వాతావరణ అలర్ట్ జారీ.. ఇంతకీ ఏయే హెచ్చరిక ఎప్పుడు జారీ చేస్తారు?

తుపానులు సముద్ర ప్రాంతాల్లో ఉద్ధృతంగా ఏర్పడినప్పుడు, మొదటగా ప్రభావితమయ్యే ప్రాంతాలు పోర్టులు. దీంతో మత్స్యకారులు, కార్గో కార్యకలాపాలు, సముద్ర రవాణా అన్నీ తుఫాను హెచ్చరిక వ్యవస్థపై ఆధారపడి ఉంటాయి. కాకినాడ పోర్ట్‌లో ప్రస్తుతం పదో నెంబర్‌ హెచ్చరిక జారీ చేశారు. మిగతా చాలా పోర్టుల్లోనూ దాదాపు అలాంటి పరిస్థితి ఉంది. ఇంతకీ ఏయే హెచ్చరిక ఎప్పుడు జారీ చేస్తారు?

వాతావరణ అలర్ట్ జారీ.. ఇంతకీ ఏయే హెచ్చరిక ఎప్పుడు జారీ చేస్తారు?
Weather Warning

Updated on: Oct 29, 2025 | 12:14 AM

కాకినాడ పోర్ట్‌లో ప్రస్తుతం పదో నెంబర్‌ హెచ్చరిక జారీ చేశారు. మిగతా చాలా పోర్టుల్లోనూ దాదాపు అలాంటి పరిస్థితి ఉంది. ఇంతకీ ఏయే హెచ్చరిక ఎప్పుడు జారీ చేస్తారు? తుపానులు సముద్ర ప్రాంతాల్లో ఉద్ధృతంగా ఏర్పడినప్పుడు, మొదటగా ప్రభావితమయ్యే ప్రాంతాలు పోర్టులు. దీంతో మత్స్యకారులు, కార్గో కార్యకలాపాలు, సముద్ర రవాణా అన్నీ తుఫాను హెచ్చరిక వ్యవస్థపై ఆధారపడి ఉంటాయి. అందుకే భారత వాతావరణ విభాగం-IMD తుపాను తీవ్రత, దూరం, దిశ ఆధారంగా ప్రత్యేకంగా 1 నుంచి 11 వరకు నంబర్లలో ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ తీరం వైపు దూసుకొస్తున్న “మొంథా” తుపాను కారణంగా మచిలీపట్నం, కృష్ణపట్నం, నిజాంపట్నం పోర్టుల్లో ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు.

1, 2వ నంబరు హెచ్చరికలు

ఇవి కేవలం జాగ్రత్త సూచనలు మాత్రమే. తుపాను ఒక పోర్టుకి 400 నుంచి 750 నాటికల్‌ మైళ్లు దూరంలో ఉన్నప్పుడు 1వ, 2వ నంబరు హెచ్చరికలు జారీ చేస్తారు. అంటే అల్పపీడనం ఏర్పడినప్పుడు తొలిగా పోర్టుకు హెచ్చరించే సూచనలు. తక్షణం జాగ్రత్తపడాల్సిన అవసరం లేదు. కానీ అప్రమత్తంగా ఉండాలన్నదానికి సంకేతాలు

3, 4వ నంబరు హెచ్చరికలు

ఈ హెచ్చరికలు జారీ చేస్తే అప్రమత్తంగా ఉండాలి. తుపాను 150 నుంచి 400 నాటికల్‌ మైళ్లు దూరంలో ఉన్నప్పుడు 3వ, 4వ నంబరు ప్రమాద హెచ్చరికలు ప్రకటిస్తారు. ఇవి తుపాను పోర్టుకు దగ్గర పడే అవకాశం ఉందని సంకేతం. ఈసమయంలో మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తారు

5, 6వ నంబరు హెచ్చరికలు

ఇక్కడ నుంచి అసలు ప్రమాద సూచికలు ప్రారంభం అవుతాయి. తుపాను 50 నుంచి 150 నాటికల్‌ మైళ్లు దూరంలో ఉన్నప్పుడు 5వ, 6వ నంబరు హెచ్చరికలు జారీ చేస్తారు. ఈ సమయంలో గాలులు బలంగా వీస్తాయి, అలలు ఎగసిపడతాయి. పోర్టు పరిసరాల్లో ప్రభావం స్పష్టంగా కనిపించడం మొదలవుతుంది. ఈ నంబర్ల హెచ్చరికలు జారీ చేస్తే, పోర్టులోని అన్ని కార్యకలాపాలన్నీ నిలిపేయాలి.

7వ నంబర్ హెచ్చరిక

అత్యంత ప్రమాదకర తుఫాన్ దశ ఇది. భారీ వర్షాలతో పాటు గంటకు 90 నుంచి 100కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. ఐదుగంటల కిందటే కాకినాడ పోర్టుకు 7వ నంబర్ హెచ్చరిక జారీ అయింది. ఇప్పుడు గ్రేట్ డేంజర్ సిగ్నల్‌ జారీ అయింది. ప్రస్తుతం కాకినాడలో పోర్టు కార్యకలాపాలన్నీ నిలిచిపోయాయి.

8 నుంచి 10వ నంబరు హెచ్చరికలు

ఈ నంబర్ హెచ్చరికలు అత్యంత ప్రమాద స్థాయిని తెలియజేస్తాయి. తుపాను 100 నాటికల్‌ మైళ్ల లోపల ఉన్నప్పుడు 8, 9, 10వ నంబరు హెచ్చరికలు జారీ చేస్తారు. తుపాను నేరుగా పోర్టు, సమీప తీరానికి తాకే ప్రమాదం ఉందని అర్థం. ఈ దశలో గాలి వేగం 200 కి.మీకు పైగా ఉంటుంది. ఈ సమయంలో పోర్టు పూర్తిగా మూసివేయాలి. నౌకలను సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి ఉంటుంది. ఎమర్జెన్సీ రెస్క్యూ టీంలను సిద్ధం చేయాలి. అదే విధంగా పోర్టు మొత్తం ఖాళీ చేయాలి.

11వ నంబరు హెచ్చరిక

ఇది ఎమర్జెన్సీ సిట్చువేషన్. 11వ నంబరు హెచ్చరిక అంటే తుపాను పోర్టు సమీపంలోనే ఉందని, తీవ్రమైన గాలులు వీస్తాయని అర్థం. ఈ హెచ్చరిక వచ్చిందంటే సమాచార వ్యవస్థలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. విద్యుత్‌, కమ్యూనికేషన్‌, రవాణా అంతరాయం కలుగుతుంది. ప్రజలు, సిబ్బంది సురక్షిత ప్రదేశాల్లో ఉండాలి.

ఇలా వాయుగుండం కదలికలను బట్టి తుపాను హెచ్చరికలు జారీ చేస్తారు. ప్రస్తుతం కాకినాడ పోర్టుకు గ్రేట్ డేంజర్ సిగ్నల్ జారీ అయింది. కాకినాడో పోర్టులో కార్గో సర్వీసులన్నీ నిలిపివేయాలని ఆదేశాలిచ్చారు. ఇలా హెచ్చరికల వ్యవస్థ తీర ప్రాంత ప్రజలు, అదే విధంగా మత్స్యకారుల భద్రతకు ఎంతో కీలకం. మత్స్యకారులు, పోర్టు అధికారులు, తీరప్రాంత ప్రజలు ఈ సూచనల అర్థం తెలుసుకుంటే ముందుగానే అప్రమత్తం కావచ్చు. తుఫాన్ ప్రభావం నుంచి సురక్షితంగా బయటపడవచ్చు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండ..