Humanity: అమ్మతనం మహిమాన్వితం.. అనాథ శిశువుకు చనుపాలు పట్టించి ప్రాణం పోసిన పోలీసు అధికారి సతీమణి..

|

Dec 24, 2022 | 12:39 PM

బిడ్డకు జన్మనిచ్చిన ఓ తల్లి.. కన్న ప్రేమని కాదని చిన్నారిని పొదలు పాలు చేస్తే.. పసికందు పరిస్థితిని చూసి చలించి పోయిన మరో తల్లి.. అక్కున చేర్చుని తన చనుబాలు ఇచ్చి ప్రాణాలు కాపాడింది. మంచితనం, మానవత్వం ఇంకా ఉందని మరోసారి సజీవ సాక్ష్యంగా నిలిచింది.

Humanity: అమ్మతనం మహిమాన్వితం.. అనాథ శిశువుకు చనుపాలు పట్టించి ప్రాణం పోసిన పోలీసు అధికారి సతీమణి..
Jyoti Singh Sho's Wife
Follow us on

కొన్ని సార్లు కొన్ని ఘటనలు చూస్తే అయ్యో అనాలో.. ఆనందం వ్యక్తం చేయాలో తెలియదు.. నవమాసాలు మోసి.. తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి బిడ్డకు జన్మనిచ్చిన ఓ తల్లి.. కన్న ప్రేమని కాదని చిన్నారిని పొదలు పాలు చేస్తే.. చిన్నారి పరిస్థితిని చూసి చలించి పోయిన మరో తల్లి.. అక్కున చేర్చుని తన చనుబాలు ఇచ్చి ప్రాణాలు కాపాడింది. అవును తల్లిదండ్రులు చలిలో విడిచిపెట్టిన శిశువుకు స్టేషన్ హౌస్ ఆఫీసర్ భార్య తన పాలు ఇచ్చి ప్రాణాలను కాపాడింది. మంచితనం, మానవత్వం ఇంకా ఉందని మరోసారి సజీవ సాక్ష్యంగా నిలిచిన ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలోని  గ్రేటర్ నోయిడాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

డిసెంబరు 20న నాలెడ్జ్ పార్క్ ప్రాంతంలో పొదల్లో గుడ్డలో చుట్టి ఉన్న చిన్నారిని గుర్తించారు. చలి కారణంగా చిన్నారి పరిస్థితి చాలా విషమంగా మారింది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని చిన్నారిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. చిన్నారి బాలిక చలితో పాటు.. ఆకలితో  విలపిస్తోంది. ఆకలితో ఏడుస్తున్న శిశువుకు తల్లి పాలు తప్ప మరేమీ అవసరం ఉండదని పోలీసులకు తెలుసు. పసికందు ఆకలితో ఏడుస్తున్న విషయం  SHO భార్య జ్యోతి సింగ్ దృష్టికి చేరుకుంది. దీంతో జ్యోతి సింగ్ స్వచ్ఛందంగా ముందుకొచ్చి చిన్నారికి పాలిచ్చి ఆకలి తీర్చారు. అనంతరం ఆ చిన్నారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం పసికందు పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు తెలిపారు. పసికందుని పొదల్లో విడిచి పెట్టిన తల్లిదండ్రుల గురించి ఇంకా తమకు సమాచారం లేదని పోలీసులు చెప్పారు.

ఇదే విషయంపై ANIతో మాట్లాడిన జ్యోతి సింగ్ మాట్లాడుతూ.. తమ పిల్లల్ని ఇలా రోడ్డుమీద వదిలేయవద్దంటూ తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. అంతేకాదు అసలు ఎవరైనా ఇలాంటి పని ఎలా చేస్తారో తనకు అర్ధం కాదని .. పాప బాధను చూస్తుంటే తనకు  చాలా బాధగా అనిపించిందని చెప్పారు. చిన్నారి దీన స్థితి చూస్తే తనకు ఏడుపు వచ్చిందన్నారు.

ఇవి కూడా చదవండి

పసికందు అలా ఆకలితో ఏడుస్తుంటే చూస్తూ తాను ఉండలేకపోయానని.. అందుకే వెంటనే పాలివ్వాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. తమ పిల్లలను చూసుకోవడంలో ఎవరికైనా సమస్య ఉంటే.. వారిని అనాథ శరణాలయంలోనో..  లేదా ఎన్జీవో వంటి సురక్షిత ప్రదేశానికి తీసుకెళ్లి ఇవ్వాలని జ్యోతి సింగ్ సూచించారు. అంతేకాని ఇలా మానవత్వం లేకుండా లోకం తెలియని చిన్నారులను రోడ్డుపక్కన, పొదల్లో వదిలేయడం చాల హేయమైన చర్య అని..  ఇలాంటి చర్యలు ఖండించదగినవి అని జ్యోతి సింగ్ అన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..