Snake Catcher Dies: ఎక్కడ పాము కనిపించినా అతినికి చాకచక్యంగా పట్టుకోవడమే అలవాటు. ఇంట్లోకి పాము వచ్చిందని ఎవరు కబురు పంపినా ఇట్టే వాలిపోయి.. దాన్ని పట్టుకుని అడవిలో వదిలేయడం అతని హాబీ.. చివరకు అదే పాముకు బలయ్యాడు. పుణ్యం చేశాబోతే పాపం ఎదురైన్నట్లు.. ఇతరులకు హాని కలగవద్దని చేసే పనికి తన ప్రాణాలు సమర్పించుకున్నాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన ఈ ఘటన తీవ్ర కలచివేసింది.
మణుగూరు మండలం సమితి సింగారానికి చెందిన షరీఫ్.. ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తుంటాడు. ఎంత పెద్ద పామునైనా క్షణాల్లో పట్టుకునే విద్యను.. పెద్దల దగ్గర నుంచి నేర్చుకున్నాడు. ఆ చుట్టుపక్కల ఎవరి ఇంట్లోకి పాము వచ్చినా.. స్థానికులు ఆయనకు సమాచారం ఇస్తారు. వెంటనే వెళ్లి ఆ పామును పట్టుకుని అడవిలో వదిలేశావాడు. తాజాగా రిక్షా కాలనీకి చెందిన బానోత్ వెంకట్రావ్ ఇంట్లోని బావిలో మంగళవారం తాచు పాము కనిపించగా.. షరీఫ్ దాన్ని పట్టుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో అతని చేతిపై పాము కాటేసింది.
అయినప్పటికీ వెంటనే ఆస్పత్రికి వెళ్లకుండా.. గంటకుపైగా ఆ పామును ఆడించాడు. ఆతర్వాత పామును బస్తాలో తీసుకెళ్లి అడవిలో వదిలివేసి తిరిగి వస్తుండగా సురక్షా బస్టాండ్ దగ్గర కింద పడిపోయాడు. స్థానికులు ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు నిర్ధారించారు. మృతుని తల్లి కమరున్నీసా బేగం ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు మణుగూరు సీఐ ముత్యం రమేష్ తెలిపారు. పాములను అత్యంత చాకచక్యంగా బంధించే షరీఫ్ అదే పాముకాటుతో మృతి చెందడం స్థానికంగా విషాదం నింపింది. పాము కాటు వేయగానే ఆస్పత్రికి వెళ్లాలని సూచించినా షరీఫ్ పట్టించుకోలేదని స్థానికులు చెప్తున్నారు.