
లండన్కు చెందిన కింగ్స్ కాలేజీలోని శాస్త్రవేత్తలు ఒక వినూత్న ప్రయోగం చేసి కొత్త ఆవిష్కరణను వెలుగులోకి తీసుకొచ్చారు. దంత సమస్యలకు చెక్ పెట్టేందుకు వారు చేసిన ప్రయోగం విజయవంతం అయింది. మానవుని వెంట్రుకలతో పాడైపోయిన దంతాలను బాగు చేసుకునే ఒక ప్రత్యేకమైన టూత్‌పేస్ట్‌ను ఈ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ పెస్ట్ దంతాలకు రక్షణ కల్పించడమే కాకుండా, పాడైపోయిన దంతాలను తిరిగి బాగు చేసేందుకు అద్భుతంగా పనిచేస్తుంది. ఈ విషయాన్ని స్వయంగా లండన్ శాస్త్రవేత్తలే తెలియజేశారు.
మన వెంట్రుకలలో సహజంగా లభించే ‘కెరాటిన్‘ ద్వారా ఈ టూత్‌పేస్ట్ తయారు చేసినట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ కెరాటిన్ సహాయంతో మన దంతాల పైపొర అయిన ఎనామిల్‌ను తిరిగి ఏర్పడేలా చేయవచ్చని తమ అధ్యయనంలో వెల్లడైనట్టు లండన్ శాస్త్రవేత్తలు తెలిపారు. కెరాటిన్‌ను దంతాలపై పూసినప్పుడు, లాలాజలంలో సహజంగా ఉండే ఖనిజాలతో కలిసి, అది సహజ ఎనామెల్ నిర్మాణం, పనితీరును అనుకరించే అత్యంత వ్యవస్థీకృత, క్రిస్టల్ లాంటి స్కాఫోల్డ్‌ను ఏర్పరుస్తుందని వారు కనుగొన్నారు.
కాలక్రమేణా, ఈ స్కాఫోల్డ్ కాల్షియం, ఫాస్ఫేట్ అయాన్లను ఆకర్షిస్తూనే ఉంటుందని, ఇది దంతాల చుట్టూ ఎనామెల్ను పోర పెరుగుదలకు దారితీస్తుందని పరిశోధకులు తెలిపారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఎదుర్కొంటున్న ప్రధాన ఆరోగ్య సమస్యల్లో దంత క్షయం ఒకటని.. దీనివల్ల పంటి ఎనామిల్ దెబ్బతిని, తీవ్రమైన సమస్యలు వస్తుంటాయిని తెలిపారు.మనం తీసుకునే ఆమ్ల ఆహారాలు, పానీయాలు, నోటిని పరిశుభ్రంగా ఉంచుకోకపోవడం వంటి వాటి వల్ల ఎనామిల్ పొర దెబ్బతినడం, దంత క్షయానికి దారి తీస్తాయని తెలిపారు.
మనం నిత్యం వాడే నార్మల్ టూత్ పేస్టులు ఈ దంత క్షయ సమస్యను త్వరగా తగ్గించలేవని.. కేవలం వాటి వేగాన్ని తగ్గించడానికి మాత్రమే సహాయపడుతాయని, సమస్యను పూర్తిగా నయం చేయలేవని తెలిపారు. కానీ కెరాటిన్తో తయారు చేసిన టూత్‌పేస్ట్ మాత్రం దంత క్షయాన్ని పూర్తిగా తగ్గిస్తుందని అంటున్నారు.
మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.