AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తేనెటీగలకు విలన్.. ప్రకృతికి మాత్రం హీరో! కందిరీగల అసలు కథ ఇదే

తేనెటీగలకు శత్రువులా కనిపించే కందిరీగలు నిజంగా అంత ప్రమాదకరమైనవేనా? కొన్ని జాతులు తేనెటీగలపై దాడి చేసినా.. ప్రకృతిలో కందిరీగల పాత్ర మాత్రం చాలా కీలకం. కీటకాల సంఖ్యను నియంత్రించడం నుంచి పుప్పొడి మార్పిడికి సహకరించడం వరకు ఇవి పర్యావరణ సమతుల్యతలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. అసలు కందిరీగల ప్రపంచం ఎలా ఉంటుంది? తేనెటీగలతో వాటి తేడా ఏంటి? తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే.

తేనెటీగలకు విలన్.. ప్రకృతికి మాత్రం హీరో! కందిరీగల అసలు కథ ఇదే
Wasps
Ram Naramaneni
|

Updated on: Aug 18, 2026 | 5:15 PM

Share

తేనెటీగ అంటే వెంటనే తేనె గుర్తొస్తుంది.. పువ్వుల చుట్టూ తిరుగుతూ తేనె సేకరించే చిన్న జీవి గుర్తుకొస్తుంది. కానీ కందిరీగ పేరు వినగానే మాత్రం చాలామందికి భయం మొదలవుతుంది. గూడు కనిపిస్తే దూరంగా వెళ్లిపోతారు.. పొరపాటున దాని దగ్గరకు వెళ్తే కుట్టేస్తుందేమోనని జాగ్రత్త పడతారు. అయితే కందిరీగలు కేవలం మనుషులను కుట్టే పురుగులు మాత్రమే కాదు. ప్రకృతిలో వాటి పాత్ర చాలా కీలకం.

తేనెటీగ.. కందిరీగ ఒకటేనా?

రెండూ ఒకే కుటుంబానికి చెందినవిగా కనిపించినా.. వాటి జీవన విధానంలో చాలా తేడా ఉంటుంది. తేనెటీగలు ప్రధానంగా పువ్వుల నుంచి తేనె, పుప్పొడి సేకరించి తమ కాలనీని పోషిస్తాయి. కందిరీగల్లో మాత్రం అనేక జాతులు ఇతర చిన్న కీటకాలను వేటాడి తమ పిల్లలకు ఆహారంగా అందిస్తాయి. టే.. తేనెటీగలు ఎక్కువగా ‘సేకరణ’ చేస్తే.. కందిరీగలు ‘వేట’చేస్తాయి.

మరి కందిరీగలు తేనెటీగలను తింటాయా?

కొన్ని కందిరీగ జాతులు తేనెటీగలను కూడా వేటాడతాయి. ముఖ్యంగా పెద్ద పరిమాణంలో ఉండే కొన్ని సామాజిక కందిరీగలు తేనెటీగల గూళ్లపై దాడి చేయగలవు. అయితే ప్రతి కందిరీగ తేనెటీగల శత్రువు అని అనుకోవడం తప్పు.కందిరీగల ఆహారం జాతిని బట్టి మారుతుంది. కొన్ని కీటకాలు, సాలీళ్లు వంటి చిన్న జీవులను వేటాడుతాయి. మరికొన్ని పండ్ల రసాలు, పూల తేనె వంటి పదార్థాలను కూడా తీసుకుంటాయి.

ఒక్కసారి కుట్టి చచ్చిపోతుందా?

