కప్పలకు పెళ్లి.. పాండవులకు పూజలు.. వర్షాల కోసం తెలుగు రాష్ట్రాల్లో వింత ఆచారాలు..

వరుణుడు సకాలంలో కరుణిస్తే సరి.. లేదంటే అంతా చిన్నాభిన్నం!. వర్షాలు బాగా కురిస్తే పంటలు బాగా పండుతాయి. చెరువులు, బావులు జలకళతో తొణికిసలాడుతాయి. కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, కంసాలి వాళ్లకు చేతి నిండా పని దొరుకుతుంది. వ్యవసాయ పనిముట్లకు గిరాకీ పెరుగుతుంది. ఆషాఢ, శ్రావణ మాసాల్లో బోనాలు, ఆశ్వయుజంలో బతుకమ్మ, దసరా పండుగలకు బట్టలు అమ్మేవాళ్లకు, బట్టలు కుట్టేవాళ్లకు పనికి కొదువ ఉండదు.

కప్పలకు పెళ్లి.. పాండవులకు పూజలు.. వర్షాల కోసం తెలుగు రాష్ట్రాల్లో వింత ఆచారాలు..
Strange Rituals For Rains
Follow us
K Sammaiah

| Edited By: Gunneswara Rao

Updated on: Jul 21, 2024 | 11:23 AM

“వానమ్మ వానమ్మా వానమ్మా ఒక్కసారన్నా వచ్చిపోవే వానమ్మా.. చేలళ్లో నీళ్లు లేవు, చెలకల్లో నీళ్లు లేవు” అంటూ ఓ ప్రజాకవి వానకోసం ఆర్ద్రంగా వేడుకుంటే.. “వాన వాన వెల్లువాయే కొండకోన తుళ్లిపోయే.. తొలకరి చిటపట చినుకులలో మకరందం, చిత్తడి పుత్తడి నేలకదే ఆనందం” అని వర్షాన్ని లాలనగా వర్ణించాడో సినీ కవి. అనేక మంది కవులు, కళాకారులు అనేక రకాలుగా పాటలు, పద్యాలుగా అల్లి వర్షం ప్రాముఖ్యతను చాటారు. కాసిన్ని వాన చినుకులు పడితే చాలు పుడమి పులకరిస్తుంది. చెట్టూ చేమ చిగురిస్తాయి. భూమిపై ఉన్న అన్ని ప్రాణుల జీవిత చక్రం మొత్తం నీటిచుట్టూనే తిరుగుతూ ఉంటుంది. పంచభూతాలలో ఒకటిగా భావించే నీటిపైనే సర్వప్రాణి మనుగడ ఆధారపడి ఉంది. నీరు లేనిది జీవం లేదు. నీరు లేనిదే జీవితం లేదు. అందుకే “వానల్లు కురవాలి వాన దేవుడా.. వరిచేలు పండాలి వాన దేవుడా, వరిచేలు పండాలి వానదేవుడా.. మా బొజ్జ నిండాలి వానదేవుడా” అంటూ వానను వరుణదేవుడిగా భావించి పిల్లలు పాడుకుంటారు. త్వరగా రా వాన దేవుడా.. నీవు వస్తేనే పుష్కలంగా పంటలు పండుతాయి. పంటలు పండితేనే మా పొట్టలు నిండుతాయి అని ఆర్థంగా పాటల రూపంలో వేడుకుంటూ ఉంటారు.

వరుణుడు సకాలంలో కరుణిస్తే సరి.. లేదంటే అంతా చిన్నాభిన్నం!. వర్షాలు బాగా కురిస్తే పంటలు బాగా పండుతాయి. చెరువులు, బావులు జలకళతో తొణికిసలాడుతాయి. కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, కంసాలి వాళ్లకు చేతి నిండా పని దొరుకుతుంది. వ్యవసాయ పనిముట్లకు గిరాకీ పెరుగుతుంది. ఆషాఢ, శ్రావణ మాసాల్లో బోనాలు, ఆశ్వయుజంలో బతుకమ్మ, దసరా పండుగలకు బట్టలు అమ్మేవాళ్లకు, బట్టలు కుట్టేవాళ్లకు పనికి కొదువ ఉండదు. పాడి పశువులను, గొర్రె మేకలను, కోళ్లను పెంచుకునేవాళ్లకు వర్షాలు ఉంటేనే వాటికి పచ్చిగడ్డి, గ్రాసం, దాణా గింజలు పుష్కలంగా లభిస్తాయి. కూరగాయలు పండాలన్నా వర్షాలే దిక్కు. అందుకే అందరూ మొగులుదిక్కే ఎదురు చూస్తుంటారు.

