Anakapalle pushpa case: అనకాపల్లిలో ఓ యువతి తనకు కాబోయే భర్త గొంతు కోసిన ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. ఇష్టం లేని పెళ్లి చేసుకోలేక వరుడి గొంతు కోసినట్లు యువతి పోలీసులకు తెలిపింది. యువతిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆమెను విశాఖపట్నం జైలుకు తరలించారు. అనకాపల్లి జిల్లాలోని మాడుగుల మండలం ఘాట్‌రోడ్డు జంక్షన్‌కు చెందిన అద్దెపల్లి రామునాయుడు, రావికమతం గ్రామానికి చెందిన పుష్ప (22) కు వివాహం నిశ్చయమైంది. మే 20న వీరి వివాహం జరగాల్సి ఉంది. ఈ క్రమంలో అత్తామామల ఆహ్వానం మేరకు రామునాయుడు సోమవారం రావికమతం వెళ్లాడు. ఈ సమయంలో స్నేహితులకు పరిచయం చేస్తానని రామునాయుడిని తీసుకెళ్లిన పుష్ప.. మార్గమధ్యంలోని ఓ ఫ్యాన్సీ దుకాణం వద్ద గిఫ్ట్.. అంటూ కత్తి కొనుగోలు చేసింది. ఆ తర్వాత వారిద్దరూ కోమళ్లపూడి శివారులోని అమరపురి ఆశ్రమం వద్దకు వెళ్లారు.
ఈ సమయంలో ‘సర్‌ప్రైజ్ గిఫ్ట్’ ఇస్తానంటూ రాము కళ్లకు చున్నీతో గంతలు కట్టిన పుష్ప.. కత్తితో గొంతు కోసింది. రాము బలవంతంగా చున్నీ విప్పేసుకోని.. ఆమె ఏమైనా చేసుకుంటుందేమోనన్న ఆందోళనతో పుష్పను స్కూటీపై తీసుకొచ్చాడు. కాగా.. ప్రస్తుతం రామునాయుడికి ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. రాము పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా.. ప్రస్తుతం రామునాయుడు, పుష్పకు సంబంధించిన ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. రాముపై దాడి చేయడానికి ముందు పుష్ప అతనితో సెల్ఫీ ఫొటో దిగింది. ఆ తర్వాత అతనిపై దాడి చేసినట్లు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటం చర్చనీయాంశంగా మారింది.
అయితే.. ఆమె తొందరపడి ఈ దారుణ నిర్ణయం తీసుకుందంటూ పలువురు పేర్కొంటున్నారు. పెళ్లి ఇష్టం లేదని రాముతో చెబితే బాగుండేదని కానీ.. ఇలా చేయడం బాలేదంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు.
Also Read: