Parenting Tips: మా పిల్లాడు మా మాట జవదాటరని మురిసిపోతున్నారా..? ఆగండాగండి.. ఒక్కసారి ఈ కథనం చదవండి
యుక్త వయసులో అబ్బాయిలైనా, అమ్మాయిలైనా తిరుగుబాటు ధోరణి కలిగి ఉండటం సహజం. అలా ఉండాలి కూడా. తల్లిదండ్రులతో ఘర్షణ ఎందుకొస్తుందంటే వారిలో స్వతంత్ర ఆలోచనలు రూపుదిద్దుకోవడాన్ని గుర్తించక పోవడం వల్లే.

ముగ్గురు ప్రాణ స్నేహితులు చాలా రోజుల తర్వాత కలిశారు. కుటుంబం, పిల్లలు, ఉద్యోగాలు, వ్యాపారాల గురించి మాట్లాడుకుంటున్నారు. ముగ్గురికి యుక్త వయసు పిల్లలున్నారు.
1) వారిలో ఒకరు తన కుమారుడి గురించి చాలా ఆందోళన చెందుతున్నట్టు చెప్పాడు. 16 వ ఏట నుంచి వాడి ప్రవర్తనలో మార్పు వచ్చిందని, ప్రతి దానికి ధిక్కరించేలా అరుస్తున్నాడని బాధను వెళ్లగక్కాడు. ఇంతకు ముందు పాకెట్ మనీ ఎంతిచ్చినా తీసుకునే వాడు ఇప్పుడు డిమాండు చేస్తున్నాడని వాపోయాడు. తల్లిపైన కూడా విసుక్కోవడం, విసిరి కొట్టడాలు చేస్తున్నాడట.
2) రెండో వ్యక్తి …మా అబ్బాయి కూడా అంతే. విన్నట్టే కనిపిస్తాడు కానీ వాడు తనకు నచ్చినట్టు చేస్తున్నాడు. ఎంత సేపూ స్నేహితులంటూ తిరుగుతుంటాడు. ఖర్చు పెరిగింది. బైక్ కొనివ్వమని గొడవ చేస్తున్నాడు. దుస్తులు, షూస్ మునుపటిలా కాకుండా బ్రాండెడ్ కావాలంటున్నాడు. నిర్లక్ష్యంగా జవాబివ్వడం చేస్తున్నాడు.
3) మూడో స్నేహితుడు… మావాడిలో పెద్దగా మార్పు లేదు. ఇప్పటికీ బట్టలు మేమే కొనిస్తాం. వాడికి ప్రత్యేక సెలక్షన్ అంటూ ఏమీ లేదు. ప్యాకెట్ మనీ మేమిచ్చినా ఖర్చు పెట్టకుండా తీసుకొస్తాడు. స్నేహితులకు అసలు ఖర్చు పెట్టడు. వాని ఫ్రెండ్స్ అంతా ఐ ఫోన్, శ్యాంసంగ్ సెట్లు వాడుతుంటే వీడు సాధారణ పోన్ వాడతాడు. ఏదైనా పని చెబ్తే చేసుకొస్తాడు. ఒక విధంగా మేం అదృష్టవంతులమనిపిస్తోంది.మా ఆదేశాలను జవదాటడు.
