
హిమాలయాలు.. పేరు వింటేనే మనసులో ఆహ్లాదం వెల్లివిరుస్తుంది. అలాంటి నేరుగా హిమాలయ పర్వత శ్రేణుల చెంతకు వెళితే.. ఆ ఆనందమే వేరు అని చెప్పాలి. అక్కడికి వెళ్లిన ఎవరికైనా హిమాలయ పర్వతాల సోయగాలను, ప్రకృతి పరవళ్లను ఆస్వాదిస్తూ అలాగే ఉండిపోవాలనిపిస్తుంటుంది. అంతలా కనువిందు చేస్తాయి మరి హిమాలయాలు. మనం ప్రత్యక్షంగా అక్కడికి వెళ్లి హిమాలయాల్లో కొంత భాగం మాత్రమే చూసి ఎంతగానో పరవశించిపోతాం.. అలాంటిది ఏకబిగిన మొత్తం హిమాలయ పర్వతశ్రేణులే కళ్ల ముందు కనువిందు చేస్తే.. ఒక్కసారి ఊహించుకోండి ఎలా ఉంటుందో.
అవును.. ఒక్క చిత్రంలో మొత్తం హిమాలయ పర్వత శ్రేణులు కనువిందు చేశాయి. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్) హిమాలయ పర్వత శ్రేణులకు సంబంధించి ఒక చిత్రాన్ని విడుదల చేసింది. ఆ ఫోటోలో హిమాలయ పర్వతాలు మంచుతో కప్పబడి ఎంతో అద్భుతంగా దర్శనమిస్తున్నాయి. హిమాలయలే కాదు.. అటు పక్కన భారతదేశ రాజధాని ఢిల్లీ, పాకిస్తాన్‌లోని లాహోర్ నగరాలు సైతం ఈ ఫోటోలో ఉన్నాయి. విద్యుత్ కాంతుల వెలుగులతో ఈ నగరాలు జిగేలమంటున్నాయి. ఐఎస్ఎస్ ఈ ఫోటోను ఇన్‌స్టాగ్రమ్‌లో పోస్ట్ చేయగా.. ఇప్పుడది తెగ వైరల్ అవుతోంది. మరి ఆ చిత్రాన్ని మీరూ ఒకసారి చూడండి..