ఢిల్లీ వెళ్లిన సీఎం జగన్ అమిత్ షాతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో నివర్ తుఫాను కారణంగా దెబ్బతిన్న పంటలు, ధ్వంసమైన రహదారులు, ఆస్తి నష్టం గురించి వివరించారు. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలు సహా నిధుల విషయంలో కాస్త జోక్యం చేసుకోవాలని కోరారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలో పరిష్కారం కాకుండా ఉన్న సమస్యలను అమిత్ షా దృష్టికి సీఎం తీసుకువెళ్లారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.
పోలవరం ఆయకట్టు కింద పంటలకు 2022 ఖరీఫ్ సీజన్‌లో నీళ్లు అందించాల్సి ఉన్నందున వచ్చే ఏడాది డిసెంబర్ నాటికే ప్రాజెక్టు పనులు పూర్తయ్యేలా ప్రణాళికను అమలు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలవరానికి సంబంధించి నిధులు విషయంలో జోక్యం చేసుకుని..ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సీఎం జగన్ అమిత్ షాను కోరారట.
ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, అవినాష్‌రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, భరత్ ఉన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ పర్యటన ముగించుకొని వచ్చిన వెంటనే సీఎం జగన్ కూడా ఢిల్లీకి వెళ్లడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఢిల్లీ కేంద్రంగా రైతు ఉద్యమం తీవ్ర స్థాయికి చేరుకుంటున్న తరుణంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఢిల్లీ పర్యటన చర్చనీయాంశమైంది.
గత అక్టోబర్ లో మూడు రోజుల వ్యవధిలోనే రెండు సార్లు ఢిల్లీకి వెళ్లొచ్చిన జగన్.. రెండు నెలల గ్యాప్ తర్వాత హస్తిన బాట పట్టారు. పర్యటనలో భాగంగా హోం మంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్రమంత్రులను సీఎం జగన్ కలవనున్నారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి షెకావత్ తోనూ సీఎం భేటీ కానున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతామన్ ను కూడా కలుస్తారని తెలుస్తోంది.
700 మీడియా సమావేశాలు, 700 సదస్సులు నిర్వహించి.. కొత్త వ్యవసాయ చట్టాల వల్ల రైతులకు జరిగే ప్రయోజనాలు వివరించాలని తీర్మానించింది. ఈ సమయంలో ఏపీలో ఈ సదస్సులు విజయవంతం చేసేందుకు సహకరించాలని సీఎం జగన్‌ను అమిత్ షా కోరనున్నట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.