ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థుల కోసం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కార్యక్రమం జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన. చదువుకోవాలని ఆశ ఉండి ఆర్థికంగా వెనుకబడిన వారికి ఈ పథకం అందిస్తుంది ప్రభుత్వం. అలాగే హాస్టల్ ఫీజులు, కాలేజీ ఫీజుల భారం తమ తల్లిదండ్రులపై పడకుండా ఉండేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టారు. గతంలో ఫీజు రీయంబర్స్‌మెంట్ పేరుతో సంక్షేమాన్ని అందించేవారు. దీనికి కొన్ని మార్పులు చేర్పులు చేసి ప్రతి ఏటా నాలుగు దఫాలుగా తల్లుల అకౌంట్లో డబ్బుల జమ అయ్యేలా ఈ పథకాన్ని రూపొందించారు. దీనిని ఆర్‌టీఎఫ్, ఎమ్‌టీఎఫ్ అని రెండు రకాలుగా విభజించారు.
ఈ సంక్షేమం పేరుతో లబ్ధిదారులు లబ్ధిపొందాలంటే ప్రభుత్వం నిర్ధేశించిన ఆదాయానికి లోబడి ఉండాలి. ఈ పథకం కింద విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటే.. వారి చదువు పూర్తి అయ్యే వరకూ ప్రతినెలా హస్టల్ ఖర్చుల మొదలు, విద్యా సంవత్సరానికి సంబంధించిన ట్యూషన్ ఫీజులను చెల్లిస్తుంది. ఇందులో ఇప్పటి వరకూ సుమారు 14లక్షల మంది లబ్ధి పొందుతున్నట్లు ప్రభుత్వ అధికారులు తెలిపారు. బీటెక్, డిప్లొమా, బీ ఫార్మసీ, ఎంఫార్మసీ, పాలిటెక్నిక్, ఎంసీఏ, ఎంబీఏ, ఎంటెక్, డిగ్రీ, మెడిసిన్ వంటి కోర్సులు ఇందులో వస్తాయి.
ఈ జాబితాలో డిగ్రీ, మెడిసిన్, ఇంజనీరింగ్ విద్యను అభ్యసించే వారికి సంవత్సరానికి రూ. 20వేల చెల్లిస్తారు. అదే పాలిటెక్నిక్ చేసే విద్యార్థులకు రూ. 15వేలు, ఐటీఐ వంటి వృత్తిపరమైన కోర్సుల చేస్తే రూ. 10వేలు తల్లుల ఖాతాలో జమ చేస్తారు. ఈనెల 28వ తేదీన 4వ విడత జగనన్న విద్యా దీవెన నిధులను విడుదల చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు అధికారులు. ఈ ఏడాది ఏప్రిల్ – జూన్ త్రైమాసికానికిగానూ 3వ విడత నిధులు రూ. 680.44 కోట్ల రూపాయలను 8లక్షల మందికిపైగా విద్యార్థుల తల్లుల ఖాతాలో జమ చేశారు. అయితే ఈనెల చివరి నాటికి నాలుగవ విడత నిధులను లబ్ధిదారుల ఖాతాలో జమ చేయాలని భావిస్తున్నారు. అయితే ఈ సారి మరో కొత్త నిబంధనను తీసుకొచ్చారు సోషల్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ అధికారులు.
ఇప్పటి వరకూ డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ కింద నేరుగా తల్లుల ఖాతాలో డబ్బులు జమ చేసింది ప్రభుత్వం. అయితే నాలుగవ విడత నిధులు అకౌంట్లో జమ అవ్వాలంటే తల్లుల ఖాతాలకు విద్యార్థుల వివరాలు నమోదు చేస్తూ ఉమ్మడి ఖాతాను తయారు చేసుకోవాలని సూచించింది. అయితే ఈ ఏడాది చదువు పూర్తి అయ్యే వారికి అవసరం లేదని తెలిపింది. జాయింట్ అకౌంట్లో ప్రైమరీ విద్యార్థి పేరు ఉండగా సెకండరీ తల్లిపేరు ఉండాలని తెలిపింది. ఒకవేళ తల్లి లేకపోతే తండ్రితో జాయింట్ అకౌంట్ ఏర్పాటు చేసుకోవచ్చని వెల్లడించింది. ఇద్దరూ లేని ఎడల తమ బంధువుల పేరుతో జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ ఈనెల 24లోపూ పూర్తి చేసుకోవాలని తెలిపింది. జాయింట్ అకౌంట్ కోసం వాలంటీర్లు లబ్ధిదారుల ఇంటికి వచ్చి వివరాలు సేకరించి బ్యాంకులకు తెలియజేస్తారు.
ఆ తరువాత తమకు కేటాయించిన సమయంలో నేరుగా బ్యాంకులకు వెళ్లి జాయింట్ అకౌంట్ తెరువవచ్చు. ఈ ప్రక్రియ పూర్తైన తరువాత పాసు బుక్ మొదటి పేజీని సచివాలయ సెక్రటరీకి సమర్పించాలి. వారు లబ్ధిదారుల వివరాలను పాస్‌బుక్ వివరాలను నవశకం పోర్టల్లో అప్లోడ్ చేస్తారు. ఆ తరువాత సంబంధించిన వివరాలు సరిగ్గా ఉన్నాయా లేదా అన్న అంశాలను పరిశీలించేందుకు జిల్లా వెల్ఫేర్ అధికారులు జన్మభూమి పోర్టల్‌లో పరిశీలించాల్సి ఉంటుంది. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే.. ఈ జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసిన తరువాత బ్యాంకులు ఎలాంటి డెబిట్ కార్డులు ఇవ్వరు. కేవలం జీరో బ్యాలెన్స్ అకౌంట్ మాత్రమే ఓపెన్ చేస్తారు. పైగా నగదు తీసుకోవాలంటే విద్యార్థితో పాటూ సంబంధిత వ్యక్తి వెళ్లి నగదు నేరుగా విత్‌డ్రా చేసకోవాల్సి ఉంటుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..