NASA: చంద్రుడిపై 50 ఏళ్ల నాటి మానవ మలం.. రీసైకిల్ చేయడానికి నాసా ఎంత ఆఫర్ చేసింది తెల్సా,,
నదులు, మైదానాలు, పర్వతాలు, సముద్రాలు, ఎడారులు.. మనిషి స్వార్థానికి బలికానిదేదీ లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే మొత్తం భూగోళమే మనిషి నింపుతున్న చెత్త, వ్యర్థాలతో నిండిపోతోంది. ఆ మనిషి భూమినే కాదు.. అంతరిక్షాన్ని సైతం విడిచిపెట్టలేదు. భూమి చుట్టూ ఉపగ్రహాలు (శాటిలైట్లు) రూపంలో ఇప్పటికే చెత్త పేరుకుపోతోందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఇది చాలదన్నట్టు భూమి చుట్టూ తిరిగే చంద్రుణ్ణి సైతం వదిలిపెట్టలేదు. అక్కడ కూడా ఏకంగా 96 సంచుల్లో వ్యర్థాలు పేరుకుపోయాయి. ఇప్పుడు ఈ అంతరిక్ష వ్యర్థాలే శాస్త్రవేత్తలకు సవాల్ విసురుతున్నాయి. భూమ్మీద అంటే వాటిని ఎలాగోలా రీసైకిల్ చేయవచ్చు. కానీ భూమి తరహా వాతావరణం లేని అంతరిక్షంలో వాటిని రీసైకిల్ చేయడం ఎలా అన్నదే వారికి అంతుచిక్కడం లేదు. అందుకే ఎవరైనా బ్రహ్మాండమైన ఆలోచనతో ముందుకొస్తే.. ఆ ఆలోచన నిజమైన పరిష్కారాన్ని చూపితే వారికి భారీ బహుమతి ఇస్తామంటూ అమెరికా అంతరిక్ష సంస్థ నాసా (NASA) ప్రకటించింది.

చంద్రుడిపై మానవ వ్యర్థాలను రీసైకిల్ చేసే సాంకేతికతను అభివృద్ధి చేయడానికి నాసా ఒక సవాలు విసిరింది. ‘లూనారీసైకిల్ చాలెంజ్’ పేరుతో ఈ పోటీలో విజేతలకు 3 మిలియన్ డాలర్ల (సుమారు 25 కోట్ల రూపాయలు) బహుమతిని అందజేస్తామని తెలిపింది. అపోలో మిషన్ల సమయంలో చంద్రుడిపై వదిలేసిన 96 బ్యాగుల మానవ వ్యర్థాలను (మలం, మూత్రం వంటివి) నీరు, శక్తి, ఎరువు వంటి ఉపయోగకరమైన వనరులుగా మార్చే ఆవిష్కరణలతో ముందుకురావాలని ఔత్సాహిక శాస్త్రవేత్తలను కోరుతోంది.
అసలీ వ్యర్థాలు అక్కడికి ఎలా చేరాయి?
1969 నుంచి 1972 వరకు నాసా అపోలో మిషన్లలో భాగంగా చంద్రుడిపైకి వెళ్లిన వ్యోమగాములు, తమ లూనార్ మాడ్యూల్స్‌లో స్థలాన్ని ఆదా చేయడం కోసం 96 బ్యాగుల మానవ వ్యర్థాలను అక్కడే వదిలివేశారు. ఈ వ్యర్థాలు ఇప్పటివరకు చంద్రుడిపై అలాగే ఉన్నాయి. ఇప్పుడు నాసా ఆర్టెమిస్ కార్యక్రమంలో భాగంగా చంద్రుడిపై శాశ్వత మానవ నివాసాన్ని స్థాపించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది జరగాలంటే ముందు అక్కడ వ్యర్థాలను రీసైకిల్ చేసే పరిజ్ఞానం సమకూర్చుకోవాలి. దీంతో చంద్రమండలంపై వ్యర్థాల నిర్వహణ, రీసైక్లింగ్ అత్యంత కీలకమైన అంశంగా మారింది. భవిష్యత్తులో చంద్రుడిపై లేదా మంగళ గ్రహ మిషన్లలో వ్యర్థాలను భూమ్మీదకు తిరిగి తీసుకురాకుండా, వాటిని అక్కడే ఉపయోగకరమైన వనరులుగా మార్చే సాంకేతికత అవసరమని నాసా పేర్కొంది. ఈ క్రమంలో లూనారీసైకిల్ చాలెంజ్ పేరుతో శాస్త్రవేత్తలకు సవాల్ విసిరింది.
