
చాలామందిని బతికేస్తూ ఉంటారు.. కొందరు మాత్రమే జీవితాన్ని జీవిస్తూ ఉంటారు.. అది కూడా సింప్లిసిటీకి కేరాఫ్ అడ్రస్ గా జీవిస్తుంటారు.. అలాంటి వ్యక్తులను తలచుకుంటే మదిలో మొదటిగా మెదిలేవారు నారాయణ మూర్తి సుధా మూర్తి దంపతులు. సామాన్యుల నుంచి అసామాన్యులుగా ఎదిగినా.. ఒదిగి ఉండే ఈ దంపతులు నేటి యువతకు ఆదర్శం. భార్యాభర్తల మధ్య ఉండాల్సింది నేను గొప్ప అంటే నేను గొప్ప అనే ఇగోల పోరాటం కాదు.. ఒకరికొకరు చేయూతనివ్వడం.. నా భార్య సుధామూర్తి ఇచ్చిన స్ఫూర్తితోనే తాను విజయం సాధించానని సగర్వంగా చెప్పే నిగర్వి ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి.. ఇటీవల సుధామూర్తి ది కపిల్ శర్మ షోలో కనిపించి తమ ప్రేమ.. పెళ్లి గురించి అనేక విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు.
ఏ తండ్రి అయినా తన కూతురుకి మంచి వ్యక్తిని అందునా అప్పటికే జీవితంలో స్థిరపడిన యువకుడిని ఇచ్చి పెళ్లి చేయాలనీ కోరుకుంటారు. అయితే సుధామూర్తికి నారాయణ మూర్తిల పరిచయం ప్రేమగా మారింది. తాను ప్రేమించిన నారాయణ ను తన తండ్రిని పరిచయం చేసే సమయంలో నిరుద్యోగి.. అప్పుడు తన తండ్రి తనను అడిగిన ప్రశ్నను ఈ షోలో గుర్తు చేసుకున్నారు సుధామూర్తి. నిరుద్యోగి అయిన వ్యక్తిని ఎందుకు వివాహం చేసుకోవాలనుకుంటున్నావు అని తన తండ్రి తనను అడిగినట్లు చెప్పారు.
తమది మధ్యతరగతి కుటుంబం .. తన తండ్రి డాక్టర్.. పుస్తకాలే మా ఆస్థి.. నారాయణ మూర్తిని తాను ప్రేమిస్తున్నా అంటూ తండ్రికి పరిచయం చేసే సమయంలో అతనికి సరైన ఉద్యోగం లేదు. దీంతో తన తండ్రి ఉద్యోగం లేని వ్యక్తిని ఎలా పెళ్లి చేసుకుంటావు.. నేనే నా స్నేహితులు మీ అల్లుడు ఏమి చేస్తాడు అని అడిగితే ఏమి చెప్పాలని.. ఇతను నా అల్లుడు అని ఎలా పరిచయం చేయాలంటూ సుధని ప్రశ్నించారట. అప్పుడు సుధామూర్తి తన తండ్రికి సుధ భర్త అని చెప్పమని సమాధానం చెప్పారట.. దేవుడి దయవలన తాము ఇద్దరం పెళ్లి చేసుకుని ఒక్కటయ్యామని తన పెళ్లి జరిగిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు సుధామూర్తి. అంతేకాదు తమ పెళ్లి ఖర్చు కేవలం ఎనిమిది వందల రూపాయలని.. ఆ ఖర్చును ఇద్దరం చెరి సగం భరించామని సుధామూర్తి పలు సందర్భాల్లో నవ్వుతూ చెబుతుంటారు.
భార్య సుధామూర్తి ఇచ్చిన పదివేల రూపాయలతో తాను ఇన్ఫోసిస్‌ని స్థాపించి సక్సెస్ అయ్యానని నారాయణ్ మూర్తి అనేకసార్లు చెప్పారు. సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నతమైన ఆలోచనలు కష్టపడే తత్వం మనిషిని ఉన్నతస్థాయికి తీసుకుని వెళ్తాయని నిరూపించారు ఈ దంపతులు. విలువలతో జీవనం సాగిస్తున్న ఈ దంపతులు సామజిక బాధ్యతను నెరవేర్చడంలోనూ ముందుంటారు. తమపై దేవుడి ఆశీర్వాదం ఉండి.. చాలా డబ్బు ఇచ్చాడు కనుక తాము పేదలకు సహాయం చేయగలుగుతున్నాం.. అది మా కర్తవ్యం అని చెప్పే నిగర్వి సుధామూర్తి.. వందల కోట్ల ఆస్తి ఉన్నా సామాన్యుల్లానే జీవిస్తూ.. తాము సంపాదించిన డబ్బుతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సంపూర్ణ జీవితం గడుపుతున్న సుధామూర్తి, నారాయణమూర్తి దంపతుల జీవితం ఆద్భుతం… ఆదర్శప్రాయం.
మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..