AP Local Bodies Elections SEC to give declarations: ఏపీలో పంచాయితీ, మునిసిపల్ ఎన్నికలు ముగిశాయి. ఫలితాలు కూడా వచ్చేశాయి. ఇక మిగిలింది ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలే. ఇది ఇప్పుడు ఈ విషయం హైకోర్టు పరిధిలో ఉంది. ఏపీలో గతంలో జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఏకగ్రీవాలపై తాజాగా హైకోర్టు తీర్పునిచ్చింది. ఇప్పటికే ఏకగ్రీవాలైన వాటికి సంబంధించి అభ్యర్థులకు డిక్లరేషన్ ఫారాలు ఇవ్వాలని ఆదేశించింది.
ఏపీలో మొత్తం 652 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాలని అప్పట్లో రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. షెడ్యూలు కూడా విడుదల చేసింది. ఆ తర్వాత 126 జెడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మొత్తం ఏకగ్రీవాలన్నీ అంటే 126 స్థానాలను అధికార వైసీపీ ఏకగ్రీవంగా గెలుచుకున్నది. మొత్తం 9,696 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించ తలపెడితే.. 2,406 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. ఇందులో 2,283 స్థానాలను వైసీపీ, 80 ఎంపీటీసీలను టీడీపీ గెలుచుకున్నాయి. ఇతరులు కూడా 43 చోట్ల ఏకగ్రీవమయ్యారు. వీటి వివరాలను ఎన్నికల కమిషన్ ప్రకటించింది.
అయితే ఈ ఏకగ్రీవాలపై రాజకీయపరమైన వివాదం రాజుకోవడంతో ఏకగ్రీవంగా గెలిచిన వారికి డిక్లరేషన్లు ఇచ్చేందుకు ఎన్నికల కమిషన్ అప్పట్లో నిరాకరించింది. ఏకగ్రీవాలపై తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదుపై స్పందించిన ఎన్నికల కమిషన్ ఏకగ్రీవంగా గెలిచిన వారికి డిక్లరేషన్లను పెండింగులో పెట్టింది. ఈ విషయంపై ఏకగ్రీవంగా గెలిచిన కొందరితోపాటు రాజకీయ పార్టీలు కూడా హైకోర్టును ఆశ్రయించాయి. విచారణ జరిపిన ఏపీ హైకోర్టు ఏకగ్రీవంగా గెలిచిన వారికి డిక్లరేషన్లు ఇవ్వాలని మంగళవారం (మార్చి 16న) ఆదేశించింది. కాగా.. మిగిలిన 526 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
కాగా.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పదవీ కాలం మార్చి నెలాఖరుతో ముగియనున్నది. దాంతో ఆయన కెరీర్‌లో మునిసిపల్ ఎన్నికల నిర్వహణే చివరిది కానున్నది. తన పదవీ కాలం ముగుస్తున్నందున జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల షెడ్యూలును నిమ్మగడ్డ ప్రకటించడం లేదని తెలుస్తోంది. కొత్త ఎన్నికల కమిషనర్ అపాయింట్‌మెంటు తర్వాతనే జడ్పీటీసీ ఎన్నికల షెడ్యూలు వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ALSO READ: తెలంగాణ సర్కార్‌కు ‘సుప్రీం‘ ఊరట.. నష్టపరిహారం విషయంలో హైకోర్టు ఉత్తర్వులు కొట్టివేత
ALSO READ: ప్రత్యేక కోర్టులో దినకరన్ యూటర్న్.. చిన్నమ్మ వ్యూహంపై ఇపుడు ఉత్కంఠ