ఏపీలోని జగన్ సర్కార్ గిరిజనులు సంక్షేమంపై ఫోకస్ పెట్టింది. తండా, కొండ ప్రాంతాల్లోని మహిళలు, శిశువులకు మెరుగైన పౌష్టికాహారం అందించేందుకు ‘వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్’ పేరిట కొత్త స్కీమ్ ప్రవేశపెట్టేందుకు కార్యాచరణ రూపొందించింది. రాష్ట్రంలోని 77 గిరిజన మండలాల్లో ఈ స్కీమ్ అమలుకు విధి విధానాలు జారీ చేస్తూ ఉత్తర్వులిచ్చింది. మిగిలిన ప్రాంతాల్లో గర్భిణులు, బాలింతలు, 6 నుంచి 36 నెలలలోపు శిశువులకు పౌష్టికాహారం అందించేందుకు ‘సంపూర్ణ పోషణ పథకం’ అమలుకు ఉత్తర్వులు రిలీజ్ చేసింది.
257 ఐసీడీఎస్ పథకాల ద్వారా 13 జిల్లాల్లోనూ ‘సంపూర్ణ పోషణ పథకం’ అమలు కానున్నట్టు ఏపీ సర్కార్ వివరించింది. రాష్ట్రవ్యాప్తంగా 55,607 అంగన్వాడీ సెంటర్స్ ద్వారా అమలుకు ప్రణాళికలు సిద్దం చేసింది. అంగన్వాడీ సెంటర్లలో అందించే ఆహారానికి ఒక్కో లబ్దిదారుకు నెలకు 600 రూపాయలు ఖర్చు అవుతుందని.. అలాగే గర్భిణులు, బాలింతలకు ఇంటికి తీసుకెళ్లే రేషన్ సరుకుల కోసం నెలకు 500 రూపాయలు, శిశువులకు అందించే పౌష్టికాహారానికి ఒక్కొక్కరికి నెలకు 533 రూపాయలు వ్యయం అవుతుందని గవర్నమెంట్ ఉత్తర్వుల్లో పేర్కొంది.