మహిళ ఐఏఎస్ అధికారిణి ఇంటిపై ఏసీబీ దాడులు.. భారీగా నగలు, నగదు సీజ్..!

కర్ణాటక మహిళా ఐఏఎస్‌ అధికారిణి ఇంటిపై అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు.

మహిళ ఐఏఎస్ అధికారిణి ఇంటిపై ఏసీబీ దాడులు.. భారీగా నగలు, నగదు సీజ్..!

కర్ణాటక మహిళా ఐఏఎస్‌ అధికారిణి ఇంటిపై అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. డాక్టర్ బీ సుధ నివాసాల్లో శనివారం సోదాలు చేపట్టిన ఏసీబీ అధికారులు పెద్ద మొత్తంలో బంగారం, నగదు, ఇతర విలువైన వస్తువులు, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరు డెవలప్‌మెంట్ అథారిటీ (బీడీఏ)లో స్పెషల్ ల్యాండ్ అక్విజిషన్ అధికారిణిగా పనిచేసిన సమయంలో డాక్టర్ సుధపై పెద్దఎత్తున అవినీతికి పాల్పడ్డారని, లంచం తీసుకున్నట్లు ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు దాడులు చేశారు.

ఓ ఫిర్యాదు ఆధారంగా.. శనివారం ఉదయం కొడిగ‌హ‌ల్లి, యెల‌హంక‌లో, మైసూరు, ఉడిపిలో ఉన్న సుధ ఇళ్లపై ఏక కాలంలో ఏసీబీ దాడులు జరిపింది. బెంగుళూరు డెవ‌ల‌ప్మెంట్ అథారిటీలో ఆమె గ‌తంలో ల్యాండ్ అక్విజిష‌న్ ఆఫీస‌ర్‌గా ప‌నిచేశారు. ప్రస్తుతం ఆమె బ‌యోటెక్నాల‌జీ డిపార్ట్‌మెంట్‌లో అడ్మినిస్ట్రేటీవ్‌గా విధులు నిర్వహిస్తున్నారు. సుధ అవినీతికి సంబంధించి లోకాయుక్తలో పిటిషన్‌ దాఖలు చేయడంతో ఆమె ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. సుధ భర్త శాండల్‌వుడ్‌లో సినీ నిర్మాతగా ఉన్నారు. అక్రమంగా సంపాదించిన డబ్బుతో సుధ భర్త సినిమాలను నిర్మిస్తున్నారనే ఆరోపణలు సైతం ఉన్నాయి. 2015లోనూ ఆమె నివాసాలపై ఏసీబీ అధికారులు దాడులు జరిపినట్లు చెబుతున్నారు.

ఇవాళ జరిపిన దాడుల్లో పెద్ద మొత్తంలో బంగారం, 10 లక్షల రూపాయల నగదు, ఖరీదైన ఎస్‌యూవీ కారును స్వాధీనం చేసుకున్నారు. కొన్ని డాక్యుమెంట్లను సీజ్ చేశారు. డాక్టర్ సుధ లంచం రూపంలో బంగారం, వాహనాలను తీసుకున్నట్లు తేలింది. లెక్క తేలని కోటి రూపాయల నగదు, అయిదు విలాసవంతమైన బంగళాలు, పెద్ద మొత్తంలో బంగారాన్ని గుర్తించామని, ఆమె ఆదాయానికి మించినవేనని నిర్ధారించినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. బెంగళూరు నగర శివార్లలో లే అవుట్లు వెలుస్తోన్న సమయంలో వ్యవసాయ భూములను రెసిడెన్షియల్‌గా మార్చడానికి పెద్ద ఎత్తున ముడుపులు స్వీకరించినట్లు తమ విచారణలో తేలిందని, ఆమెపై కేసు నమోదు చేశామని అధికారులు వెల్లడించారు.

Click on your DTH Provider to Add TV9 Telugu