చిన్న తనంలో భర్తను కోల్పోయి, పిల్లలను కష్టపడి ఒంటి చేత్తో పెంచే తల్లులు మన నిత్య జీవితంలో ఎందరినో చూస్తున్నాం. అలాంటి వాళ్లను మళ్లీ పెళ్లి చేసుకుని జీవితాన్ని కొత్తగా ప్రారంభించమని చెప్పేవాళ్లు చాలా అరుదు. అందులో కన్న బిడ్డలు దగ్గరుంచి తల్లికి మళ్లీ పెళ్లి చేస్తే.. తమిళనాడులో చోటుచేసుకున్న ఈ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకెళ్తే..
కల్లకురిచి జిల్లా వలయమ్పట్టు గ్రామానికి చెందిన సెల్వి అనే మహిళకు ఇద్దరు కుమారులు సంతానం. పెద్ద కొడుకకు భాస్కర్, చిన్న కొడుకు వివేక్. వీరు చిన్నతనంలోనే (2009) తమ తండ్రిని కోల్పోయారు. బాస్కర్ డిగ్రీ మూడో ఏడాది చదువుతున్నప్పుడు తనకు పాఠాలు చెప్పే ఓ టీచర్ మీ అమ్మకు ఎందుకు రెండో పెళ్లి చేయకూడదు అని ప్రశ్నించింది. ఆ సమయంలో టీచర్ అన్నమాటలు భాస్కర్ జీర్ణించుకోలేకపోయాడు. ఆ తర్వాత తన కాలేజీ చదువు ముగించుకుని, ఉద్యోగంలో చేరిపోయాడు. దాదాపు తన టీచర్ చెప్పిన ఆ మాటలు మర్చిపోయాడు. బాస్కర్‌కు పుస్తకాలు చదివే అలవాటు ఉన్నందున ప్రముఖ తమిళ రచయిత పెరియార్ రాసిన పుస్తకాలు చదివేవాడు. ఆ పుస్తకాల్లో వితంతు పునర్వివాహాలు గురించి పెరియార్ ఎంతో గొప్పగా చెప్పారు. భాస్కర్ ఆలోచనాపొరల్లో టీచర్ తన తల్లి గురించి చెప్పిన మాట్లలు గుర్తుకురాసాగాయి. తన ఇంట్లో కూడా తల్లి భర్తను కోల్పోయి ఒంటరిగా గడుపుతోందని, ఆమె మళ్లీ పెళ్లి ఎందుకు చేసుకోకూడదు అనే విషయం ఆలోచించడం ప్రారంభించాడు. ఇదే విషయాన్ని తన తమ్ముడు వివేక్‌తో చర్చించాడు. తమ్ముడు అంగీకరించడంతో ఇద్దరూ కలిసి తమ నిర్ణయాన్ని తల్లి ముందుంచారు.
ఒంటరిగా జీవితాన్ని గడుపుతున్న తల్లిని తొలుత వివాహం చేసుకోవాలని, ఆ తర్వాత తాము కూడా పెళ్లిళ్లు చేసుకుంటామని తల్లి సెల్వికి తెలిపారు. పెళ్లీడుకొచ్చిన కొడుకులను ఇంట్లో పెట్టుకుని రెండో పెళ్లి చేసుకుంటే చుట్టూ ఉండే సమాజం ఏమనుకుంటుందని భయపడిన సెల్వీ కొడుకులను తిట్టిపోసింది. రోజూ ఇదే విషయమై కొడుకులు తనను బతిమిలాడుతుంటే ఎట్టకేలకు సెల్వి రెండో వివాహం చేసుకునేందుకు అంగీకరించింది. తాను వివాహం చేసుకోవడం వల్ల తనలాంటి ఎందరో మహిళలకు ఉదాహరణ ఉండగలనని సెల్వి గట్టిగానమ్మింది. తాను కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోని బంధువులు తన రెండో పెళ్లి గురించి మాట్లాడే అధికారం లేదని ప్రశ్నించింది. పిల్లలకు భారంకాకుండా తన చివరిరోజుల్లో తనకంటూ ఓ తోడుకావాలని భావించింది. తన భర్త చనిపోయినప్పుడు వాళ్లింట్లో మరుగుదొడ్డి సదుపాయంలేదని, రాత్రి పూట బయటికి వెళ్తుంటే ఈ సమయంలో ఎక్కడికి పోతున్నావంటూ ప్రశ్నించేవారని, భర్త లేకుండా ఒంటరిగా బతుకుతుండటంతో ఎంతోమంది తనతో సంబంధం పెట్టుకోవడానికి ప్రయత్నించేవారని, కానీ వాళ్లలో ఎవ్వరూ పెళ్లి చేసుకుంటానని అనలేదని సెల్పి నాటి రోజులను గుర్తు చేసుకున్నారు. ఇలాంటి సమస్యలు కేవలం మహిళలే ఎందుకు ఎదుర్కోవాలని ప్రశ్నించారు. తల్లి నుంచి అనుమతి పొందిన తర్వాత కొడుకులు యేలుమలై అనే ఓ రైతు కూలీతో సెల్వి వివాహం జరిపించారు. ఐతే సెల్వి పునఃవివాహానికి బంధువులు ఎవ్వరూ హాజరుకాలేదు.
భర్త లేకుండా ఇద్దరు పిల్లల్ని ఎలా పెంచాలో తెలియక అత్తమామల సాయంకోరితే ఎవ్వరూ ముందుకురాలేదు. ఒంటరిగానే పిల్లల్ని పెంచాను. ఇబ్బందులెదుర్కొంటూ పెరిగిన తన కొడుకులు, సమాజంలో జరిగే ప్రతి విషయాన్ని బాగా అర్థం చేసుకున్నారని, నా కొడుకులను చూస్తే నా కెంతో గర్వంగా ఉందంటూ సెల్వీ మీడియాకు తెల్పింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.