AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mystery Gold Cave: ‘బింబిసార’ సినిమాలో చూపిన రహస్య ‘నిధి’ ఇప్పటికీ ఉందని మీకు తెలుసా? ఆ క్లూ తెలిస్తే చాలు..

Son Bhandar: భారతదేశం అపార సంపదకు నిలయం. అందుకే నాడు భారత్‌ను బంగారు పక్షి అని పిలిచేవారు. ఆ సంపదను కొల్లగొట్టేందుకు విదేశీయులు..

Mystery Gold Cave: ‘బింబిసార’ సినిమాలో చూపిన రహస్య ‘నిధి’ ఇప్పటికీ ఉందని మీకు తెలుసా? ఆ క్లూ తెలిస్తే చాలు..
Hidden Treasure
Shiva Prajapati
|

Updated on: Aug 14, 2022 | 12:47 PM

Share

Son Bhandar: భారతదేశం అపార సంపదకు నిలయం. అందుకే నాడు భారత్‌ను బంగారు పక్షి అని పిలిచేవారు. ఆ సంపదను కొల్లగొట్టేందుకు విదేశీయులు మన దేశం దండెత్తి వచ్చారు. ఎంతో మంది ప్రయత్నించి విఫలమైనా.. మొఘలలు మాత్రం ఇక్కడే ఫిక్స్ అయిపోయారు. దాదాపు 400 ఏళ్లు పాలించారు. చాలా ఏళ్ల పాటు పరిపాలించి.. అందినకాడికి దోచుకున్నారు. ఆ తరువా బ్రిటీష్ వారు వచ్చారు. 200 ఏళ్లు దోచుకున్నారు. మొత్తంగా 600 ఏళ్ల బానిసత్వం, పోరాటాలు ఎదుర్కొన్నప్పటికీ.. నేడు మనం దేశం అమెరికా, బ్రిటన్, రష్యా వంటి గొప్ప శక్తులతో అడుగులు వేస్తోంది. పరదేశీయులు మన సంపదను కొల్లగొట్టినప్పటికీ.. భారతదేశం సుభిక్షంగా వెలుగొందుతోంది. దోపిడీ పాలకుల్లో బ్రిటీష్ వారు ఎక్కువ సంపదను దోచుకుని, తరలించుకుపోయారనే చెప్పాలి. ఎక్కడ నిధి దొరికితే అక్కడ కొల్లగొట్టి పట్టుకుపోయారు. అయితే, బిహార్‌లో రహస్యంగా దాచిని నిధిని మాత్రం కనీసం తాకనైనా తాకలేకపోయారు. అదే నలంద జిల్లాలోని రాజ్‌గిర్ లోని సోన్ భండార్ రహస్య నిధి.

రాజ్‌గిర్‌కు చెందిన ఈ సోన్ భండార్ గుహ ఇప్పటికీ అనేక రహస్యాలను తనలో ఉంచుకుంది. సోన్ భండారం ద్వారం తెలిస్తే యావత్ దేశం బంగారు మయం అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు పరిశోధకులు. దేశం రూపు రేఖలే మారిపోతాయంటున్నారు. వందల ఏళ్లుగా ఇక్కడ బంగారు నిధి నిగూఢంగా ఉందని, ప్రజలకు దీని గురించి తెలియదని అంటున్నారు పరిశోధకులు. బ్రిటీష్ వారు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయిందన్నారు.

బింబిసారుడు దాచిన రహస్య నిధి.. హర్యాంక రాజవంశ స్థాపకుడు బింబిసారుడు, ఆయన భార్య తకు చెందిన అపారమైన బంగారు నిధిని సోన్ భండార్ గుహలో దాచినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. శాంతినికేతన్‌లోని ప్రాచీన చరిత్ర ప్రొఫెసర్ డాక్టర్ అనిల్ కుమార్ టీవీ9 డిజిటల్‌తో మాట్లాడుతూ హర్యాంక రాజవంశానికి చెందిన అపారమైన నిధి ఈ గుహలో దాచడం జరిగిందని వివరించారు. బింబిసారుని భార్య ఈ సోన్ భండార్ గుహను నిర్మించినట్లు పేర్కొన్నారు. ఇంతటి రహస్యాలు దాగిన రాజ్‌గిరి సోన్ భండార్ గుహను సందర్శించేందుకు దేశ విదేశాల నలుమూలల నుంచి పర్యాటకులు తరలి వస్తుంటారు. చరిత్రకారులు, నిపుణులు ఎందరో వచ్చి.. దీని రహస్యాన్ని చేధించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.

