మన దేశంలో అతిపెద్ద రైల్వే స్టేషన్ ఏదో తెలుసా..? 90శాతం మందికి ఈ నిజం తెలియదు..
ప్రతిరోజూ రైలులో ప్రయాణించే వారికి కూడా తెలియని ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. మన దేశంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్ ఏది? చాలా మంది ముంబై లేదా ఢిల్లీ అనుకుంటారు. కానీ, 23 ప్లాట్‌ఫారాలతో, లక్షలాది మంది ప్రయాణికులతో కిటకిటలాడే పెద్ద కోట లాంటి మహా స్టేషన్ గురించి ఇప్పడు తెలుసుకుందాం. .

భారతీయ రైల్వే.. దేశానికి గుండెకాయ వంటిది. ప్రపంచంలోనే అతిపెద్ద రవాణా వ్యవస్థల్లో ఒకటి. ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణికులు, వేలాది రైళ్లు పట్టాలపై పరుగులు తీస్తూ దేశాన్ని కలుపుతుంటాయి.మన దేశంలో వేలాది రైల్వే స్టేషన్లు ఉన్నప్పటికీ, కొన్ని స్టేషన్లకు ఉన్న ప్రత్యేకత, చరిత్ర మరే ఇతర స్టేషన్లకు ఉండదు. సాధారణంగా మన దేశంలో అతిపెద్ద రైల్వే స్టేషన్ అంటే ముంబైలోని ఛత్రపతి శివాజీ టెర్మినస్ లేదా న్యూఢిల్లీ స్టేషన్ అని చాలా మంది భావిస్తారు. కానీ విస్తీర్ణం, ప్లాట్‌ఫారాల సంఖ్య పరంగా చూస్తే, పశ్చిమ బెంగాల్‌లోని హౌరా జంక్షన్ అందరికంటే అగ్రస్థానంలో నిలుస్తుంది. రోజూ రైలులో ప్రయాణించే వారికి కూడా తెలియని ఈ స్టేషన్ విశేషాలేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
23 ప్లాట్‌ఫారాల మహా సామ్రాజ్యం
హౌరా జంక్షన్ ఒక భారీ కోటలా కనిపిస్తుంది. దీని పరిమాణం వింటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఈ స్టేషన్‌లో ఏకంగా 23 ప్లాట్‌ఫారాలు ఉన్నాయి. దేశంలో మరే ఇతర రైల్వే స్టేషన్‌లోనూ ఇన్ని ప్లాట్‌ఫారాలు లేవు. పక్కనే ఉన్న సీల్దా స్టేషన్ 21 ప్లాట్‌ఫారాలతో రెండో స్థానంలో ఉంది. ఇక్కడ 25కు పైగా రైల్వే ట్రాక్‌లు నిరంతరం రద్దీగా ఉంటాయి. ప్రతిరోజూ సుమారు 10 లక్షల మంది ప్రయాణికులు ఈ స్టేషన్ నుంచి రాకపోకలు సాగిస్తుంటారు. అంటే ఒక చిన్న నగరం జనాభా అంత మంది ఇక్కడ ప్రతిరోజూ కనిపిస్తారు.
చరిత్ర సృష్టించిన మైలురాళ్లు
హౌరా జంక్షన్ కేవలం ఒక స్టేషన్ మాత్రమే కాదు భారతీయ రైల్వే పరిణామ క్రమానికి సాక్ష్యం. ఈ స్టేషన్ భవన నిర్మాణానికి 1852లో ప్రణాళికలు సిద్ధమవగా, 1854లో అధికారికంగా ప్రారంభమైంది. అప్పట్లో కేవలం ఒక చిన్న షెడ్డుగా ఉన్న ఈ స్టేషన్.. నేడు ఒక మహా సామ్రాజ్యంగా ఎదిగింది. తూర్పు భారతదేశంలో మొట్టమొదటి ప్యాసింజర్ రైలు 1854 ఆగస్టు 15న హౌరా నుండి హుగ్లీ వరకు నడిచింది. భారతీయ రైల్వే చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకమైన రాజధాని ఎక్స్‌ప్రెస్ తన తొలి ప్రయాణాన్ని 1969లో ఈ స్టేషన్ నుండే ప్రారంభించింది.
నిర్మాణ శైలి
హౌరా స్టేషన్ భవనం దాని ఎరుపు రంగు ఇటుకల నిర్మాణంతో బ్రిటిష్ ఆర్కిటెక్చర్ శైలిని గుర్తుకు తెస్తుంది. హుగ్లీ నది ఒడ్డున ఉండే ఈ స్టేషన్.. ప్రపంచ ప్రసిద్ధ హౌరా బ్రిడ్జికు సరిగ్గా ఆనుకుని ఉంటుంది. ఇది కోల్‌కతా నగరానికి ప్రధాన ద్వారం. ఈ స్టేషన్ రెండు టెర్మినల్స్‌గా విభజించబడి ఉంటుంది. పాత టెర్మినల్, కొత్త టెర్మినల్ కలిసి దేశవ్యాప్తంగా వందలాది రైళ్లను కలుపుతాయి. కాగా వందల ఏళ్ల చరిత్ర, వేలాది మంది సిబ్బంది, లక్షలాది మంది ప్రయాణికులు.. వెరసి హౌరా జంక్షన్ ఒక మహా అద్భుతం. మీరు ఎప్పుడైనా కోల్‌కతా వెళ్తే, ఈ చారిత్రక కట్టడాన్ని, అక్కడ ఉండే రద్దీని చూడటం ఒక మరపురాని అనుభవం.
