18 ఏళ్లకే వెంటాడిన మృత్యువు.. పండక్కి ఇంటికొచ్చి తిరిగిరాని లోకాలకు వెళ్లిన యువకుడు!
ఖమ్మం జిల్లాలో తీవ్ర విషాదం వెలుగు చూసింది. పండగ సెలవుల కోసం ఇంటికొచ్చిన రాఘవ అనే బీటెక్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి.. ఇంట్లోనే గుండెపోటుతో ఒక్కసారి కుప్పకూలి పోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు హాస్పిటల్కు తీసుకెళ్లేలోపే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. కళ్లముందే చేతికొచ్చిన కొడుకు చనిపోవడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న కుమారుడు ప్రయోజకుడై తమకు అండగా నిలుస్తాడని ఆశలు పెట్టుకున్న ఆ తల్లిదండ్రులకు తీరని శోకం మిగిలింది. దసరా సెలవులకు ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతున్న సమయంలోనే, బీటెక్ విద్యార్థి రాఘవ (18) ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందాడు.
వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీకి చెందిన 10వ వార్డు సీపీఎం కౌన్సిలర్ కిన్నెర కృష్ణ కుమారుడు రాఘవ.. హైదరాబాద్లోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. దసరా సెలవులు కావడంతో రెండు రోజుల క్రితమే స్వగ్రామమైన గండగలపాడులోని ఇంటికి వచ్చాడు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఎంతో సంతోషంగా గడిపాడు. పండుగ సందర్భంగా కుమారుడికి తండ్రి కొత్త బట్టలు కూడా కొనిచ్చాడు.
కొత్త బట్టలు తీసుకుని ఇంట్లోకి వెళ్లిన కాసేపటికే రాఘవ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అది గమనించిన కుటుంబ సభ్యులకు మొదట ఏం జరిగిందో అర్థం కాలేదు. వెంటనే తేరుకుని రాఘవకు సీపీఆర్ చేస్తూనే, వైరాలోని ఓ ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే రాఘవ ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దాంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
పండుగకని ఇంటికి వచ్చిన కొడుకు కళ్లముందే విగతజీవిగా మారడంతో ఆ తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదించారు. చేతికందివచ్చిన కొడుకు ఇంత చిన్న వయసులోనే గుండెపోటుతో చనిపోవడం కుటుంబ సభ్యులనే కాక స్థానికులందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి, విషాదానికి గురిచేసింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