బంగారం అంటే ఇష్టం.. చక్రవర్తి బింబిసారుడికి బంగారం, వెండి ఆభరణాలంటే చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే బంగారం, బంగారు ఆభరణాలు సేకరిరంచేవాడు. ఇతర సామ్రాజ్యాలపై దాడి చేసి, వాటిని కొల్లగొట్టి అక్కడి సంపదను ఎత్తుకొచ్చేవాడు. అలా ఎత్తుకొచ్చిన సొత్తును బింబిసారుని భార్య భద్రపరిచేదట. ఇందుకోసం రాజ్‌గిరిలో సోన్ భండార్ గుహను నిర్మించింది. అయితే, బింబిసారుడి కుమారుడు అజాతశత్రువు తన తండ్రిని బందీగా చేసుకుని, తాను చక్రవర్తిగా ప్రకటించుకున్నాడు.

పెద్ద రాతితో మూసేశారు.. సోన్ భండార్ గుహలోకి ప్రవేశించగానే అక్కడ 10X5 మీటర్ల గది దర్శనమిస్తుంది. దీని ఎత్తు కేవలం 1.5 మీటర్లు మాత్రమే. నిధిని కాపాడే సైనికుల కోసం ఈ గది నిర్మించడం జరిగింది. ఈ గదికి అవతలి వైపున పెద్ద రాతితో కప్పబడిన నిధి గది ఉంది. ఇప్పటి వరకు ఎవరూ ఆ గదిని తెరవలేదు. శంఖం లిపిలో అక్కడ ఉన్న రాతిపై లిఖించడం జరిగింది. దానిని చదివి అర్థం చేసుకున్న వారు ఈ గదిని తెరుస్తారని చరిత్రకారులు చెబుతున్నారు. ఈ గుహతో పాటు రాజ్‌గిర్ చుట్టుపక్క జిల్లాల్లో అనేక గుహలు ఉన్నాయి. వీటిని జైన సన్యాసులు నిర్మించినట్లు చెబుతున్నారు. అదే సమయంలో కొందరు ఈ గుహలను బౌద్ధమతానికి సంబంధించినవిగా పేర్కొంటున్నారు.

అజాతశత్రువు చక్రవర్తి అయ్యాడు కానీ నిధి దొరకలేదు.. హర్యాంక రాజవంశ స్థాపకుడు, మగధ చక్రవర్తి బింబిసారుడు రాజగృహాన్ని నిర్మించాడు. ఆ తరువాత దీనిని రాజ్‌గిర్ గా పిలవడం ప్రారంభించారు. క్రీస్తుపూర్వం 543లో బింబిసారుడికి 15 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు సింహాసనాన్ని అధిష్టించాడు. ఆ తరువాత సామ్రాజ్య విస్తరణలో భాగంగా దోచుకున్న బంగారాన్ని దాచడానికి విభరగిరి పర్వతం దిగువన జంట గుహలను నిర్మించాడు. అందులో సోన్ భండార్ గుహ ఒకటి. అయితే, బింబిసారుడి కుమారుడు అజాతశత్రువు అధికారం చేజిక్కించుకోవాలని భావించాడు. అధికారం కోసం తన తండ్రి బింబిసారుడిని బంధించి.. తనను మగధ చక్రవర్తిగా ప్రకటించుకున్నాడు. అనంతరం తన తండ్రిని జైల్లో వేశాడు. రహస్యంగా దాచిని నిధి గురించి తెలుసుకున్న అజాత శత్రువు.. ఆ నిధి రహస్యాన్ని తెలుపాలని తండ్రి బింబిసారుడిని చిత్రహింసలకు గురి చేశాడని చరిత్రకారులు చెబుతున్నారు. అయితే, బింబిసారుడు ఆ నిధి రహస్యాన్ని ఎవరికీ చెప్పకుండానే తనువుచాలించాడు. అయితే, బింబిసారుడు తాను చనిపోవడానికి ముందు.. గుహ తలుపు తెరవడానికి వీలు లేని విధంగా ఉన్న భారీ రాయిపై శంఖం లిపిలో కొంత సమాచారాన్ని రాశాడు. గుహలోకి వెళ్లే దారిని ఇలా ఎవరికీ అర్థం కాని విధంగా ప్రత్యేక లిపిలో చెక్కించినట్లు అక్కడ శాసనాల్లో పేర్కొనడం జరిగింది. బింబిసారుడి మరణానంతరం అజాతశత్రువు ఆ నిధి కోసం తీవ్ర ప్రయత్నాలు చేశాడు. అయినప్పటికీ ఎలాంటి ఫలితం లేకుండా పోయిందని చరిత్రకారులు చెబుతున్నారు.