రోహిణి కార్తె ఎండలకు ఠారెత్తిపోయిన జనమంతా.. ‘మృగశిర ఎప్పుడు వస్తుందా? వానదేవుడు ఎప్పుడు కరుణిస్తాడా!?’ అని ఎదురు చూస్తూ ఉంటారు. వానాకాలం మొదలైనా వానలు కురవకపోతే, వరుణుడి కరుణకోసం అనేక రకాలుగా ప్రార్థనలు చేస్తారు. వర్షాలు ఆలస్యమైనప్పుడు వరుణదేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు ఒక్కోచోట ఒక్కో ఆచారం పాటిస్తుంటారు. శాస్త్రసాంకేతిక రంగం ఎంతో అభివృద్ధి చెంది, అంతరిక్షంపైకి నిచ్చెన వేస్తున్న ప్రస్తుత కాలంలోనూ అనేక ఆచారాలను పాటిస్తూనే ఉన్నారు. ధర్మ విశ్వాసాలకు, నమ్మకాలకు నెలవైన తెలుగు రాష్ట్రాల్లో ఆచార వ్యవహారాలకు కొదువ లేదు. కప్పలకు పెళ్లి జరిపితే వర్షాలు కురుస్తాయని, పాండవులను పూజిస్తే వరుణుడు కరుణిస్తాడని, గ్రామ దేవతలకు జలాభిషేకం జరిపిస్తే చెరువులు అలుగులు పారే వానలు పడతాయిని ఇలా ఒక్కో చోట ఒక్కోరకమైన ఆచార వ్యవహారలు, నమ్మకాలు, విశ్వాసాలు నెలవై ఉన్నాయి.

కప్పతల్లి

“కప్పతల్లి.. కప్పతల్లి కడివెడే నీళ్లు! పురిశెలు.. పురిశెలు పురిశెడే నీళ్లు! దొంతులు.. దొంతులు దొంతెడే నీళ్లు!” అని పాడుతూ చిన్నా పెద్దా అంతా కలిసి ఆడుకునేదే కప్పతల్లి ఆట. వర్షాలు సకాలంలో పడకపోతే ఇలా కప్పతల్లి ఆట అడుతూ వరుణుడిని ప్రసన్నం చేసుకుంటారు. వర్షాకాలం మొదలైనా వానలు పడకపోతే కప్పతల్లికి మొక్కుతారు. కప్పలు బెకబెకమని అరిస్తే వరుణుడు కరుణించి వానలు కురుస్తాడని గ్రామీణుల నమ్మకం. వానొచ్చే ముందు కలుగుల్లో దాక్కున్న కప్పలు బెకబెకమని అరవడం పల్లెటూరిలో పుట్టిపెరిగిన వారికి అనుభవమే.

సుమారు పదేళ్లలోపు ఇద్దరు మగపిల్లలకు కేవలం బుడ్డగోచి మాత్రం ఉంచి, వాళ్ల భుజాల మీద రోకలి పెడతారు. ఓ తడి బట్టలో కప్పల్ని ఉంచి ఆ రోకలి మధ్యలో వదులుగా కడతారు. ఆ పిల్లలు ముందుగా, వాళ్లెనుక కప్పతల్లి పాట పాడుతూ ఓ గుంపు బయల్దేరుతుంది. ఊరిలో ఇంటింటికీ వెళతారు. ప్రతి ఇంటిలోవాళ్లు సర్వలో నీళ్లు తెచ్చి ఆ రోకలి మోస్తున్న పిల్లల మీదా, కప్పలను ఉంచిన బట్టమూట మీదా పోస్తారు. నీళ్లు పోసినప్పుడల్లా పక్కనున్న పిల్లలు అరుస్తూ వాళ్లను ఉత్సాహపరుస్తారు. కప్పతల్లి ఆడిన రోజు రాత్రికి వర్షం పడుతుందని నమ్మకం. అదేంటో గానీ చాలా సందర్భాల్లో నిజంగానే ఆ రాత్రి వర్షం పడుతుండటం గ్రామీణుల నమ్మకాలకు, విశ్వాసాలలకు మరింత బలం చేకూరుస్తుంది.