రెండు దశల్లో ఛాలెంజ్
లూనారీసైకిల్ చాలెంజ్ రెండు దశలు, రెండు ట్రాక్‌లతో కూడిన పోటీగా రూపొందించారు. ఈ చాలెంజ్‌లో పాల్గొనేందుకు ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా అర్హులే. నాసాతో లేదా ఇతర అంతరిక్ష సంస్థల్లో పని చేసిన అనుభవం కూడా అవసరం లేదు. పోటీలో పాల్గొనేవారు మానవ వ్యర్థాలను రీసైకిల్ చేయడంతో పాటు, ఆహార ప్యాకేజింగ్, పాత బట్టలు, పరిశోధనా పరికరాలు వంటి ఇతర ఘన వ్యర్థాలను కూడా నిర్వహించే సమగ్ర వ్యవస్థలను రూపొందించాలి. ఈ సాంకేతికతలు చంద్రుడి కఠిన వాతావరణంలో పనిచేయగలిగేలా ఉండాలి, ఇందులో భూమ్మీద అనుసరించే సాంప్రదాయ వ్యర్థ నిర్వహణ పద్ధతులు సాధ్యం కావు.
మొదటి దశ ప్రతిపాదనలను అందజేసేందుకు 2025 మార్చి 31 చివరి తేది. దీంతో ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల నుంచి ప్రతిపాదనలు అందాయి. ప్రస్తుతం నాసా వాటిని సమీక్షిస్తోంది. వాటిలో ఎంపికైన కొన్ని ప్రతిపాదనలపై తదుపరి దశలో ప్రోటోటైప్ అభివృద్ధికి అవకాశం ఇస్తారు. అత్యంత విజయవంతమైన బృందం 3 మిలియన్ డాలర్ల గ్రాండ్ బహుమతిని గెలుచుకుంటుంది. అలాగే భవిష్యత్ లూనార్ మిషన్లలో తమ సాంకేతికతను అమలు చేసే అవకాశం కూడా పొందవచ్చు.
నాసా ఈ సవాలు ద్వారా అంతరిక్షంలో అన్వేషణలు, పరిశోధనలను ప్రోత్సహించాలని లక్ష్యంగా పెట్టుకుంది. “మేము భవిష్యత్ మానవ అంతరిక్ష మిషన్ల కోసం సిద్ధమవుతున్నప్పుడు, వ్యర్థాలను తగ్గించడం, నిల్వ చేయడం, రీసైకిల్ చేయడం ఎలా అన్నదే ప్రధానాంశంగా మారింది. అంతరిక్ష వాతావరణంలో వ్యర్థాలు భూమికి తిరిగి రాకుండా ఉండేలా చూడాలి” అంటూ నాసా ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ సవాలు కేవలం చంద్రుడిపై వ్యర్థాలను శుభ్రం చేయడానికి మాత్రమే కాదు, దీర్ఘకాల అంతరిక్ష ప్రయాణాల్లో వనరులను సమర్థవంతంగా ఉపయోగించుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది.
ఈ సవాలు భూమిపై కూడా విస్తృత ప్రభావాన్ని చూపవచ్చని నాసా భావిస్తోంది. అంతరిక్షంలో వ్యర్థ నిర్వహణ కోసం అభివృద్ధి చేసే సాంకేతికత పరిజ్ఞానం, మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో, అత్యవసర పరిస్థితుల్లో, లేదా వ్యర్థాలతో నిండిన పట్టణ కేంద్రాల్లో సమర్థవంతమైన రీసైక్లింగ్ వ్యవస్థలను సృష్టించడంలో ఉపయోగపడవచ్చని భావిస్తోంది.
నవ్వులాట కాదు.. తీవ్రమైన సమస్యే
నాసా ఈ సమస్యను హాస్యాస్పదంగా “గెలాక్సీ ఫార్ట్, ఫార్ట్ అవే” అని సూచించినప్పటికీ, ఇది నవ్వులాట కాదని, తీవ్రమైన సమస్యేనని అర్థమవుతోంది. దీర్ఘకాల అంతరిక్ష మిషన్లలో, అంగాకరకుడి వంటి గ్రహాలకు ప్రయాణాలలో, ప్రతి వనరును రీసైకిల్ చేయడం, మళ్లీ ఉపయోగించడం తప్పనిసరి. చంద్రుడిపై శాశ్వత నివాసం కోసం సిద్ధమవుతున్న ఆర్టెమిస్ కార్యక్రమంలో ఈ సాంకేతికతలు కీలక పాత్ర పోషించనున్నాయి. అంతరిక్షంలో స్థిరమైన జీవనానికి మార్గం సుగమం చేయడానికి ఈ ప్రయోగాలు, పరిశోధనలు కీలకంగా మారనున్నాయి. పోటీ ఫలితాలు అంతరిక్ష అన్వేషణలో నవ శకాన్ని ఆవిష్కరించే అవకాశం ఉంది.