పాడైపోయిందని పాత వాచ్ పడేస్తున్నారా? అయితే మీరు వెండి పడేస్తున్నట్లే!
పాత వాచ్ బటన్ సెల్స్‌లో వెండి ఉంటుందనే సోషల్ మీడియా ప్రచారం ఎంతవరకు నిజం? అన్ని సెల్స్‌లో కాదు, కేవలం సిల్వర్ ఆక్సైడ్ (SR సిరీస్) బ్యాటరీల్లో మాత్రమే స్వల్ప పరిమాణంలో వెండి ఉంటుంది. అయితే దాన్ని వెలికితీయడం క్లిష్టమైన, ఖరీదైన ప్రక్రియ కావడంతో సాధారణంగా లాభదాయకం కాదు.

చాలా మంది తమ పాత వాచ్‌లను, పాడైపోయిన వాచ్‌లను పడేస్తుంటారు. అయితే నిజానికి వాళ్లు పాత పాడైపోయిన వాచ్ మాత్రమే పడేయడం లేదు. ఇప్పుడు ఎంతో విలువైన వెండిని పడేస్తున్నారు. వినేందుకు ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. వాచ్ పడేస్తే.. వెండి పడేసినట్లు ఎలా అవుతుందని ఆలోచిస్తున్నారు. ఇది పూర్తిగా చదవండి మీకే తెలుస్తుంది. గడియారాల్లో ఉపయోగించే చిన్న బటన్ సెల్స్‌లో వెండి ఉంటుందని, వాటిని సేకరించి వెండిని వెలికితీసి విక్రయిస్తే మంచి లాభాలు వస్తాయని సోషల్ మీడియాలో తరచూ వీడియోలు, పోస్టులు వైరల్ అవుతుంటాయి. అయితే అవి అబద్ధాలు కాదు, నిజమే. కానీ ప్రతి వాచ్ సెల్‌లో వెండి ఉండదు.
ఏ వాచ్‌లలో వెండి ఉంటుంది?
నిపుణుల వివరాల ప్రకారం.. అన్ని వాచ్ బటన్ సెల్స్‌లో వెండి ఉండదు. కేవలం సిల్వర్ ఆక్సైడ్ (Silver Oxide) టెక్నాలజీతో తయారైన SR సిరీస్ బటన్ సెల్స్‌లో మాత్రమే వెండి ఉంటుంది. SR626SW, SR920SW, SR927SW వంటి మోడళ్లలో క్యాథోడ్‌గా సిల్వర్ ఆక్సైడ్ (Ag₂O)ను ఉపయోగిస్తారు. అందువల్ల ఈ బ్యాటరీల్లో స్వల్ప పరిమాణంలో వెండి ఉంటుంది. మరోవైపు, LR సిరీస్ ఆల్కలైన్ బటన్ సెల్స్ జింక్, మాంగనీస్ డయాక్సైడ్‌తో తయారవుతాయి. వీటిలో వెండి ఉండదు. అందువల్ల ప్రతి వాచ్ బ్యాటరీలో వెండి ఉంటుందని భావించడం సరైంది కాదు.
ఇది కూడా చదవండి: DMart: నెలలో ఏ రోజు డీమార్ట్‌కి వెళ్తే మంచిది..? చాలా మందికి తెలియని ట్రిక్
‘జర్నల్ ఆఫ్ పవర్ సోర్సెస్’లో ప్రచురితమైన ఒక అధ్యయనంలో కూడా సిల్వర్ ఆక్సైడ్ బటన్ సెల్స్‌లో వెండి ఉనికిని ప్రస్తావించారు. పరిశోధకులు పరిశీలించిన మాక్సెల్ SR626SW బ్యాటరీలో మొత్తం బరువు సుమారు 0.4 గ్రాములు ఉండగా, అందులో సుమారు 0.12 గ్రాముల వరకు వెండి ఉండే అవకాశం ఉందని గుర్తించారు. అంటే ఇలాంటి 10 బ్యాటరీల్లో సుమారు 1 నుంచి 3 గ్రాముల వరకు వెండి లభించే అవకాశం ఉన్నప్పటికీ, అది బ్యాటరీ మోడల్, తయారీ సంస్థ, పరిమాణాన్ని బట్టి మారుతుంది.
వెండి తీసుకోవడం ఎలా?
అయితే బ్యాటరీలో వెండి ఉందని తెలిసినంత మాత్రాన దానిని సులభంగా వెలికితీయడం సాధ్యం కాదు. ఇందుకోసం ప్రత్యేక రసాయనాలు, అత్యాధునిక యంత్రాలు, భద్రతా ప్రమాణాలు అవసరమవుతాయి. ఈ ప్రక్రియలో ప్రమాదకర రసాయనాలు ఉపయోగించాల్సి రావడంతో సాధారణ వ్యక్తులు ఇంటి వద్ద ప్రయత్నించడం సురక్షితం కాదు. పైగా కొద్దిపాటి బ్యాటరీల నుంచి వెండిని తీసుకోవడం ఆర్థికంగా కూడా ప్రయోజనకరం కాదు. అందుకే ప్రపంచవ్యాప్తంగా పెద్ద రీసైక్లింగ్ సంస్థలు వేల సంఖ్యలో సిల్వర్ ఆక్సైడ్ బ్యాటరీలను సేకరించి పారిశ్రామిక స్థాయిలో వెండిని పునరుద్ధరిస్తుంటాయి.