Strange Rituals For Rains2

Strange Rituals For Rains2

గ్రామ దేవతలకు జలాభిషేకం

తెలంగాణ పల్లెల్లో వానదేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు మరో వింత ఆచారం ఉంది. ముఖ్యంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాతో పాటు మరికొన్ని గ్రామాల్లో ఈ ఆచారాన్ని ఎక్కువగా పాటిస్తారు. గ్రామ దేవతలతో పాటు గ్రామం నడిబొడ్డున ఉన్న బొడ్రాయికి జలాభిషేకం చేస్తే వర్షాలు కురుస్తాయనే విశ్వాసం గ్రామీణుల్లో పాదుకుని ఉంది. ఈ కార్యక్రమాన్ని మహిళలే ముందుడి నడిపిస్తారు. గ్రామంలో ఉన్న మహిళలు ఎంతో నియమ నిష్టలతో చేస్తారు. వర్షాలు కురవాలని వరుణ దేవుడిని వేడుకుంటారు. మహిళలు ఇళ్ల నుంచి బిందెలతో నీళ్లు తెచ్చి గ్రామ దేవతలకు, బొడ్రాయికి జలాభిషేకం చేస్తారు. వర్షాలులేక పంటలు సాగు చేద్దామంటే భయమేస్తోందని బొడ్రాయికి మొర పెట్టుకుంటారు. తమ ఇబ్బందులను తొలగించి వర్షాలు కురిపించాలని వరుణ దేవుడిని వేడుకుంటారు. అనంతరం బొడ్రాయి చుట్టు కాముడు ఆడుతూ వర్షాలు పడి పంట చేతికి రావాలని దేవుళ్లను కోరుకుంటారు.

వన భోజనాలు

తెలుగు రాష్ట్రాల్లో సాధారణంగా కార్తీక మాసం వచ్చిందంటే వన భోజన కార్యక్రమాలు చేస్తుంటారు. వయస్సుతో నిమిత్తం లేకుండా అందరూ బయటే చెట్ల నీడన వండుకుని తిన బంధువులు, స్నేహితులతో కలిసి సరదాగా ఆట, పాటలతో గడుపుతారు. అయితే సకాలంలో వర్షాలు పడని పక్షంలో ఆషాఢం, శ్రావణమాసాల్లోనూ వనభోజనాలు చేస్తుంటారు. వర్షాలు పడాలని ప్రార్థిస్తుంటారు. గ్రామానికి సమీపంలోని అమ్మవారి దేవాలయానికి డప్పు వాయిద్యాలతో వెళతారు. అక్కడ కోడి లేదా మేకను దేవాలయం ముందు బలిస్తారు. ఇళ్లకు తాళాలు వేసి పశువులతో సహా తమ వెంట తీసుకెళతారు. గ్రామంలోకి ఇతరులు ఎవరూ రాకుండా కంచె వేస్తారు.

అనంతరం తమ వెంట తెచ్చుకున్న పూజా సామాగ్రితో పూజలు చేస్తారు. ఇలా చేయడం వల్ల వర్షాలు పడతాయని నమ్ముతారు. పూజలు చేసిన తర్వాత ఒకటి, రెండు రోజుల్లో భారీగా వర్షాలు పడతాయని నమ్మకం.

వర్షాల కోసం బిక్షాటన

వర్షాలు పడాలని చేసే పూజల్లో ఒక్కో చోట ఒక్కో ఆచారం ఉంటుంది. కొన్ని గ్రామాల్లో వరుణ దేవుడి కటాక్షం కోసం మరొక వినూత్న రీతిలో జనం పూజలు చేస్తారు. వారం రోజుల పాటు రోజుకో తీరుగా పూజలు చేస్తారు. మొదట గ్రామంలో పిల్లలు, పెద్దలు అంతా కలిసి ఆలయంలో జలాభిషేకాలు చేస్తారు. ఆ మరుసటి రోజు ఊరంతా కలిసి వన భోజనాలు చేస్తారు. గ్రామంలో ప్రజలు ఇంటింటికి తిరిగి బియ్యం, డబ్బులు బిక్షాటన చేస్తారు. అంతేకాక స్మశాన వాటికలోని బొందల దగ్గర నీళ్లు పోసి పూజలు చేస్తారు. ఇలా పూజలు చేస్తే వర్షాలు కురుస్తాయన్నది ప్రజల నమ్మకం.

