డ్యాం ఎత్తును ఒక్క మిల్లీమీటరు కూడా తగ్గించడంలేదు..పోలవరం గడ్డ సాక్షిగా తేల్చి చెప్పిన సీఎం జగన్

పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించిన అనంతరం ప్రాజెక్టు సైట్ వద్ద  అధికారులు, కాంట్రాక్టర్లతో ముఖ్యమంత్రి జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. 

  • Ram Naramaneni
  • Publish Date - 2:42 pm, Mon, 14 December 20
డ్యాం ఎత్తును ఒక్క మిల్లీమీటరు కూడా తగ్గించడంలేదు..పోలవరం గడ్డ సాక్షిగా తేల్చి చెప్పిన సీఎం జగన్

పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించిన అనంతరం ప్రాజెక్టు సైట్ వద్ద అధికారులు, కాంట్రాక్టర్లతో ముఖ్యమంత్రి జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు.  2022 ఖరీఫ్‌ నుంచి సాగునీరు అందిస్తామని స్పష్టం చేశారు. పోలవరం డ్యామ్ ఎత్తును ఒక్క మిల్లీమీటరు కూడా తగ్గించడం లేదని వెల్లడించారు. ప్రాధాన్య క్రమంలో పునరావాస కార్యక్రమాలు ఉంటాయని, మొదట 41.5 మీటర్ల మేర నీరు నిల్వ ఉన్నప్పుడు ముంపునకు గురవుతున్న ప్రాంతాల్లో పునరావస పనులు చేపడతామన్నారు.  పునరావాస కార్యక్రమాలకు కనీసం రూ.3330 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు.  ఆమేరకు సన్నద్ధంగా ఉండాలని అధికారులకు సీఎం సూచించారు.  వచ్చే ఫిబ్రవరి, మార్చినాటికి పూర్తిచేస్తామని అధికారులు సీఎంకు తెలిపారు.

“2022 ఖరీఫ్‌ కల్లా సాగునీరు ఇవ్వాలి. వచ్చే జూన్‌ 15కు మళ్లీ గోదావరిలో నీళ్లు వస్తాయి. ఈలోగా యుద్ధ ప్రాతిపదికన పనులు జరగాలి.  ఎక్కడ పొరపాటు జరిగినా పనులు మళ్లీ ఒక సీజన్‌ ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది. అందుకనే పనులు ముమ్మరంగా జరగాలి. మే నెలాఖరు నాటికి స్పిల్‌వే, స్పిల్‌ ఛానల్‌ పనులు సంపూర్ణంగా పూర్తికావాలి. అదే సమయానికి కాఫర్‌ డ్యాంలో ఉన్న ఖాళీలను పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలి. అప్పుడే మెయిన్‌ డ్యాం పనులు చురుగ్గా ముందుకుసాగుతాయి.  జలవిద్యుత్‌ ప్రాజెక్టు పనులు కూడా అదే సమయంలో ముందుకుసాగాల్సి ఉంటుంది. ఈ పనులన్నింటినీ ప్రణాళికా బద్ధంగా ముందుకు సాగాలి. ఒక్క మిల్లీమీటరు కూడా డ్యాం ఎత్తు తగ్గించడంలేదు. నిర్దేశించుకున్న ప్రకారం ఎఫ్‌ఆర్‌ఎల్‌ లెవల్‌ 45.72 మీటర్లు ఉంటుంది. టాప్‌ ఆఫ్‌ మెయిన్‌ డ్యాం లెవల్‌ 55 మీటర్లు ఉంటుంది. ఇందులో ఒక్క మిల్లీమీటరు కూడా తగ్గదు.  దీనిపై లేని పోని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు చెప్తున్నారు” అని సీఎం జగన్ పేర్కొన్నారు.

Also Read : ‘వాసి వాడి.. తస్సాదియ్యా’..సోగ్గాడు అదిరే జోక్ పేల్చాడు, కంటెస్టెంట్లు పొట్టచెక్కలయ్యేలా నవ్వారు