బ్రిటీష్ వారి ఫిరంగులు కూడా విఫలమే.. ఈ నిధి దాచిన గుహ గురించి తెలుసుకున్న బ్రిటీష్ పాలకులు.. ఆ నిధిని ఎలాగైనా చేజిక్కించుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేశారు. అయితే వారి ప్రయత్నం విఫలయత్నంగానే మిగిలిపోయింది. మందుపాతర్లతో, ఫిరంగులతో ఆ గుహను ధ్వంసం చేసి నిధిని దక్కించుకోవాలని చేసిన ప్రయత్నాలు కూడా విఫలం అయ్యాయి. దాంతో చేసేదేమీ లేక.. బ్రిటీష్ వారు ఆ నిధి గురించి ఆలోచించడమే మానేశారు.

మహాభారత కాలానికి సంబంధించిన కథ కూడా ఉంది.. ఈ గుహలోని నిధి మహాభారత కాలానికి సంబంధించినదనే కథనం కూడా ఉంది. వాయు పురాణం ప్రకారం.. హర్యాంక రాజవంశం పాలనకు సుమారు 2,500 సంవత్సరాల ముందు మగధను బృహద్రథుడు పాలించాడని చెబుతారు. ఇతను శివభక్తుడైన జరాసంధుని తండ్రి. అతని తర్వాత జరాసంధుడు సింహాసనాన్ని అధిష్టించాడు. అయితే, చక్రవర్తి అవ్వాలనే కలతో.. దండయాత్ర చేపట్టాడు. 100 రాజ్యాలను ఓడించడం లక్ష్యంగా పెట్టుకుని యుద్ధానికి పయనమయ్యాడు. దాదాపు 80 రాజ్యాలను ఆక్రమించి చక్రవర్తి అయ్యాడు. ఈ యుద్ధాల సందర్భంగా దోచుకున్న సంపదను మొత్తం విభరగిరి పర్వతం దిగువన ఒక గుహను నిర్మించి.. ఆ సంపదను అందులో దాచాడు. అయితే, సోన్ భాండర్ గుహ కూడా అదే గుహకు సమాంతరంగా ఉంటుంది.

వాయు పురాణం ప్రకారం.. జరాసంధ తన లక్ష్యానికి దగ్గరగా ఉన్న సమయంలో పాండవులు అతన్ని యుద్ధానికి ఆహ్వానించారు. యుద్ధం 13 రోజులు కొనసాగింది. భీముడు, శ్రీకృష్ణుడు తమ వ్యూహాలతో జరాసంధుని హతమార్చారు. జరాసంధుని చంపేయడంతో.. అతను దాచిన నిధి రహస్యం నిగూఢంగానే మిగిలిపోయింది. బ్రిటీష్ వారి హయాంలో ఈ తలుపులు బద్దలు కొట్టడానికి ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది.

మరిన్ని హ్యూమన్ ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..