బొమ్మల పెళ్లి

తెలంగాణ, కోస్తాంధ్ర జిల్లాలతో పోల్చుకుంటే రాయలసీమ జిల్లాల్లో వర్షాలు కురువాలని పాటించే ఆచారాలు మరొక రకంగా ఉంటాయి. బనగానపల్లె వంటి ప్రాంతాల్లో వర్షాలు కురవాలని వినూత్న రీతిలో పూజలు చేస్తారు. పురాతన సాంప్రదాయం ప్రకారం బొమ్మల పెళ్లిని ఘనంగా నిర్వహిస్తారు. పెళ్లికి హాజరైన అతిథులకు భోజనాలు సైతం ఏర్పాటు చేసి, పెళ్లిని ఘనంగా నిర్వహించడం అందరిని ఆకర్షిస్తుంది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో మరో విచిత్రమైన ఆచారం ఉంది. జోగులాంబ గద్వాల జిల్లాలోని మనవపాడు వంటి పలు గ్రామాల్లో గుర్రాలకు పూజలు చేస్తుంటారు. ఇలా గుర్రాలకు పూజలు చేయడం వల్ల పుష్కలంగా వర్షాలు పడతాయని నమ్మకం. సాయబుల ఆధ్వర్యంలో జరిగే ఈ గుర్రాల పూజల్లో కుల మతాలకు అతీతంగా పాల్గొని మొక్కులు చెల్లించుకుంటారు.

బండ మీది పాయసం నాకడం

తెలంగాణతో పాటు ఆంధ్రాలోనూ ఓ ఉమ్మడి ఆచారం ఉంది. అదే బండమీద పాయసం పెట్టి చేతులతో ముట్టుకోకుండా నాకడం. ఇలా చేస్తే వరుణ దేవుడు కరుణించి వర్షాలు కురిపిస్తాడని నమ్ముతారు. దీనికోసం ఊరిలోని ప్రజలంతా ఊరవతల ఉన్న గ్రామదేవత ఆలయానికి చేరుకుంటారు. ప్రతీ ఇంటి నుంచి చిన్నా పెద్దా అంతా కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. ఒక్కో ఇంటి నుంచి తీసుకొచ్చిన బియ్యం, ఇతర ఆహార పదార్థాలతో అక్కడే మూడు రాళ్ల పొయ్యిపై పాయసం వండుతారు. దేవతలకు నైవేద్యం సమర్పిస్తారు. వర్షాలు కురిపించాలని వేడుకుంటారు. ఆ తర్వాత పాయపాన్ని ఓ బండమీద పోసి చేతులతో ముట్టుకోకుండా నాకుతారు. ఇలా చేయడం వల్ల వర్షాలు కురుస్తాయని గ్రామీణులు నమ్ముతారు.

Strange Rituals For Rains5

Strange Rituals For Rains

పాండవులకు పూజలు

దేశంలో ఎక్కడా లేని విధంగా వర్షాల కోసం పాండవులకు పూజలు చేసే వింత ఆచారం ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉంది. రేగొండ మండలం రావులపల్లి గ్రామ శివారులో ఉన్న పాండవుల గుట్ట మీద వర్షాలు పడాలని వినూత్న రీతిలో పూజలు చేస్తారు. ఇక్కడ పాండవులకు ప్రత్యేకమైన గుడి ఉండటంతో ఈ గుట్టకు పాండవుల గుట్ట అనే పేరు వచ్చింది. రూపిరెడ్డీ పల్లి గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు ఇక్కడి వచ్చి వర్షాలు పడాలని పాండవులకు ప్రత్యేక పూజలు చేస్తారు. “వర్షాలు కురావాలి-పంటలు పండలి” అని మొక్కుకుంటూ పాండవుల గుట్టపైకి వెళ్లే మెట్లపై నీళ్లు పోస్తూ కడుగుతుంటారు. అనంతరం మెట్లకు బొట్లు పెడుతూ వానలు కురావాలి వాన దేవుడా అని పాటలు పాడుతారు. పాండవులకు ప్రత్యేక బోనం వండి నైవేద్యం సమర్పిస్తారు. తరువాత గ్రామస్తులంతా కలిసి దేవుడి ప్రసాదాన్ని మోకాళ్ళ మీద కూర్చుని ఆ ప్రసాదాన్ని నాలుకతో నాకుతారు. ఇలా పాండవులకు పూజలు చేయడం వల్ల వరుణ దేవుడు కరుణించి, వర్షాలు కురిపిస్తాడని ఈ ప్రాంత వాసుల ప్రగాఢ విశ్వాసం.

