దేహంలో ఏదైనా అవయవం పని చేయకుంటే మరణం తప్పదు. ఇలాంటి సమయంలో ఎవరైనా అవయవదానం చేస్తే పునర్జన్మ లభిస్తుంది. మనం మట్టిలో కలిసిపోకముందే మన అవయవాలను మరికొందరికి దానం చేసి ప్రాణం పోయవచ్చు. యాదాద్రి జిల్లాకు చెందిన ఓ వ్యక్తి బ్రెయిన్ డెడ్ కావడంతో అవయవాలను దానం చేయడంతో మరో నలుగురికి పునర్జన్మ ఇచ్చాడు.
యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) ప్రాంతానికి చెందిన మజ్జిగ బీరయ్య (57)కు భువనగిరి మండలం చందుపట్లకు చెందిన అండాలుతో 36 సంవత్సరాల క్రితం వివాహం అయింది. వీరికి ఇద్దరు కుమారులు. వ్యవసాయ చేస్తూ జీవనం సాగిస్తోంది ఈ కుటుంబం. సాఫీగా సాగుతున్న కుటుంబంలో ఒక్కసారిగా కలవరపాటు మొదలైంది. ఉన్నట్టుండీ బీరయ్య ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. కంగారుపడ్డ కుటుంబసభ్యులు బీరయ్యను ఆసుపత్రికి తీసుకెళ్తే గుండెపోటు వచ్చినట్లు వైద్యులు తెలిపారు. దీంతో వెంటనే కుటుంబ సభ్యులు సికింద్రాబాద్‌లోని ఆసుపత్రికి తరలించారు. వైద్యులు స్టంట్ వేసి తదుపరి చికిత్స అందించారు.
ఈ క్రమంలోనే అతనికి బ్రెయిన్ డెడ్ అయ్యింది. మనిషి ఉన్నా లేనట్లుగా ఉండి పోవడంతో వైద్యులు కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. దీంతో వైద్యులు, జీవదాన్ ట్రస్టు.. అతడి కుటుంబ సభ్యులకు అవయవదానం ఆవశ్యకతను, అవగాహన కల్పించారు. పెద్ద మనసు చేసుకున్న బీరయ్య కుటుంబ సభ్యులు అవయవ దానానికి చేసేందుకు అంగీకరించారు. బీరయ్య అవయవాలతో మరో నలుగురికి పునర్జన్మ కల్పించారు వైద్యులు. అనంతరం స్వగ్రామం ఆత్మకూరు(ఎం)లో ఆంత్యక్రియలు నిర్వహించారు. బీరయ్య భౌతికంగా లేకున్నా అతని అవయవాల వితరణతో మరో నలుగురిలో జీవించే ఉంటాడని స్థానికులు కొనియాడారు. బీరయ్య కుటుంబసభ్యులకు పలువురు అభినందనలు తెలిపారు. బీర్ల పౌండేషన్ ఆధ్వర్యంలో రూ.5వేలు, కేహెస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ.5వేలు మృతుడి కుటుంబానికి అందజేశారు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…