AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రైల్వే ట్రాక్‌పై రాళ్లు.. మెట్రో ట్రాక్‌పై ఎందుకు ఉండవు.. ఆశ్చర్యపరిచే కారణాలు ఇవే..

కొన్ని సార్లు కొన్ని ప్రశ్నలు మన మెదుడును తినేస్తాయి. తరుచూ వాటిని చూస్తుంటాం కానీ అవి అలా ఎందుకు ఉన్నాయో పెద్దగా ఆలోచించం. అటువంటిదే రైల్వే ట్రాక్‌పై రాళ్లు ఉండడం.. మెట్రో ట్రాక్‌పై లేకపోవడం.. మెట్రో ట్రాక్‌పై రాళ్లు ఎందుకు ఉండవో ఎప్పుడైనా ఆలోచించారా..?

రైల్వే ట్రాక్‌పై రాళ్లు.. మెట్రో ట్రాక్‌పై ఎందుకు ఉండవు.. ఆశ్చర్యపరిచే కారణాలు ఇవే..
Railway Track Vs. Metro Track
Krishna S
|

Updated on: Sep 20, 2025 | 4:52 PM

Share

మన దేశంలో ప్రయాణానికి ఎక్కువ మంది ప్రజలు ఉపయోగించేంది రైలు. దేశంలో ఎక్కడికైనా కనెక్టివిటీ తక్కువ ధరలు ఉండడమే దీనికి కారణం. ప్రతీ రోజూ లక్షల మందిని రైళ్లు తమ గమ్యస్థానాలకు చేరుస్తాయి. మనం తరచుగా చూసే రైల్వే ట్రాక్‌లపై రాళ్లు ఉంటాయి. కానీ మెట్రో ట్రాక్‌లపై మాత్రం ఉండవు. దీని వెనుక కారణం చాలా మందికి తెలియదు. రైల్వే ట్రాక్‌లకు, మెట్రో ట్రాక్‌లకు మధ్య ఉన్న నిర్మాణపరమైన తేడాలే దీనికి ప్రధాన కారణం. రైళ్ల బరువు, నిర్వహణ, స్థలం లభ్యత వంటి అంశాలు వీటి నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తాయి.

రైల్వే ట్రాక్‌లపై రాళ్లు ఎందుకు ఉంటాయి..?

సాధారణంగా రైల్వే పట్టాలపై ఉండే రాళ్లను బ్యాలస్ట్ అని పిలుస్తారు. ఈ రాళ్లు అనేక ముఖ్యమైన ప్రయోజనాల కోసం ఉపయోగపడతాయి.

బరువు పంపిణీ: రైళ్లు లక్షల కిలోల బరువుతో ప్రయాణిస్తాయి. ఈ భారీ బరువు నేరుగా భూమిపై పడితే నేల కుంగిపోయి పట్టాలు అస్థిరంగా మారే అవకాశం ఉంది. రాళ్లు ఈ బరువును సమానంగా పంపిణీ చేసి నేలపై ఒత్తిడిని తగ్గిస్తాయి.

స్థిరత్వం: రైలు వేగంగా వెళ్తున్నప్పుడు వచ్చే కంపనాల వల్ల పట్టాలు కదలవచ్చు. బ్యాలస్ట్ రాళ్లు పట్టాలను గట్టిగా పట్టుకుని, అవి కదలకుండా స్థిరంగా ఉండేలా చేస్తాయి.

నీటిపారుదల: వర్షం పడినప్పుడు నీరు పట్టాల కింద నిలిచిపోతే నేల మెత్తబడి పట్టాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. రాళ్ల మధ్య ఉన్న ఖాళీల ద్వారా నీరు సులభంగా కిందకి ఇంకిపోతుంది. దీనివల్ల ట్రాక్ చుట్టూ ఉన్న ప్రాంతం పొడిగా ఉంటుంది.

కలుపు మొక్కల నియంత్రణ: పట్టాల చుట్టూ కలుపు మొక్కలు పెరిగితే ట్రాక్‌లకు నష్టం జరగవచ్చు. రాళ్లు కలుపు మొక్కలు పెరగకుండా అడ్డుకుంటాయి.

మెట్రో ట్రాక్‌లపై రాళ్లు ఎందుకు ఉండవు..?

మెట్రో ట్రాక్‌లపై రాళ్లు లేకపోవడానికి కొన్ని ప్రత్యేక కారణాలు ఉన్నాయి.

తక్కువ బరువు: మెట్రో రైళ్లు సాధారణ రైళ్ల కంటే తక్కువ బరువును కలిగి ఉంటాయి. దీనివల్ల ట్రాక్‌లపై ఒత్తిడి తక్కువగా ఉంటుంది.. కాబట్టి బ్యాలస్ట్ అవసరం లేదు.

పట్టణ ప్రాంతాల్లో నిర్మాణం: మెట్రో ట్రాక్‌లను ఎక్కువగా పట్టణాల్లో నిర్మిస్తారు. ఇక్కడ స్థలం తక్కువగా ఉంటుంది. రాళ్లు వేయడానికి అదనపు స్థలం అవసరం. కానీ పట్టణాల్లో ఇది సాధ్యం కాదు. అందుకే మెట్రో ట్రాక్‌లను కాంక్రీట్ స్లాబ్‌లపై నిర్మిస్తారు.

సులభమైన నిర్వహణ: మెట్రో ట్రాక్‌లను ప్రతిరోజు శుభ్రం చేయాల్సి ఉంటుంది. రాళ్లు ఉంటే చెత్త వాటి మధ్య ఇరుక్కుపోయి శుభ్రం చేయడం కష్టం అవుతుంది. రాళ్లు లేకపోవడం వల్ల నిర్వహణ సులభం అవుతుంది.

ఆధునిక సాంకేతికత: మెట్రో ట్రాక్‌లను అత్యాధునిక సాంకేతికతతో కాంక్రీట్ స్లాబ్‌ల మీద గట్టిగా అమర్చుతారు. ఈ పద్ధతి ట్రాక్‌లకు ఎక్కువ బలం, స్థిరత్వాన్ని ఇస్తుంది.

తేడా ఇదే..

రైల్వే ట్రాక్‌లలో బరువు పంపిణీ, స్థిరత్వం, నీటిపారుదల వంటి అవసరాల కోసం రాళ్లు తప్పనిసరి. కానీ మెట్రో ట్రాక్‌లు తేలికైనవి కావడం పట్టణాల్లో స్థలం లేకపోవడం, సులభమైన నిర్వహణ, ఆధునిక నిర్మాణ పద్ధతుల కారణంగా వాటికి రాళ్ల అవసరం ఉండదు. ఈ రెండు ట్రాక్‌ల మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసం వాటి ఉపయోగం, నిర్మాణ విధానంపై ఆధారపడి ఉంటుంది.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడి క్లిక్ చేయండి..