Alcohol: సాధారణంగా చాలామంది మానసిక ఉల్లాసం కోసం మద్యం సేవిస్తుంటారు. ఆల్కహాల్ మితంగా తీసుకున్నప్పుడు మెదడు ఉత్తేజితమవుతుంది, శరీరంలో ఉత్సాహం పెరుగుతుంది. అప్పుడు శరీరంలో ఉత్పత్తయ్యే డోపమైన్, ఎండార్ఫిన్ లాంటి హార్మోన్లు మెదడును తాత్కాలికంగా ఉత్తేజపరుస్తాయి. మరి, ఆల్కహాల్ ఎక్కువగా తాగితే ఎందుకు శరీరం అంత మత్తుగా ఉంటుంది? ఏ పనీ చేయాలనిపించదు ఎందుకు?. తినేదైనా, తాగేదైనా… ప్రతిదానికీ ఒక పరిమితి అంటూ ఉంటుంది. ఆల్కహాల్ విషయంలో ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే, అతిగా ఆల్కహాల్ తీసుకుంటే మెదడులో క్రియాశీలత తగ్గిపోతుంది. నాడులు దెబ్బతింటాయి. గుండె కొట్టుకునే వేగం తగ్గుతుంది. శ్వాస క్రియ కూడా నెమ్మదిస్తుంది. అది కొన్నిసార్లు మరణానికి కూడా దారితీయవచ్చు.
ఆల్కహాల్ ప్రభావం వివిధ దశలుగా ఉంటుంది. ఆఖరి దశ మరణం. మద్యం ఎంత ఎక్కువగా తీసుకుంటే దుష్ప్రభావాల తీవ్రత అంతగా పెరుగుతుంది. రక్తంలో ఆల్కహాల్ మెతాదు ఒక పరిమితి వరకు చేరుకున్నాక మొదట మాటల్లో తేడా వస్తుంది. నడకలోనూ మార్పు వస్తుంది. శరీర అవయవాల మధ్య సమన్వయం తగ్గుతుంది. తను చాలా తెలివిగల వ్యక్తినని అన్న భావన కలిగిస్తుంది. ఇంకా మద్యం తీసుకుంటూ ఉంటే కొంతసేపయ్యాక సోయి లేకుండా కిందపడిపోతారు. ఆలోచించే విచక్షణ కోల్పోతారు. అంటే, మెదడులో క్రియాశీలత బాగా తగ్గిపోతుంది. ఆల్కహాల్ పరిమితి అందరికీ ఒకేలా ఉండదు. కొందరికి కిక్కు చాలా తొందరగా, కొందరికి కాస్త ఆలస్యంగా రావచ్చు. ఆల్కహాల్ రక్తనాళాలను వెడల్పు చేస్తుంది. శరీరంలోని ప్రతి అణువుకూ వెళ్తుంది. ప్రతి అవయవానికీ చేరుతుంది.
శరీరంలో ఇతర పదార్థాలకంటే ఆల్కహాల్ వేగంగా..
ఇతర పదార్థాల కంటే ఆల్కహాల్ చాలా వేగంగా శరీరంలోకి వెళ్తుంది. జీర్ణాశయంలోకి వెళ్లిన మద్యం సరిగా జీర్ణం కాదు. కొంత ఆల్కహాల్ నేరుగా జీర్ణాశయం నుంచే రక్తంలో కలుస్తుంది. ఆ రక్తం ద్వారా మెదడు, కాలేయం సహా శరీరంలోని ప్రతి అవయవానికీ వెళ్తుంది. ఆ తర్వాత ఆల్కహాల్ కణాలను విరిచేసేందుకు కాలేయం ప్రయత్నిస్తుంది. అందుకోసం ఎంజైములను కాలేయం ఉత్పత్తి చేస్తుంది. ఆ ఎంజైములు ఇతర పదార్థాల అణువులను విడగొడతాయి. అలా ఆల్కహాల్ మొదట ఎసిటాల్డిహైడ్ గా విడిపోతుంది. ఎసిటాల్డిహైడ్ ఆ తర్వాత ఎసిటిక్ ఆమ్లంగా, ఆ తర్వాత కార్బన్‌డయాక్సైడ్‌గా విడిపోతుంది.
ఈ విచ్ఛన్న ప్రక్రియలోని దశల్లో కొంత శక్తి కూడా విడుదల అవుతుంది. బాగా మద్యం తాగేవారు కొందరు బరువు పెరగడానికి ఆ శక్తి కూడా ఒక కారణం. మద్యం అతిగా తాగేవారికి ఎక్కువ శక్తి ఆల్కహాల్ నుంచి వస్తుంది కాబట్టి, తక్కువ ఆహారం తీసుకుంటారు. అప్పుడు వారికి కెలొరీలు మాత్రమే అందుతాయి తప్పితే కీలకమైన ఇతర పోషకాలు అందవు. అందుకే బరువు పెరుగుతారు, నీరసంగా… అనారోగ్యానికి గురైనట్లుగా కనిపిస్తుంటారు. పనులను చురుగ్గా చేయలేకపోతారు.
మద్యం అతిగా తాగేవారికి..
మద్యం అతిగా తాగేవారికి ఆల్కహాల్ నుంచి ఎక్కువ మొత్తంలో కెలరీలు అందుతాయి. మొదట మద్యం మితంగానే తీసుకుంటున్నట్లు అనిపిస్తుంది. కానీ, స్వీయ నియంత్రణ లేకపోతే, క్రమంగా వ్యసనంగా మారే ప్రమాదం ఉంటుంది. ఎసిటాల్డిహైడ్ వల్ల కాలేయం దెబ్బతింటుంది. హెపటైటిస్, కాలేయ క్యాన్సర్ లాంటి సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
వాంతులు ఎందుకొస్తాయి?
ఆల్కహాల్ మొదటి దశ విచ్ఛిన్న ప్రక్రియలో ఏర్పడిన ఎసిటాల్డిహైడ్ అనే రసాయన పదార్థమే వాంతులకు కారణం. అంటే, ఆ రసాయనం మన శరీరంలో విడుదలైనప్పుడు వాంతులు వచ్చే అవకాశం ఉంటుంది. మద్యం ఎంత ఎక్కువ తాగితే, మీకు అంత ఎక్కువ వాంతులు రావచ్చు. ఏదైనా పదార్థం తినగానే మీకు వాంతులు, వీరేచనాలు వస్తున్నాయంటే.. దాని అర్థం మీ శరీరం నుంచి ఆ పదార్థాన్ని బయటకు పంపించాలంటూ మెదడు ఇచ్చిన ఆఖరి సూచనగా భావించాలి. ఆల్కహాల్ విషయంలోనూ అలాగే అర్థం చేసుకోవాలి. వాంతులు వస్తున్నా ఆగకుండా అదే పనిగా మద్యం తాగడం అంటే సముద్రంలో ఆటుపోట్లను నిలువరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు లెక్క.
హ్యాంగోవర్ దిగాలంటే..
దురదృష్టం ఏంటంటే.. హ్యాంగోవర్‌ను తగ్గించేందుకు ప్రస్తుతం మందులు లేవు. మత్తు దిగేదాకా తాగకుండా విరామం ఇవ్వడమే ఉత్తమైన మార్గం. కాలేయం ఒక గంటలో 8 నుంచి 12 గ్రాముల ఆల్కహాల్‌ను విచ్ఛిన్నం చేయగలదు. హ్యాంగోవర్ నుంచి బయటపడాలంటే మరింత ఆల్కహాల్ తాగకుండా ఉండాలి.