తప్పిపోయి.. 250 కి.మీ. ప్రయాణించి తిరిగి యజమాని ఇంటికి చేరిన శునకం..!

| Edited By: Balaraju Goud

Aug 03, 2024 | 3:50 PM

ఎప్పుడైనా తీర్థయాత్రలకు వెళ్లినప్పుడు చిన్నపిల్లలు తప్పిపోవడం మనం చూశాం. జనం హడావుడి మధ్య తప్పిపోయిన వాళ్ల కోసం మైక్ అనౌన్స్ మెంట్ చేయించzడం ఇలాంటివన్నీ చూసే ఉంటాం. కానీ, ఇక్కడ ఒక కుక్క తప్పిపోయింది. అది కూడా మళ్లీ 250 కి.మీ యజమాని ఇంటికి తిరిగి వచ్చింది. వింతగా ఉంది కదూ..!

తప్పిపోయి.. 250 కి.మీ. ప్రయాణించి తిరిగి యజమాని ఇంటికి చేరిన శునకం..!
Dog Returns
Follow us on

ఎప్పుడైనా తీర్థయాత్రలకు వెళ్లినప్పుడు చిన్నపిల్లలు తప్పిపోవడం మనం చూశాం. జనం హడావుడి మధ్య తప్పిపోయిన వాళ్ల కోసం మైక్ అనౌన్స్ మెంట్ చేయించzడం ఇలాంటివన్నీ చూసే ఉంటాం. కానీ, ఇక్కడ ఒక కుక్క తప్పిపోయింది. అది కూడా మళ్లీ 250 కి.మీ యజమాని ఇంటికి తిరిగి వచ్చింది. వింతగా ఉంది కదూ..! ముక్కున వేలేసుకుని ఆశ్చర్యపోయేలా ఉన్న ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో జరిగింది.

కర్ణాటకలోని బెలగావి జిల్లాలోని నిపాని తాలూకా యమగర్ని గ్రామానికి చెందిన కమలేష్ కుంభార్ ఏటా మహారాష్ట్రలోని పండరీపూర్‌లో ఉన్న విఠల్ రుక్మిణి ఆలయానికి పాదయాత్ర చేస్తుంటారు. ప్రతి సంవత్సరం ఆషాఢ ఏకాదశి, కార్తీక ఏకాదశి నాడు తాను పండరీపూర్‌ని సందర్శిస్తానని కమలేష్ చెప్పాడు. ఈ క్రమంలోనే ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా పాదయాత్రకి వెళ్లాడు. వెళ్తూ వెళ్తూ తన వెంట పెంపుడు కుక్కని కూడా తీసుకుని వెళ్లాడు. ఆ కుక్కని ముద్దుగా ‘మహారాజ్’ అని పిలుచుకోవడం ఆ ఇంటివారికి అలవాటు. ఇదంతా బాగానే ఉండగా.. యాత్రలో ఉండగా పండరీపూర్‌ చేరుకున్న తర్వాత మహారాజ్ తప్పిపోయింది. చుట్టుపక్కల ఎంత వెతికినా, ఎవరిని అడిగినా ఆచూకీ దొరకలేదు. చేసేదీ లేక, గత నెల జులై 14న కమలేష్ తిరిగి తన ఇంటికి చేరుకున్నాడు.

ఆ తర్వాతే అందరూ ఆశ్చర్యపోయేలా ఓ సంఘటన జరిగింది. తప్పిపోయింది అనుకున్న కుక్క మహారాజ్ తిరిగి యజమాని దగ్గరికి చేరుకుంది. అది కూడా 250 కి.మీ ప్రయాణించి తిరిగి వచ్చింది. తోక ఊపుతూ తన ముందు నిలబడిన పెంపుడు కుక్కని చూసి కమలేష్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇంకేముంది.. ఆనందోత్సాహాలతో పండగ చేసుకున్నాడు. కుక్కను పూలమాలలతో కప్పి హారతి ఇచ్చాడు. దాని గౌరవార్థం గ్రామస్థులకు విందు ఏర్పాటు చేశాడు. ఆ సమయంలో తన పెంపుడు కుక్క మహారాజ్ ను చూసి నోట మాట రాలేదని, ఆనందం పట్టలేకపోయాయని చెప్పుకొచ్చాడు. ఆ పాండురంగడే ఇలా తన కుక్కకు దారి చూపించాడని పొంగిపోయాడు. తప్పిపోయిన కుక్క ఇలా తిరిగి రావడం అద్భుతమని కమలేష్ తోపాటు గ్రామస్థులు కూడా సంతోషం వ్యక్తం చేశారు.

సాధారణంగానే కుక్కలను విశ్వాసానికి మారుపేరుగా చెబుతుంటారు. ప్రేమ పంచితే మనుషుల కన్నా అవే నయం అని చెప్పేవాళ్లు కూడా లేకపోలేదు. కుక్కలు విశ్వాసమే కాదు.. ప్రేమను కూడా పంచుతాయని చెప్పడానికి ఈ ఒక్క సంఘటన సరిపోదా చెప్పండి. మామూలుగా యాత్రలకు వెళ్లినప్పుడు పిల్లలు ఎక్కడైనా తప్పిపోతారని, వారి పట్ల జాగ్రత్త వహించడం మనకు తెలిసిందే. అలాంటిది ఈ మూగజీవి చేసిన పనికి ఎవరైనా సలాం కొట్టాల్సిందే. కుక్కలు ఇంటి నుంచి బయటికి వీధిలోకి వెళ్తేనే మళ్లీ తిరిగి వస్తాయో లేదో మనం చెప్పలేం. అలాంటిది ఒక పెంపుడు కుక్క ఏకంగా వందల కిలోమీటర్లు ప్రయాణించి తిరిగి వచ్చి యజమాని మీద విశ్వాసం చూపించడం అంటే అద్భుతమే కదా మరి..!

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..