Saraswati River: మరుగున పడ్డ అపురూప నది జాడ.. అంతర్వాహిని సరస్వతి రహస్యం ఏంటో..?

|

Jan 23, 2025 | 3:14 PM

ఇప్పుడు మహా కుంభమేళా జరుగుతున్న ప్రయాగ్‌రాజ్‌ని త్రివేణి సంగమం అని కూడా పిలుస్తారు. ఇక్కడే గంగ, యమున, సరస్వతి నదులు కలుస్తాయని హిందువుల విశ్వాసం. అయితే గంగ, యమునా నదులు కనిపిస్తాయి. సరస్వతి కనిపించదు. అయితే అది అంతర్వాహిని అని, భూమి కింద నుంచి ప్రవహిస్తుందని చెబుతారు.

Saraswati River: మరుగున పడ్డ అపురూప నది జాడ.. అంతర్వాహిని సరస్వతి రహస్యం ఏంటో..?
Mystical Saraswati River
Follow us on

రెండు వేర్వేరు సంఘటనలు.. మరుగున పడ్డ ఒక అపురూప విషయాన్ని మళ్లీ తెర పైకి తీసుకుని వచ్చాయి. అదే సరస్వతీ నది. వేదాల్లో సరస్వతీ నది ప్రస్తావన ఉంది. అదే ప్రయాగ్‌రాజ్‌లో త్రివేణి సంగమంలో అంతర్వాహినిగా ప్రవహించే సరస్వతీ నది అని చెబుతారు. ఈ నది మనకు భౌగోళికంగా కనిపించదు. అయితే భూమి కింద అంతర్వాహినిగా ప్రవహిస్తోందని చెబుతారు. అయితే ఇటీవల జరిగిన రెండు సంఘటనలు.. సరస్వతీ నది ఉనికిని ఎలా నిర్ధారిస్తున్నాయో చూద్దాం.

కొద్ది రోజుల క్రితం రాజస్ధాన్‌ ఎడారిలో, ఓ రహస్య సరస్సు అనుకోకుండా బయటపడింది. జైసల్మేర్‌లోని మోహన్‌గఢ్‌లో ఓ రైతు తన పొలంలో ట్యూబ్‌వెల్‌ కోసం డ్రిల్లింగ్‌ చేయిస్తుండగా ఆకస్మాత్తుగా భూమి నుంచి జలధార ఉబికివచ్చింది. నీటితో పాటు గ్యాస్‌ బయటకు రావడంతో అందరూ ఉలిక్కిపడ్డారు. అందరూ చూస్తుండగానే ఆ ప్రాంతమంతా జలమయమయ్యింది. ఓ పెద్ద సరస్సు ఏర్పడింది.

లారీతో పాటు డ్రిల్లింగ్‌ మిషన్‌ కూడా నీటిలో మునిగిపోయింది. ఆ ప్రాంతమంతా నీటితో నిండిపోయింది. దీంతో స్థానికులను ఆ ప్రాంతం నుంచి ఖాళీ చేయించారు అధికారులు. అదే సరస్వతి నది అని చెబుతున్నారు స్థానికులు. వేల సంవత్సరాల క్రితం ఈ ప్రాంతం గుండా సరస్వతీ నది ప్రవహించేది అని, ఆ తర్వాత అది భూమిలోకి ఇంకిపోయిందని చెబుతారు. ఆ నదికి సంబంధించిన నీటి ఊటల నుంచే ఈ సరస్సు బయటకు వచ్చిందని స్థానికులు చెబుతున్నాఉ.