ఈ ముగ్గురు పిల్లల్లో మనకు మూడో వాడు ఉత్తముడనిపిస్తాడు. కాని కానే కాదంటున్నారు మనస్తత్వ నిపుణులు. యువతీ,యుతకులు యుక్త వయసు (16-22 ) లో స్వతంత్రంగా ఆలోచించడం మొదలు పెడతారు. తల్లిదండ్రులతో సహా ఎవరూ తమను ఆదేశించవద్దని ఆశిస్తారు. సొంత వ్యక్తిత్వం, ఆత్మగౌరవం పెంపొందించుకోవడం సహజంగానే వస్తుంది. అందరూ నడిచే దారిలో కాకుండా భిన్నంగా వెళ్లాలనుకుంటారు. ఎదురు దెబ్బలు తగిలితే ఏది సరైనదో ఏది కాదో గ్రహిస్తారు. చాటుగా సిగరెట్లు కాల్చడం, బీరు, మందు ఎలా ఉంటాయో ప్రయత్నించి చూస్తుంటారు. వెయ్యి మందిలో ఒకరు తప్ప వాటికి బానిస కారు. ఒక వేళ తండ్రికి తాగే అలవాటుండం, కుటుంబంలో సఖ్యత లేక డిస్ట్రబెన్స్ ఉండటం లాంటి కారణాలు వారిని అటువైపు నెడతాయి. ఆ ఏజ్ పిల్లలు తన ఆలోచనలు, ఉద్వేగాలను అందరూ గౌరవించాలని ఆశిస్తుంటారు. తల్లిదండ్రులు తమను ఇంకా చిన్న పిల్లల్లా చూస్తుండటం పట్ల చిరాకు పడుతుంటారు. వాళ్లకు అలా చూడొద్దని చెప్పలేరు. కొందరు అన్నీ విన్నట్టే విని తనకు తోచని పద్ధతిలో వెళ్తుంటారు. అమ్మాయిలు, అబ్బాయిలు ఒకరి మనస్తత్వాన్ని ఇంకొకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఒకరి పట్ల ఇంకొకరికి ఆకర్షణ ఉంటుంది. అది సహజమైన దశగా అర్థం చేసుకోవాలి. ఆడ మగ కలిసి తిరిగితే నలుగురు ఏమనుకుంటారనో, ప్రేమ మొగ్గతొడుగుతున్నట్టుగానో ఆందోళన చెందుతున్నారంటే తల్లిదండ్రులు వారిని అదుపుచేయాలని(పొసెసివ్ నెస్) ప్రయత్నిస్తున్నారని అనుకోవాలి.
ఇంట్లో ఇద్దరు పిల్లలుంటే చిన్న వయసు వారిలో తిరుగుబాటు ధోరణి ఎక్కువగా ఉంటుందని Frank Sulloway అనే సైకాలజిస్ట్ Born to Rebel అనే గ్రంథంలో ప్రస్తావించారు. ఇదంతా ఎదిగే క్రమంలో సంభవించే సహజమైన ఉండాల్సిన సంఘర్షణ అంటారాయన.
ఇక మూడో యువకుడు… అమ్మానాన్నల మాట జవదాటని వాడే వ్యక్తిత్వ నిర్మాణంలో వెనకబడ్డట్టుగా భావించాలి. సహజమైన ధిక్కార ధోరణి లేకుండా ఎప్పుడూ మరొకరి ఆదేశాల కోసం ఎదురు చూసే వారు జీవితంలో ఓడిపోక పోవచ్చు కాని నాయకులుగా ఎదగలేరు. ఎప్పుడూ ఇంకొకరి నాయకత్వం/ పర్యవేక్షణలో పనిచేస్తుంటారు. మొదట తల్లిదండ్రులు తర్వాత భార్య చెప్పినట్టు నడుచుకుంటారు. భార్య కూడా మార్గదర్శనం చేయలేని వ్యక్తి అయితే స్నేహితులో, ఆఫీసులో బాస్ చెప్పినట్టో నడుచుకుంటారు. దేనికీ పెద్దగా ఉద్వేగపడరు. సొంతంగా నిర్ణయాలు తీసుకోలేరు. దిన పత్రికలు, సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వాటిని గుడ్డిగా విశ్వసిస్తుంటారు.
చెప్పొచ్చేదేమిటంటే…యుక్త వయసులో అబ్బాయిలైనా, అమ్మాయిలైనా తిరుగుబాటు ధోరణి కలిగి ఉండటం సహజం. అలా ఉండాలి కూడా. తల్లిదండ్రులతో ఘర్షణ ఎందుకొస్తుందంటే వారిలో స్వతంత్ర ఆలోచనలు రూపుదిద్దుకోవడాన్ని గుర్తించక పోవడం వల్లే. తల్లిదండ్రులు స్నేహితుల్లా మెలిగి, పిల్లల అభిప్రాయలను గౌరవిస్తే అపోహలు లేకుండా ఉంటాయి. 23-25 ఏళ్ల వయసులో చాలా మంది యువతీయువకులు తల్లిదండ్రుల పట్ల ఆరాదనా భావాన్ని వ్యక్తికరిస్తుంటారు. అప్పట్లో తాము మూర్ఖంగా ప్రవర్తించినందుకు క్షమాపణలు కోరడం కూడా కనిపిస్తుంది. ఈ పోస్టింగ్ తల్లిదండ్రుల అవగాహన కోసం రాశాను. ఎదిగే పిల్లల సంక్లిష్ట మనస్తత్వాన్ని పూర్తి స్థాయిలో ప్రస్తావించలేదు.
(ఈ కథనం సీనియర్ జర్నలిస్ట్ బీటీ. గోవింద రెడ్డి ఫేస్ బుక్ వాల్ నుంచి సేకరించబడింది)