథులా పాస్ దగ్గర మరణించాడు. బాబా హర్భజన్ సింగ్ 1962 చైనా-భారత్ యుద్ధంలో హిమానీనదంలో మునిగిపోయాడు. కేవలం రెండేళ్లు సైన్యంలో పనిచేసిన ఆయన సిక్కింలో జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఆ సంఘటన మరో సైనికుడికి వచ్చిన కల ద్వారా తెలిసింది. ఒకరోజు బాబా హర్భజన్ సింగ్ నదిని దాటుతుండగా, ఉన్నట్టుండి నదీ ప్రవాహం పెరగడంతో వరద ప్రవాహానికి అతను కొట్టుకుపోయాడు. రెండు రోజులుగా తీవ్రంగా వెతికినా అతని మృతదేహం నదిలో కొట్టుకుపోయినా ఆచూకీ లభించకపోవడంతో ఆపరేషన్ నిలిపివేశారు. కానీ, దీని తరువాత, హర్భజన్ సింగ్ అక్కడి ఒక సైనికుడి కలలోకి వచ్చి అతని మృతదేహం ఎక్కడ ఉన్నది చెప్పాడు. మరుసటి రోజు సైనికుడు ఇతర సైనికులతో కలిసి అదే ప్రదేశానికి వెళ్లగా, అక్కడ హర్భజన్ సింగ్ మృతదేహం కనిపించింది.
అలాగే ఆ తర్వాత హర్భజన్ ఎప్పటికప్పుడు తన ఉనికిని చాటుకుంటున్నాడని సైనికులు చెబుతున్నారు. రాత్రిపూట ఆపరేషన్ చేస్తున్న సైనికులను నిద్ర లేపడానికి, శత్రువుల దాడి గురించి హెచ్చరించడానికి హర్భజన్ ఆత్మ తన కర్తవ్యాన్ని నిర్వహిస్తుందని చెబుతున్నారు. బాబా హర్భజన్ గత ఆరు దశాబ్దాలుగా రెండు ఆసియా దిగ్గజాలు చైనా, భారతదేశం అంతర్జాతీయ సరిహద్దును కాపాడుతున్నారు. అంతర్జాతీయ గోడకు అవతలి వైపున ఉన్న సైనికులు కూడా ఒక వ్యక్తి గుర్రంపై స్వారీ చేస్తూ సరిహద్దులో ఒంటరిగా గస్తీ తిరుగుతున్నట్లు చూశామని ధృవీకరిస్తున్నారు. చైనీయులు కూడా ఆయనను ఆరాధిస్తారు. నాథులా పోస్ట్‌లో రెండు దేశాల మధ్య జెండా సమావేశాల సమయంలో, చైనీస్ సైనికులు కూడా బాబా కోసం ఒక కుర్చీని పక్కన పెట్టారు.
దివంగత సైనికుడు బాబా హర్భజన్ సింగ్ మరణానంతరం గౌరవ కెప్టెన్ హోదాతో సత్కరించబడ్డాడు. సిక్కిం కొండల్లో ఆయన సమాధి వద్ద ఒక మందిరం నిర్మించబడింది. అప్పటి నుండి బాబా హర్భజన్ సింగ్ బంకర్ ఆలయంగా మార్చబడింది. ప్రతి అక్టోబరు 4న బాబా హర్భజన్ సింగ్‌తో పాటు దేశ రక్షణ కోసం తమ ప్రాణాలను అర్పించిన భారత సైన్యానికి చెందిన సైనికులను గౌరవించేందుకు భారత సైన్యం ఇక్కడ ఒక ప్రత్యేక వేడుకను నిర్వహిస్తుంది. ఏడాది పొడవునా ప్రతి ఆదివారం, మంగళవారాల్లో బాబా మందిరంలో భక్తులకు ఉచిత భోజనం పంపిణీ చేస్తారు. ఇక, ఈ ఆలయంలో ఎన్నో అద్భుతాలు చూస్తామని స్థానికులు చెబుతున్నారు. ఈ గుడిలో పెట్టిన నీరు వారం తరువాత పవిత్ర జలంగా మారుతుందని, అనేక అనారోగ్యాలను నయం చేస్తుందని ఇక్కడి సైనికులు, స్థానికులు నమ్ముతారు. ఇక్కడ ఉంచిన చెప్పులు గౌట్, ఇతర పాదాల సమస్యలతో బాధపడుతున్న రోగులకు ఉపశమనం కలగిస్తాయని ప్రజలు నమ్ముతారు. ఈ మందిరాన్ని సందర్శించలేని ఆ భక్తులు బాబాకు లేఖలు పంపుతారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..