Strange Rituals For Rains3

Strange Rituals For Rains3

వరుణ యాగం

వేదాల్లోనూ వరుణుడిని ప్రసన్నం చేసుకోవడం గురించి స్పష్టంగా చెప్పారు. దేశ వ్యాప్తంగా తీవ్ర వర్షాభావ పరిస్థితుల నుంచి బయటపడేందుకు కొన్ని కొన్ని సార్లు వరుణయాగం తలపెడుతుంటారు. టీటీడీ, కంచి కామకోటి పీఠం వంటి ధార్మిక సంస్థలు ఈ యాగాన్ని ముందుండి నడిపిస్తాయి. మహారుత్వికులు, వేద పండితులతో దాదాపు వారం రోజుల పాటు ఈ మహాకార్యాన్ని నిర్వహిస్తారు. వరుణ యాగంలో అన్ని నలుపు రంగు ద్రవ్యాలు, ధాన్యాలతో పాటు నలుపు రంగులోని మేక, గుర్రాలను కూడా ఉపయోగిస్తారు. చివరకు శ్వేత వర్ణ దుస్తులతో యాగాలు, పూజలు చేసే రుత్వికులు సైతం నల్లని దుస్తులు ధరించి పూజలు చేస్తారు. ఆకాశంలోని మేఘాల్ని కారు మబ్బులుగా మార్చేందుకు.. రెండు వేదాలను మూడు యాగాలను అనుసంధానం చేస్తూ ఏకకాలంలో ఈ కరేరి ఇష్టియాగాన్ని నిర్వహిస్తారు. ఈ యాగం నిర్వహిస్తూనే ప్రముఖ కళాకారులతో అమృత వర్షిణి రాగాన్ని నాదనీరాజన వైదికపై ఆలపిస్తారు. తద్వారా వర్షాలు పడుతాయని పండితుల విశ్వాసం.

Strange Rituals For Rains4

Strange Rituals For Rains4

ఎన్నో ఆచార వ్యవహారాలు, సంస్కృతి సంప్రదాయాల కలబోతే భారతీయ సంస్కృతి. విభిన్న కులాలు, మతాలు, తెగలు ఉన్న మన దేశంలో ఆయా ప్రజలు పాటించే ఆచారాలు కొత్తగా, వింతగా, విచిత్రంగా కనిపిస్తాయి. మన ఆచారంలో కట్టుబొట్టు, ఆచార వ్యవహారాల్లో అద్భుతమైన సైంటిఫిక్‌ రీజన్స్‌ కూడా దాగి ఉన్నాయని నిపుణుల వాదన. ఉదయం నిద్ర లేచింది మొదలు, రాత్రి నిద్ర పోయే వరకు జీవన శైలిలో పాటించే ఒక్కో ఒక్కో ఆచార వ్యవహారం పూర్వీకుల నుంచి సంక్రమిస్తూ వస్తున్నాయి. ఇదే క్రమంలో సృష్టికి ప్రాణాధారమైన వర్షం, మేఘం చూట్టూ అనేక ఆచారాలు, నమ్మకాలు, విశ్వాసాలు తరతరాలుగా పెనవేసుకుని ఉండటం గమనార్హం.

సర్వేజనా సుఖినో భవంతు! లోకా సమస్తా సుఖినోభవంతు!!

మరిన్ని ప్రీమియం  కథనాల కోసం TV9 News App డౌన్‌లోడ్ చేసుకోండి

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