Madanapalle Incident: వెలుగులోకి సంచలన విషయాలు.. ‘శివ ఈజ్ కమింగ్’ అంటూ మృతులు పోస్ట్
ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా, మదనపల్లెలో జరిగిన దారుణ సంఘటన ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. మూఢనమ్మకాల ముసుగులో..

Madanapalle Daughters Murder Incident: ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా, మదనపల్లెలో జరిగిన దారుణ సంఘటన ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. మూఢనమ్మకాల ముసుగులో మునిగిన దంపతులు పెళ్లీడుకొచ్చిన ఇద్దరు కూతుళ్లను దారుణంగా కడతేర్చిన విషయం తెలిసిందే. అయితే ఈ జంట హత్యల కేసులో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హత్యకు ముందు మల్లూరు పురుషోత్తం నాయుడు, పద్మజ కూతుళ్లు అలేఖ్య, సాయిదివ్య ఇన్‌స్టాలో చేసిన పోస్టులు పలు అనుమానాలకు తావిస్తున్నాయి. ‘‘వర్క్ ఈజ్ డన్.. శివ ఈజ్ కమింగ్’’ అంటూ వారు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే ఈ పోస్టులు మూడు రోజుల క్రితం చేసినట్లు పోలీసులు సోమవారం ఉదయం వెల్లడించారు.
ఈ ఘటన వెనుక ఇతర ప్రాంతాలకు చెందిన వ్యక్తుల ప్రమేయం ఉందని, వారు తరుచూ పురుషోత్తం నాయుడు ఇంటికొచ్చి పూజలు చేసేవారని పోలీసులకు సమాచారం అందింది. దీనిప్రకారం పోలీసులు సీసీ టీవీ పుటేజీలను క్షణ్ణంగా పరిశీలిస్తున్నారు. మెహర్ బాబా, ఓషో భక్తులైన పురుషోత్తం నాయుడు, భార్య పద్మజ.. మూఢ నమ్మకంతో తమ కుమార్తెలను కడతేర్చినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. అయితే ఈ దారుణ ఘటనకు పాల్పడేలా ఉసిగొల్పిన వ్యక్తుల కోసం పోలీసులు ఆరాతీస్తున్నారు. క్లూస్ టీంను కూడా రంగంలోకి దింపి విచారణ జరుపుతున్నారు.