నిందితుడు అనుకుని అమాయకుడ్ని చితకబాదిన సెబ్ పోలీసులు.. చివరకు

| Edited By: Ram Naramaneni

Nov 22, 2023 | 12:43 PM

నిందితుడు అనుకుని అమాయకుడిని పట్టుకుని చావబాదారు పోలీసులు. మద్యం అక్రమ రవాణా చేసే నిందితుడు కోసం వెళ్లి సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌ను పట్టుకొని చితకబాదారు. అనంతపురం సెబ్ పోలీసులు ఎందుకు కొడుతున్నారో తెలియని ఆ సాఫ్ట్ వేర్ కూడా తిరిగి పోలీసులపై ప్రతిఘటించాడు. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.

నిందితుడు అనుకుని అమాయకుడ్ని చితకబాదిన సెబ్ పోలీసులు.. చివరకు
Tadipatro SEB Office
Follow us on

— మొబైల్‌ ట్రాకింగ్‌ తప్పిదంతో సెబ్ పోలీసులు ఇరుకున పడ్డారు..ఓ కేసులో నిందితుడిని వెతికే క్రమంలో సెబ్‌ పోలీసులు పొరపడి ఒక సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌పై ప్రతాపం చూపారు. ఆయనపై కాపు కాచి దాడి చేసి.. తీవ్రంగా గాయపర్చి పరారయ్యారు. ఈ ఘటన అనంతపురం జేఎన్‌టీయూ పాలిటెక్నిక్‌ కళాశాల మైదానంలో జరిగింది. .

— తాడిపత్రికి చెందిన రామాంజనేయరెడ్డి అనంతపురంలో ఉంటూ గోవా మద్యాన్ని సరఫరా చేస్తున్నాడు. దీంతో అతడి నుంచి మద్యం కొనుగోలు చేసిన ఓ వ్యక్తి తాడిపత్రి సెబ్ పోలీసులకు పట్టుబట్టాడు. ఈ మద్యం ఎక్కడ నుంచి వచ్చిందని ఆరా తీయగా తనకు రామాంజనేయ రెడ్డి దగ్గర కొనుగోలు చేసినట్లు చెప్పుకొచ్చాడు. దీంతో అతడి వద్ద నుంచి రామాంజనేయ రెడ్డి ఫోన్ నెంబర్ తీసుకుని లోకేషన్ సెర్చ్ చేశారు. అయితే ఫోన్ లొకేషన్ జేఎన్‌టీయూ మైదానంలో ఉన్నట్లు సూచించింది. వెంటనే ఇద్దరు సెబ్ కానిస్టేబుళ్లు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ చంద్రశేఖర్ రెడ్డిని చూసి ఆయనే రామాంజనేయ రెడ్డిగా భావించి దాడి చేశారు. దాడిలో తీవ్రంగా గాయపడటంతో.. సెబ్ కానిస్టేబుల్స్ అక్కడ నుంచి పరారయ్యారు. అనంతరం సెబ్ అధికారులే చంద్రశేఖర్ రెడ్డిపై దాడికి పాల్పడ్డారని తెలిసింది..

— దీంతో వివరణ కోరగా లొకేషన్‌ తప్పుగా చూపించడంతో గందరగోళానికి గురై ఈ తప్పిదం జరిగిందని సెబ్‌ అదనపు ఎస్పీ రామకృష్ణ వెల్లడించారు. ఈ ఘటన జరిగినందుకు తాను చింతిస్తున్నానని.. దాడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.