తేనెటీగ, కందిరీగ రెండూ కుట్టగలవు. కానీ కుట్టిన తర్వాత వాటి పరిస్థితి ఒకేలా ఉండదు. తేనెటీగ కుట్టినప్పుడు దాని ముల్లు మనిషి చర్మంలో ఇరుక్కుపోయే అవకాశం ఉంటుంది. అలా జరిగినప్పుడు తేనెటీగ ఆ ముల్లును తిరిగి బయటకు తీయలేక చనిపోయే అవకాశం ఉంటుంది. అయితే కందిరీగకు తేనెటీగలా చర్మంలో ఇరుక్కుపోయే ముల్లు ఉండదు. అందుకే అది ఒకసారి కుట్టిన తర్వాత కూడా ఎగిరిపోయి.. మళ్లీ తిరిగి వచ్చి కుట్టగలదు. అందుకే కందిరీగ గూడు దగ్గరకు వెళ్లి వాటిని రెచ్చగొట్టడం ప్రమాదకరం. ఒక్క కందిరీగతో మొదలైన గొడవ.. క్షణాల్లో చాలా కందిరీగలు దాడి చేసే పరిస్థితికి దారితీయొచ్చు.

గూడు దగ్గరకు వెళ్తే ఎందుకు దాడి చేస్తాయి?

కందిరీగలకు తమ గూడు అంటే కేవలం నివాసం కాదు.. అది వాటి కాలనీకి రక్షణ కేంద్రం. గూడు ప్రమాదంలో పడిందని అనిపిస్తే కొన్ని జాతులు సమూహంగా స్పందిస్తాయి. ఒక్క కందిరీగను తరిమేస్తే సరిపోతుందని అనుకోవడం కూడా ప్రమాదకరం. గూడు దగ్గర కలకలం రేపితే మరిన్ని కందిరీగలు అప్రమత్తమై దాడి చేసే అవకాశం ఉంటుంది. అందుకే కందిరీగ గూడు కనిపిస్తే దాన్ని చేతులతో, కర్రలతో లేదా రాళ్లతో కదిలించకుండా దూరంగా ఉండటం మంచిది.

ప్రకృతికి కందిరీగలు ఎందుకు అవసరం?

మనకు ఇబ్బందిగా అనిపించే కందిరీగలు.. ప్రకృతికి మాత్రం ఒక రకంగా నేచర్ కంట్రోల్ టీమ్ లాంటివి. అనేక కందిరీగ జాతులు ఇతర కీటకాలను వేటాడుతాయి. దీంతో కొన్ని హానికరమైన కీటకాల సంఖ్యను సహజంగానే నియంత్రించడంలో ఇవి సహాయపడతాయి. అంతేకాదు.. కొన్ని కందిరీగలు పూలను సందర్శించడం ద్వారా పుప్పొడి మార్పిడికి కూడా సహకరిస్తాయి. అంటే.. మన కంటికి విలన్‌లా కనిపించే కందిరీగ.. ప్రకృతి వ్యవస్థలో మాత్రం తన పని తాను చేసుకుంటున్న ఒక ముఖ్యమైన జీవి.

తేనెటీగలకు విలన్.. ప్రకృతికి హీరో!

తేనెటీగలు తేనె తయారు చేస్తాయి కాబట్టి మనకు ఉపయోగకరంగా కనిపిస్తాయి. కందిరీగలు కుట్టే స్వభావం వల్ల భయంకరంగా అనిపిస్తాయి. కానీ ప్రకృతిలో ప్రతి జీవికీ ఒక పాత్ర ఉంటుంది. కందిరీగలను పూర్తిగా చెడ్డ పురుగులుగా చూడటం సరైనది కాదు. అవి కూడా ఆహార గొలుసులో భాగమే. కొన్ని కీటకాల సంఖ్యను నియంత్రిస్తూ పర్యావరణ సమతుల్యతకు తమ వంతు సహాయం చేస్తాయి. కాబట్టి ఇకపై కందిరీగ కనిపిస్తే.. భయంతో దాని గూడు దగ్గరకు వెళ్లడం కాదు, దూరంగా ఉండి దాని పని దానిని చేసుకోనివ్వడమే బెస్ట్!

Follow Us