1993 ముంబై సీరియల్ పేలుళ్ల ప్రధాన నిందితుల్లో ఒకరైన మునాఫ్ హలారీని గుజరాత్ యాంటీ టెర్రర్ స్క్వాడ్ ముంబై ఎయిర్‌పోర్టులో అరెస్ట్ చేసింది. పాకిస్థాన్ పాస్‌పోర్టుతో ముంబయి విమానాశ్రయం నుంచి దుబాయి వెళ్తుండగా వారు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇటీవల గుజరాత్‌లో హెరాయిన్ మాదకద్రవ్యాల స్మగ్లింగ్ కేసులో ఏటీఎస్ బృందం ఐదుగురిని అరెస్టు చేసింది. అందులో మునాఫ్ హలరీ కూడా సూత్రధారిగా ఉండటంతో అతడి కోసం కొన్ని రోజులుగా గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో మునాఫ్ ముంబయి నుంచి పాక్ పాస్‌పోర్టుతో దుబాయి వెళ్తుండగా అదుపులోకి తీసుకున్నారు.
నార్కోటిక్స్ డ్రగ్స్ కేసులో వాంటెడ్ లిస్టులో ఉన్న మునాఫ్ హలరీ.. పేరుమోసిన గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీంకు ప్రధాన అనుచరుడైన టైగర్ మెమన్‌కు సన్నిహితుడుగా పోలీసులు తెలిపారు. 1993 ముంబయి వరుస పేలుళ్లలో ఇతడు ప్రధాన సూత్రధారి. జవేరీ బజార్‌లో బాంబు పేలుడులో ఉపయోగించిన స్కూటర్‌ను హలరీ కొనుగోలు చేశాడని విచారణలో తేలింది.