విశాఖపట్నంలో మరో విషవాయువు లీకైంది. ఎల్జీ పాలిమర్స్ ఘటన తాలూకు స్టైరిన్ ఛాయలు ఇంకా మానకముందే పరవాడ పారిశ్రామికవాడలో మరో కంపెనీలో గ్యాస్ లీక్ అయింది. సాయినార్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అర్ధరాత్రి దాటాక రియాక్టర్ నుంచి బెంజిమిడజోల్ అనే రసాయన వాయువు లీక్ అయింది. ఈ ఘటనలో ఇద్దరు చనిపోగా.. నలుగురు అస్వస్థతకు గురయ్యారు. దీంతో విశాఖ ప్రజలు మరోసారి ఉలిక్కిపడ్డారు. ఇక ప్రమాదం విషయాన్ని తెలుసుకున్న జిల్లా కలెక్టర్ వినయ్‌చంద్, కమిషనర్ ఆర్కే మీనా వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని దగ్గరుండి సమీక్షించారు.
సీపీ ఆర్కే మీనా మాట్లాడుతూ.. ”పరవాడలోని ఫార్మాసిటీలో జరిగిన గ్యాస్ లీక్ ఘటనలో ఇద్దరు మృతి చెందారని, నలుగురు గాజువాక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. తెనాలికి చెందిన షిఫ్ట్ ఇంచార్జ్ నరేంద్ర, విజయనగరానికి చెందిన కెమిస్ట్ గౌరీశంకర్ ఈ ఘటనలో మృతి చెందారని తెలిపారు. అస్వస్థతకు గురైన చంద్రశేఖర్, ఆనంద్‌బాబు, జానకీరామ్, సూర్యనారాయణరాజులను గాజువాక ఆసుపత్రికి చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. అయితే హెల్పర్ చంద్రశేఖర్ పరిస్థితి విషమంగా ఉండటంతో కేర్ ఆసుపత్రికి తరలించామన్నారు. కాగా, ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామన్నారు.
Also Read: అన్‌లాక్ 2.0: ప్రయాణాలపై ఎలాంటి ఆంక్షలు పెట్టవద్దు..!