పార్వతీపురం మన్యం జిల్లాలోని ఓ పేద కూలీ కుటుంబంలో అనుకోని దురదృష్టకర ఘటన చోటుచేసుకుంది. పార్వతీపురం మండలం పుట్టూరులో ఆదిమూలం లక్ష్మణరావు అనే వ్యక్తి రైతు కూలీగా పని చేస్తూ తన జీవనాన్ని కుటుంబంతో కొనసాగిస్తున్నాడు. లక్ష్మణకు ఇద్దరు కుమార్తెలు. తన పెద్ద కుమార్తెను మంచి వరుడుకిచ్చి ఘనంగా వివాహం చేయాలని అనుకునేవాడు. అందుకోసం ప్రతి క్షణం ఆలోచించేవాడు. ప్రతి రూపాయి జాగ్రత్తగా దాచేవాడు. తాను కూలీ చేసుకోగా వచ్చే డబ్బులో కొంత డబ్బు ఇంటి ఖర్చులకు ఇచ్చి మరికొంత డబ్బు తన ట్రంక్ పెట్టెలో కవర్లలో కట్టి జాగ్రత్తగా దాచేవాడు. ఒకటి కాదు రెండు సుమారు రెండేళ్ల పాటు ట్రంక్ పెట్టెలోనే తన కష్టార్జితాన్ని దాచాడు. అలా సుమారు రెండు లక్షలకు పైగా తన కష్టార్జితాన్ని పెట్టెలో ఉంచాడు. ఈ క్రమంలోనే సుమారు ఐదు నెలల క్రితం లక్ష్మణరావు ఇంటి డాబా పై నిద్రిస్తుండగా ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందాడు. లక్ష్మణ మృతితో ఆ పేద కుటుంబం విషాదంలో మునిగిపోయింది. రెక్కాడితే కానీ డొక్కాడని లక్ష్మణ్ మరణంతో పెద్ద కుమార్తె వివాహం కూడా ప్రశ్నార్థకంగా మారింది. అలా కుటుంబం అంతా ఐదు నెలల నుండి దుఃఖంలోనే ఉన్నారు. ఇది ఇలా ఉండగా లక్ష్మణ్ తల్లిదండ్రులకు కొడుకు వస్తువులు భద్రపరిచి కొడుకు గుర్తుగా ఉంచుకోవాలని అనుకున్నారు. అందులో భాగంగా లక్ష్మణ్ వినియోగించుకునే ట్రంక్ పెట్టె ను తెరిచి చూశారు తల్లిదండ్రులు. దీంతో వాళ్లకి తల్లడిల్లిపోయే సంఘటన ఎదురైంది. తన కుమారుడి పెట్టెను తెరవగానే చెద పురుగుల మధ్య ఐదు వందలు, వంద రూపాయల నోట్లు ముక్కలు ముక్కలుగా మట్టిలో కలిసిపోయి కనిపించాయి.
జీవితంలో ఎప్పుడూ చూడని అంత డబ్బు కళ్ళ ముందే మట్టి పాలై కనిపించడం చూసిన లక్ష్మణ్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అయ్యారు. ఓ వైపు కుటుంబ పోషణ చేస్తూనే మరో వైపు పెద్ద కుమార్తె వివాహం కోసం పొదుపుగా రూపాయి రూపాయి డబ్బు దాచిపెట్టడం గమనించిన కుటుంబసభ్యులు కొడుకు బాధ్యతను చూసి శోకసముద్రంలో మునిగిపోయారు. లక్ష్మణ్ చనిపోయి ఐదు నెలలు అవుతున్నా పెట్టె తెరిచి చూడక పోవడం వల్లే చనిపోయిన కుమారుడు కష్టం మట్టి పాలైందని ఆందోళన చెందుతున్నారు. కూలీ పనులు చేయగా రెక్కల కష్టంతో వచ్చిన డబ్బు చెదపురుగుల బారిన పడి నోట్ల కట్టలు ముక్కలు ముక్కులు కావడం అందరినీ కలచివేస్తుంది. ఓ వైపు కుమారుడి మరణం, మరోవైపు కుమారుడి రెక్కల కష్టం మట్టి పాలవ్వడం ఆ వృద్ధ తల్లిదండ్రులను మరింత ఆవేదనను మిగిల్చింది. ఆ పేద కుటుంబానికి జరిగిన అన్యాయం అందరినీ కలచివేస్తుంది. ఇదే అంశం ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీనిని చూసిన బేబీ సినిమా నిర్మాత శ్రీనివాస్ కుమార్ (ఎస్ కే ఎన్) ఆ పేదింటి కుటుంబానికి సాయం చేస్తానని ముందుకు వచ్చారు. ‘ఇలా జరగడం చాలా బాధాకరం. డబ్బును అలా దాచుకున్న మీ అమాయకత్వాన్ని చూస్తే చాలా దురదృష్టమనిపిస్తోంది. ఆ తండ్రి వివరాలు తనకు పంపండి. ఆయన కుమార్తె పెళ్లికి అవసరమయ్యే రూ.2 లక్షల డబ్బును ఇస్తాను’ అని ట్వీట్ చేశారు ఎస్ కే ఎన్.
Sad to know & it’s very unfortunate to see their innocence keep money like that
Can any one share their contact please
Would like to help them— SKN (Sreenivasa Kumar) (@SKNonline) November 19, 2023
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..