ఇక కొద్ది రోజుల క్రితం హర్యానా లోని రాఖీగర్హి ప్రాంతంలో పురావస్తు పరిశోధకులు తవ్వకాలు జరుపుతుండగా, భూగర్భంలో కొన్ని భారీ రిజర్వాయర్లు బయటపడ్డాయి. అవి 10 అడుగుల పొడవు, 10 అడుగుల వెడల్పుతో పాటు నాలుగైదు అడుగుల లోతు ఉన్నాయి. సరస్వతీ నది ఉపనది అయిన దృషద్వతి నీటిని నిల్వ చేసేందుకే, నాటి ప్రజలు ఈ భారీ భూగర్భ సంపులను నిర్మించారని చరిత్ర పరిశోధకులు చెబుతున్నారు. అయితే 3 వేల సంవత్సరాల క్రితమే.. దృషద్వతి, సరస్వతి నదులు క్రమేపీ ఇంకిపోతుండడంతో, నీటి నిల్వ కోసం నాటి ప్రజలు, ఈ వాటర్‌ రిజర్వాయర్లను నిర్మించారని చరిత్రకారులు భావిస్తున్నారు. ఈ రాఖీగర్హి ప్రాంతం.. ఇండస్‌ వ్యాలీ సివిలైజేషన్‌కు సంబంధించిన ప్రాంతం. అంటే దాదాపు ఐదారు వేల ఏళ్ల కాలం నాటి సింధు నది నాగరికతకు సంబంధించిన ప్రాంతం. ఇది పంజాబ్, హర్యానా, రాజస్థాన్‌తో పాటు పాకిస్తాన్‌ లోని కొన్ని ప్రాంతాల్లో కూడా విస్తరించి ఉంది.

ఇక 2018లో కూడా ఇస్రో శాటిలైట్‌ చిత్రాలు సరస్వతీ నది ఉనికిని నిర్ధారించాయి. అప్పట్లో పార్లమెంట్‌కు ఇస్రో సమర్పించిన పత్రాల్లో ఈ విషయం ఉంది. సరస్వతీ నది ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రవహించేదో, శాటిలైట్‌ ఇమేజెస్‌ ద్వారా ఇస్రో నిర్ధారించింది. అయితే 3 వేల సంవత్సరాల క్రితం వచ్చిన వాతావరణ మార్పులు, భూ భౌగోళిక మార్పులతో సరస్వతీ నది, దాని ఉపనది అయిన దృషద్వతి ఎండిపోయి, భూమిలోకి ఇంకిపోయాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అసలు ఈ సరస్వతీ నది ఎక్కడ పుట్టింది, ఎక్కడ సముద్రంలో కలిసేదో చూద్దాం.

సరస్వతీ నది పుట్టుక హిమాలయాలు.. మంచు పర్వతాల్లో ఉద్భవించిన సరస్వతీ.. హిమాచల్‌, ఉత్తరాఖండ్‌, పంజాబ్, హర్యానా, రాజస్థాన్ మీదుగా ప్రవహించింది. చివరికి అరేబియా సముద్రంలో సంగమం అయ్యినట్లు చరిత్ర చెబుతోంది. 9వేల నుంచి 4 వేల సంవత్సరాల క్రితం వరకు సరస్వతీ నది ప్రవహించిందని ఇస్రో పరిశోధనలు సూచిస్తున్నాయి. 3 వేల ఏళ్ల క్రితం వాతావరణ, భూ భౌగోళిక మార్పులు కారణంగా, వర్షాలు కురవక ఎండిపోయిన సరస్వతి, దృషద్వతి నదులు ఎండిపోయాయి.

ఇప్పుడు మహా కుంభమేళా జరుగుతున్న ప్రయాగ్‌రాజ్‌ని త్రివేణి సంగమం అని కూడా పిలుస్తారు. ఇక్కడే గంగ, యమున, సరస్వతి నదులు కలుస్తాయని హిందువుల విశ్వాసం. అయితే గంగ, యమునా నదులు కనిపిస్తాయి. సరస్వతి కనిపించదు. అయితే అది అంతర్వాహిని అని, భూమి కింద నుంచి ప్రవహిస్తుందని చెబుతారు. రాజస్థాన్‌లో ఇటీవల బయటపడ్డ భూగర్భ సరస్సు, రాఖీగర్హిలో బయటపడ్డ భారీ నీటి రిజర్వాయర్లు.. ఇవన్నీ సరస్వతీ నది ఉనికిని నిర్ధారిస్తున్నాయని చరిత్రకారులు భావిస్తున్నారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..