పర్వతారోహిణలో దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకువచ్చిన ఎవరెస్టర్ అన్విత.. మరో అడ్వెంచర్ కు సిద్ధమైంది. ప్రపంచ పర్వతారోహణ రంగంలో అతి క్లిష్టమైన ఏడు ఖండాల్లోని ఏడు అత్యంత ఎత్తైన పర్వతాల్లో ఒకటైన అమెరికాలోని డెనాలీ పర్వతాన్ని అధిరోహించేందుకు నల్లగొండ జిల్లా భువనగిరికి చెందిన పర్వతారోహకురాలు పడమటి అన్విత మరో సాహసానికి సిద్ధమయ్యారు.
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం యర్రంబల్లి గ్రామానికి చెందిన అన్విత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంప్‌సలో ఎంబీఏ పూర్తి చేశారు. భువనగిరి ఖిల్లాపై ట్రాన్సెండ్ అకాడమీ ఆఫ్ రాక్ క్లైంబింగ్ వ్యవస్థాపకుడు, అర్జున్ అవార్డు గ్రహీత ఎవరెస్టర్ బి.శేఖర్‌బాబు పర్యవేక్షణలో ఆమె పర్వతారోహణలో ప్రాథమిక శిక్షణ పొందారు. 2015లో సిక్కింలోని 4,800 మీటర్ల ఎత్తైన రినాక్ పర్వతాన్ని, 2019లో పశ్చిమబెంగాల్‌లో 6,400 మీటర్ల బీసీరాయ్ పర్వతాన్ని, 2021 ఫిబ్రవరిలో లడక్‌లోని 6వేల మీటర్ల ఎత్తైన ఖడే పర్వతాన్ని, 2022 సెప్టెంబరు 21న మైనస్ చలిలో నేపాల్‌లోని 8,163 మీటర్ల ఎత్తులో ఉన్న మనస్లూ పర్వతాన్ని అధిరోహించిన తొలి భారతీయురాలిగా రికార్డును సొంతం చేసుకున్నారు.
ప్రపంచంలోని ఏడు ఖండాల్లో ఏడు ఎత్తైన పర్వతాలను అధిరోహించాలనే లక్ష్యంలో అన్విత ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది. తొలిసారిగా జనవరి 5, 2020లో 5,895 మీటర్ల ఎత్తులో ఉన్న ఖిలిమాంజారో (ఆఫ్రికా), 2021 డిసెంబరు 7న 5,642 మీటర్ల ఎత్తులో ఉన్న ఎల్‌బ్రస్ (యూరప్), 2022 మే 16న ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన 8,848.86 మీటర్ల మౌంట్ ఎవరెస్ట్ (ఆసియా ఖండం), 2022 డిసెంబరు 17న 4,892 మీటర్ల ఎత్తైన విన్సన (అంటార్కిటికా) పర్వతాలను అధిరోహించారు.
నాలుగు పర్వతాలను అధిరోహించిన ఆమె ఐదో లక్ష్యాన్ని పూర్తిచేసేందుకు సిద్ధమవుతున్నారు. తన లక్ష్యసాధనలో ఐదో పర్వతమైన ఉత్తర అమెరికాలోని సముద్ర మట్టానికి 7వేల మీటర్ల ఎత్తులో ఉన్న డెనాలీ పర్వతాన్ని ఆమె అధిరోహణకు ఎంచుకున్నారు. హైదరాబాద్ నుంచి బయలుదేరిన అన్విత 20వ తేదీన అలాస్కాకు చేరుకుంటుంది. అక్కడి నుంచి తన గైడ్ సహాయంతో పర్వతం వద్దకు చేరుకుంటుంది. పర్వతం రూట్‌ని పరిశీలిస్తారు. వాతావరణ అనుకూలతను బట్టి పర్వతారోహణ ప్రారంభిస్తారు. జూన్ 4 నుంచి 10 లోపుగా పూర్తి చేయాలనేది లక్ష్యం. స్వయంగా 70 కిలోల బరువును భుజాన వేసుకొని ఎత్తైన శిఖరం అధిరోహించాలి.
ఏడు పర్వతాల అధిరోహణ లక్ష్యంలో ఇప్పటి వరకు ఆమె నాలుగు పూర్తి చేసుకొని ఇదో పర్వత అధిరోహిణకు సిద్ధమయ్యారు. త్వరలోనే మిగతా రెండు పర్వతాలైన 6వేల మీటర్ల ఎత్తయిన అకాంగోవా (సౌత ఆఫ్రికా), 2,228 మీటర్ల ఎత్తైన ఖోజిస్కో (ఆస్ర్టేలియాలో) పర్వతాలను అధిరోహించి లక్ష్యాన్ని సాధిస్తానని అన్విత ధీమా వ్యక్తంచేస్తున్నారు. విజయవంతంగా డేనాలి పర్వతాన్ని అధిరోహించాలని అందరూ కోరుకుంటున్నారు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…