పాన్ (పర్మనెంట్ అకౌంట్ నంబర్) కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానించడానికి గతంలో ఎనిమిది సార్లు ఆదాయపు పన్ను శాఖ గడువు పొడిగించినప్పటికీ, 17 కోట్లకు పైగా పాన్ కార్డ్ హోల్డర్లు ఇంకా రెండు పత్రాలను లింక్ చేయలేదు. పాన్ కార్డును ఆధార్‌తో లింక్ చేయకపోతే ఆ కార్డులు చెల్లబోవని ఆదాయపు పన్ను శాఖ ప్రకటించనుంది. ఇలా లింక్ చేయని పాన్ కార్డులు ప్రస్తుతం 17 కోట్లకు పైనే ఉన్నట్లు అంచనా. దేశం మొత్తం మీద ఇప్పటివరకు జారీ అయిన పాన్ కార్డులు 48 కోట్లకు పైగానే. వీటిలో 17 కోట్లకు పైనే పాన్ కార్డులకు ఆధార్ నెంబర్ లింక్ చేయలేదు.
“ఒక వ్యక్తి ఆధార్ నంబర్‌ను తెలియజేయడంలో విఫలమైతే, అటువంటి వ్యక్తికి కేటాయించిన శాశ్వత ఖాతా సంఖ్య నోటిఫైడ్ తేదీ తర్వాత నిబంధనల ప్రకారం పనిచేయదు” అని ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 139AA లోని 41 వ నిబంధన తెలియజేస్తుంది. ఈ సవరణ 1 సెప్టెంబర్, 2019 నుండి అమల్లోకి వచ్చింది. ఆధార్‌తో అనుసంధానించబడితే తప్ప అలాంటి అన్ని పనిచేయని పాన్ కార్డులు నిరుపయోగంగా మారతాయని స్పష్టంగా తెలుస్తుంది. మొన్న జనవరి వరకు 30.75 లక్షల పాన్ కార్డులను ఆధార్ నెంబర్‌తో లింక్ చేశారని, ఇంకా ఆధార్ లింక్ చేయని పాన్ కార్డులు 17.58 కోట్ల వరకూ ఉన్నాయని ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ లోక్‌సభకు వెల్లడించిన విషయం తెలిసిందే.