బీ అలెర్ట్.. భవిష్యత్తులో నీళ్లు కావాలంటే వాటర్‌ బంక్స్‌కి వెళ్లాల్సిందే..!

పెట్రోల్‌, డీజిల్ కావాలంటే, పెట్రోల్‌ బంక్‌కి వెళతాం. భవిష్యత్తులో నీళ్లు కావాలంటే, వాటర్‌ బంక్స్‌కి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందంటున్నారు పర్యావరణవేత్తలు. పెట్రోల్‌ బంక్స్‌ లాగా వాటర్‌ బంక్స్‌. ఈ పేరు వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, అది రాబోయే నీటి కష్టాలకు సంకేతంగా చూడాల్సి ఉంటుంది. అసలు ఫ్యూచర్‌లో, ఇలాంటి పరిస్థితి ఎందుకు వస్తుందో తెలుసుకుందాం..

బీ అలెర్ట్..  భవిష్యత్తులో నీళ్లు కావాలంటే వాటర్‌ బంక్స్‌కి వెళ్లాల్సిందే..!
Water Scarcity

Updated on: Mar 23, 2025 | 5:45 PM

దేశంలో 90 శాతం చెరువులు మాయం అయ్యాయి. చెరువుల సంఖ్య 25 లక్షల నుంచి 2 లక్షలకు పడిపోయింది.
1950లో తలసరి నీటి లభ్యత 5,000 క్యూబిక్‌ మీటర్లు కాగా.. అది ఇప్పుడు 1,200 క్యూబిక్‌ మీటర్లుగా ఉంది. సహజ నీటివనరుల అసమర్థ నిర్వహణ, వాతావరణ మార్పులు, పట్టణీకరణ దీనికి కారణమని నిపుణులు చెబుతున్నారు.
భవిష్యత్తులో వాటర్‌ బంకుల్లో నీళ్లు కొనుక్కునే పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తున్నారు.

వాన నీటిని ఒడిసిపట్టలేకపోతుండడంతోనే డేంజర్‌ బెల్స్‌ మోగుతున్నాయంటున్నారు పర్యావరణ నిపుణులు. వాననీటి పరిరక్షణతో పాటు, చెరువులు పునరుద్ధరణ జరగాలంటున్నారు వాళ్లు. అలాగే వాటర్‌ రీసైక్లింగ్‌ కూడా పెద్ద ఎత్తున చేపట్టాలంటున్నారు. ఇక పట్టణాలు, కాంక్రీట్‌ జంగిల్స్‌గా మారుతున్నాయి. దేశవ్యాప్తంగా పట్టణ జనాభా పెరుగుతోంది. దీంతో నీటి అవసరాలు పెరిగిపోతున్నాయి. భూగర్భ జలాలను ఎడాపెడా వాడెయ్యడంతో అవి పాతాళానికి పడిపోయాయి. వీటన్నింటికి సరైన సొల్యూషన్‌ చూపించకపోతే, భవిష్యత్తులో నీటి చుక్క కోసం యుద్ధాలు తప్పవంటున్నారు ఎక్స్‌పర్ట్స్‌.

గతంలో బోర్లు వేస్తే కొద్ది లోతులోనే నీళ్లు పడేవి. ఇప్పుడు హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో 2 వేల నుంచి 3 వేల అడుగుల లోతు వరకు బోర్లు వేయాల్సి వస్తోందంటున్నారు పర్యావరణవేత్తలు. దీంతో భూగర్భ జలాలు పూర్తిగా ఇంకిపోయే ప్రమాదం పొంచి ఉందంటున్నారు.

HMDA పరిధిలో గతంలో 4 వేల చెరువులు ఉండేవి. వాటి వల్ల భూగర్భ జలాలు పెరిగేవి. ఇప్పుడు ఆ చెరువుల్లో చాలావరకు కబ్జా కోరల్లో చిక్కుకుని మాయమైపోయాయి. ఆ చెరువులను పునరుద్ధరించకపోతే, భవిష్యత్తులో నీటి కష్టాలు మరింత పెరుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..