Social Media Groups: సోషల్ మీడియా గ్రూపుల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి..ఈ సమూహాల్లో ఎలా ప్రవర్తించాలో తెలుసుకోండి
Social Media Groups: ఇప్పుడు అంతా సోషల్ మీడియా జమానా. వ్యక్తులుగా కలిసి ఉన్నా లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం గుంపులు.. గుంపులుగా కలిసి ఉంటాం.
Social Media Groups: ఇప్పుడు అంతా సోషల్ మీడియా జమానా. వ్యక్తులుగా కలిసి ఉన్నా లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం గుంపులు.. గుంపులుగా కలిసి ఉంటాం. గ్రూపులు కట్టడంలో చాలా బిజీగా ఉంటాం. వాట్సప్ గ్రూప్ లు.. ఫేస్‌బుక్ గ్రూపులు.. ఇలా సోషల్ మీడియా గ్రూప్ లలో జట్టుగా విషయాలను పంచుకోవడం ప్రస్తుతం చాలా ఎక్కువ. సాధారణ స్నేహితుల నుంచి మొదలు పెట్టి బంధువులు.. ఆఫీసు విషయాల దగ్గర నుంచి అధికారిక సమాచారం పంచుకునే వరకూ.. రాజకీయ విషయాల గోల నుంచి ఆధ్యాత్మిక విశేషాల వరకూ ఎన్నో గ్రూపులు. ఈ సమూహాలలో మనం కావాలని చేరవచ్చు. కొందరు మనల్ని వారి సమూహాల్లో కలిసి ఉండమని కోరవచ్చు. ఇక ఇప్పుడు ఎక్కువగా ఆన్‌లైన్‌లో వస్తువులను విక్రయించడానికి కూడా గ్రూపులు కడుతున్నాము. అయితే, మీరుఏదైనా గ్రూపులో చేరితే, దానిని జాగ్రత్తగా ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా గ్రూపులో ఉన్నపుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఎవరివల్లా ఇబ్బందులకు గురికాకుండా ఉండొచ్చు. సోషల్ మీడియా గ్రూపుల్లో ఎలా వ్యవహరించాలో ఇప్పుడు చూద్దాం.
చెప్పాపెట్టకుండా గ్రూపులో ఎవరినీ చేర్చేయకండి..
మీరు స్నేహితుల కోసం ఏదైనా గ్రూపు సృష్టించినట్లయితే, మీ స్నేహితులను అడగకుండా చేర్చవద్దు. ఎందుకంటే, మీ స్నేహితులందరూ ఒకరినొకరు తెలిసినవారు కాకపోవచ్చు. ఒకరికి ఒకరు పరిచయం లేనివారిని మీ స్నేహితులు అనే కారణంతో ఒక గ్రూపులో చేర్చేస్తే అందరూ గందరగోళంలో పడిపోతారు. అందుకే ముందుగా మీరు గ్రూపు ప్రరంబిస్తున్న విషయాన్ని మీ స్నేహితులకు చెప్పి.. వారి అనుమతితోనే గ్రూపులో చేర్చండి.
సున్నితమైన పోస్ట్‌లను పంపవద్దు..
కొంతమంది, తమను తాము కొత్త విషయాలు తెలిసి ఉన్న వారిగా నిరూపించుకునే క్రమంలో, ఏదైనా వార్తలను ఎవరిని ఎలా ప్రభావితం చేస్తారనే దాని గురించి ఆలోచించకుండా గ్రూపుల్లో సమాచారం పోస్ట్ చేయవద్దు. ఏదైనా సున్నితమైన ఫోటో లేదా వార్తలు ఉంటే దాన్ని గుంపులో పంచుకోవద్దు. ఇతర సభ్యులు కూడా అలా చేయకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. విషయం కచ్చితమైనది.. ఎవరికీ ఇబ్బంది కలిగించనిదీ అయితేనే దానిని షేర్ చేసుకోండి.
వ్యక్తిగత విషయాలకు దూరంగా ఉండండి..
తరచుగా అందరూ చేసే తప్పు గ్రూపులో లేని వ్యక్తి గురించి గ్రూపులో మాట్లాడుకోవడం. అది అవతల వ్యక్తిని ఇబ్బంది పెట్టడమే కాకుండా గ్రూపులోని సభ్యుల మధ్యలో కూడా చిచ్చుపెట్టే అవకాశం ఉంటుంది. అందుకే అటువంటి విషయాల్ని నివారించడం మంచింది.
సమాచారం మాత్రమే పంపించండి.. ముఖ్యమైన సమాచారాన్ని అందరితో పంచుకునేలా కొన్ని గ్రూపులు ఉంటాయి. వాటిలో ఉదయాన్నే గుడ్ మార్నింగ్..రాత్రి గుడ్ నైట్..జోకులు.. వంటివి పంపించడం అంత మంచిది కాదు. ఆ గ్రూపులోని వ్యక్తులు అందరూ తమకు వచ్చే విలువైన సందేశం కోసం ఎదురుచూస్తూ ఉంటారు. అందువల్ల వారిని ఇబ్బంది పెట్టడం భావ్యం కాదు.
గ్రూప్ పేరును మార్చవద్దు
కొందరు కొత్తగా గ్రూప్ లో యాడ్ అయిన వెంటనే గ్రూప్ పేరు మార్చడం.. లేదా ఐకాన్ మార్చడం వంటి పనులు చేస్తారు. గ్రూప్ ఎడ్మిన్ అనుమతి లేకుండా ఇలా చేయడం తప్పు. గ్రూప్ పెట్టిన వ్యక్తి ఏ ఉద్దేశంతో ఆ గ్రూప్ పెట్టారో.. ఏ ఉద్దేశంతో గ్రూప్ లో మిమ్మల్ని చేర్చారో తెలేకుండా.. మీరు ఆ పని చేయడం సరైన పధ్ధతి కాదు.
గ్రూప్ లో నిర్దిష్ట సందేశానికి ప్రత్యుత్తరం ఇవ్వండి
గ్రూపులో మీరు జవాబు ఇవ్వాలనుకున్న సందేశాన్ని టాగ్ చేసి మాత్రమే సమాధానం పంపండి. కాజువల్ గా సమాధానం పోస్ట్ చేస్తే అది దేనికోసమో తెలీక మిగిలిన గ్రూపు సభ్యులు తికమక పడతారు. ఒక్కోసారి మీరు పెట్టిన జవాబు వేరే సందేశం కోసం అని తప్పుగా అనుకునే అవకాశం కూడా ఉంటుంది.
ఏది ఏమైనా సోషల్ మీడియా గ్రూపుల్లో చాలా హుందాగా వ్యవహరించడం అవసరం అనే విషయాన్ని మర్చిపోవద్దు.
Also Read: Monsoon Diet : వర్షాకాలంలో వ్యాధులను నివారణకు ఈ 5 ఆహారాలు కచ్చితంగా మీ డైట్‌లో ఉండాల్సిందే..
Zodiac Signs: ఈ నాలుగురాశుల వారికి కోపం వస్తే దూర్వాసులే..కానీ కోపం తగ్గాకా మాత్రం..