అందరిలా మనం ఉంటే.. ఏముంటుంది ప్రత్యేకత. అందరికీ భిన్నంగా ఏదో ఒక ప్రత్యేకత చాటుకోవాలని భావించారు ఆ యువకులు..! భాషలు, ప్రాంతాలు వేరైనా వారి సంకల్పం మాత్రం ఒకటే. అనూహ్యంగా ఆ యువకులు కలుసుకున్నారు. వారి లక్ష్యం కోసం ఒకటై సాగుతున్నారు. ఆ యువకుల సంకల్పం ఏంటి..? ఏలా కలుసుకున్నారో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..!
భిన్న మతాలు, ప్రాంతాల సంస్కృతుల సమ్మేళనమే భారతదేశం. భాషలు, ప్రాంతాలు వేరైనా సమైక్యత, సౌభ్రాతృత్వమే అందరి అభిమతం. ఇటీవల కాలంలో చాలామంది జాతీయ సమైక్యత, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు సైకిల్ యాత్రలను చేపడుతున్నారు. ముగ్గురు యువకులు దేశాన్ని సైకిల్‌పై చుట్టి రావాలని సంకల్పించారు. ముగ్గురు యువకులు వేర్వేరు చోట్ల వేర్వేరు సమయాల్లో సైకిల్‌యాత్రకు శ్రీకారం చుట్టారు. అనుహ్యంగా ముగ్గురు ఓ రాష్ట్రంలో కలుసుకున్నారు. చేయి, చేయి కలిపి ఒక్కటిగా సైకిల్ యాత్రకు సాగుతున్నారు.
సేవ్ ఎర్త్, సేవ్ హెల్త్..
సేవ్ ఎర్త్, సేవ్ హెల్త్ అనే నినాదంతో బిహర్‌లోని సింహరికు సురజ్ సుమన.. సింహరి నుండి 2024 జూన 13న సైకిల్ యాత్ర చేపట్టాడు. ప్రకృతిని కాపాడుకోవాలంటూ సైకిల్ యాత్రకు శ్రీకారం చుట్టాడు. సురజ్ సుమన.. 16 రాష్ట్రాల్లో 9వేల కిలోమీటర్లు ప్రయాణించి డిండి మీదుగా హైదరాబాద్‌కు వెళుతున్నాడు.
16 రాష్ట్రాల మీదుగా సైకిల్ యాత్ర..
సైకిల్ యాత్ర అంటే సరదా కోసం సిక్కిం రాష్ట్రానికి చెందిన మిలానసుబ్బు 11 జూలై 2024న పశ్చిమబెంగాల్ రాష్ట్రం సిల్‌గుడి నుంచి సైకిల్ యాత్ర చేపట్టాడు. సిక్కింలో కొండలు, గుట్టలు ఉండడం వల్ల సరిహద్దులోని సిల్‌గుడి నుంచి యాత్రచేపట్టాడు. ఇప్పటివరకు సిక్కిం రాష్ట్రం నుంచి దేశంలోని 28 రాష్ట్రాల్లో పర్యటించిన వారు లేరు. ఆ రికార్డును సొంతం చేసుకునేందుకు మిలానసుబ్బు సైకిల్‌పై యాత్రకు బయలుదేరాడు. 16 రాష్ట్రాల్లో 900 కిలోమీటర్లు ప్రయాణించి ఛత్తీ్‌సఘడ్ మీదుగా హైదరాబాద్ కు వెళ్తున్నాడు. సిక్కిం రాష్ట్రంలో వ్యవసాయమంతా ఆర్గానిక్ పద్ధతిలో చేస్తారని .. ప్రభుత్వం కూడా ఆర్గానిక్ వ్యవసాయానికి ప్రోత్సాహం అందిస్తోందని మిలానసుబ్బు చెబుతున్నాడు.
సైకిల్ యాత్ర అంటే సరదా..
నేపాల్ కు చెందిన డేనియల్ కు సైకిల్ యాత్ర అంటే సరదా. నేపాల్ లోని పర్నాలి రాష్ట్రం సురకేత నుంచి 2024 సెప్టెంబరు 2న సైకిల్ యాత్ర మొదలుపెట్టాడు. ఇప్పటివరకు భారత దేశంలోని 12 రాష్ట్రాల్లో 6,400 కిలోమీటర్లు ప్రయాణించి హైదరాబాద్ వైపు వెళ్తున్నాడు. సైకిల్ యాత్రలో రికార్డు నెలకొల్పేందుకు డేనియల్ ఈ సైకిల్ యాత్ర చేస్తున్నాడు.
భిన్న ప్రాంతాలు, భాషలకు చెందిన ఈ ముగ్గురు యువకులు తెలియకుండానే వేర్వేరు చోట్ల వేర్వేరు సమయాల్లో సైకిల్‌యాత్రకు శ్రీకారం చుట్టినప్పటికీ అనుహ్యంగా ఈ ముగ్గురు యువకులు కేరళలోని కొచ్చిలో కలుసుకున్నారు. సమైక్యత, సౌభ్రాతృత్వమే తమ అభిమతం అంటూ చేయి, చేయి కలిపి ముగ్గురు యువకులు ఒక్కటిగా సైకిల్ యాత్రతో ముందుకు సాగుతున్నారు. తమ లక్ష్యాలు, అభిమతాలు ఒకటే కావడంతో తెలియకుండానే తాము కలుసుకున్నామని యువకులు చెబుతున్నారు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..