Safety Pin: సేఫ్టీ పిన్‌ చరిత్ర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే.. అసలు దాని కింద రంధ్రం ఎందుకు ఉంటుందంటే.?

చిన్న వస్తువే అయినా.. ప్రతి ఇంట్లోనూ నిత్యం అవసరమయ్యే అత్యంత ఉపయోగకరమైన సాధనం సేఫ్టీ పిన్. కేవలం ఒక తీగను వంచి తయారు చేసిన ఈ చిన్న పరికరం వెనుక వేల ఏళ్ల చరిత్ర, అద్భుతమైన ఇంజనీరింగ్ దాగి ఉంది. సేఫ్టీ పిన్ పుట్టుక, దాని పరిణామ క్రమం, మధ్యలో ఆ హోల్ ఎందుకు ఉన్నది అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

Safety Pin: సేఫ్టీ పిన్‌ చరిత్ర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే.. అసలు దాని కింద రంధ్రం ఎందుకు ఉంటుందంటే.?
Why Does A Safety Pin Have A Loop

Updated on: Jan 18, 2026 | 1:05 PM

బట్టలు ఊడిపోకుండా ఉండాలన్నా, విరిగిపోయిన జిప్పులకు తాత్కాలిక పరిష్కారం కావాలన్నా అందరికీ ముందుగా గుర్తొచ్చేది సేఫ్టీ పిన్. అయితే మనం వాడుతున్న ఈ ఆధునిక రూపం వెనుక కొన్ని శతాబ్దాల ప్రస్థానం ఉంది. సేఫ్టీ పిన్ చరిత్ర చాలా పురాతనమైనది. లాటిన్ భాషలో దీనిని ఫైబులే అని పిలుస్తారు. ఇది కాంస్య యుగంలోనే యూరప్ ఖండంలో ఉద్భవించిందని చరిత్రకారులు చెబుతారు. అయితే అప్పట్లో ఇవి రెండు రకాలుగా ఉండేవి.

ఉత్తర యూరోపియన్ పద్ధతి: ఇది చాలా క్లిష్టమైన డిజైన్. ఇందులో రెండు వేర్వేరు సూదులు ఉండేవి. ఒక సూదికి ఉన్న రంధ్రం గుండా మరో సూది వెళ్లి హుక్‌కు తగిలించబడేది. దీనికి స్ప్రింగ్ ఉండేది కాదు.

మధ్య యూరోపియన్-గ్రీకు పద్ధతి: ఇది మన ఆధునిక సేఫ్టీ పిన్‌కు చాలా దగ్గరగా ఉండేది. ఒకే వైర్‌ను మధ్యలో స్ప్రింగ్ లాగా వంచి, ఒక చివర పదునుగా.. మరో చివర ఆ పదునైన భాగాన్ని లాక్ చేసేలా వక్రంగా తయారు చేసేవారు.

ఆధునిక సేఫ్టీ పిన్ సృష్టికర్త వాల్టర్ హంట్

మనం ఇప్పుడు చూస్తున్న ఆధునిక రూపంలోని సేఫ్టీ పిన్‌ను 1849లో వాల్టర్ హంట్ అనే వ్యక్తి కనుగొన్నాడు. కేవలం ఒక తీగను వంచి, దానికి స్ప్రింగ్-లోడెడ్ నిర్మాణాన్ని జోడించడం ద్వారా దీనిని మరింత సురక్షితంగా మార్చాడు.

ఇంజనీరింగ్ అద్భుతం

సేఫ్టీ పిన్‌ను నిశితంగా పరిశీలిస్తే, దాని దిగువ భాగంలో తీగ ఒక చక్రంలా చుట్టబడి ఉంటుంది. ఇది కేవలం డిజైన్ కోసం కాదు అది ఒక స్ప్రింగ్ లాగా పనిచేస్తుంది.

  • ఈ స్ప్రింగ్ పిన్‌పై నిరంతరం ఒత్తిడిని సృష్టిస్తుంది.
  • ఈ ఒత్తిడి వల్లే పిన్ కొన దాని హుక్‌లో గట్టిగా పట్టుకుని ఉంటుంది.
  • ఒకవేళ ఈ స్ప్రింగ్ లేకపోతే పిన్ పదేపదే తెరుచుకుని గాయాలకు కారణమయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకే దీనికి సేఫ్టీ పిన్ అని పేరు వచ్చింది.

ఒక చిన్న తీగ ముక్కను వంచి మానవాళికి ఇంతటి గొప్ప సౌకర్యాన్ని అందించిన వాల్టర్ హంట్ ఆవిష్కరణ.. కాలం మారినా తన ప్రాముఖ్యతను కోల్పోలేదు.