ఎన్నికల వేళ ఓటేసేందుకు చాలామంది సుముఖత చూపించరు. కొందరైతే కార్యాలయాలకు సెలవిచ్చినా ఇంట్లోనే ఉంటారు తప్ప.. ఓటు వేయడం తమ బాధ్యత అని మరిచిపోతారు. ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరునికి ఓటు ఆయుధం లాంటిది. సరైన నాయకుడిని ఎన్నుకునేందుకు ఈ ఓటు ఎంతో కీలకం. కారణాలు ఏవైనా, అలాంటి ఓటు హక్కును చాలామంది నిర్లక్ష్యం చేస్తుంటారు. దానివల్ల వారి ఓటు దుర్వినియోగం అయ్యే ప్రమాదం లేకపోలేదు. అందుకే భాధ్యతగల చాలామంది పౌరులు లేవలేని స్థితిలో కూడా పోలింగ్ బూత్‌కు వెళ్లి తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలా ఓ వ్యక్తి ఓటు వేసేందుకు రెండు చేతులూ లేకపోయినా తన బాధ్యతను మరువలేదు. పోలింగ్ బూత్‌కు వెళ్లి కాలితో ఓటు వేసి అందరికీ స్పూర్తిగా నిలిచాడు.
లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన మూడో దశ ఓటింగ్ 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో మంగళవారం, మే 7న జరిగింది. ఇందులో భాగంగా ఒక వ్యక్తి ఓటు వేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇది నిజంగా దేశంలోని యువతకు స్ఫూర్తినిస్తుంది. తన ఓటు హక్కును పూర్తిగా వినియోగించుకుంటూ గుజరాత్‌లోని నాడియాడ్‌లో ఆ యువకుడు రెండు చేతులు లేకపోయినా, తన పాదాలను ఉపయోగించి ఓటు వేశారు.
లోక్ సభ ఎన్నికల్లో అంకిత్ సోని అనే వ్యక్తి తనకు రెండు చేతులు లేకపోయినా కాలితో ఓటువేసి ఔరా అనిపించాడు. గుజరాత్‌లోని నడియాడ్‌లోని పోలింగ్ బూత్‌లో తన ఓటు వేశాడు. ఈ సందర్భంగా ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు వేయండి అంటూ అంకిత్ పిలుపునిచ్చాడు. రాజ్యాంగం తనకు కల్పించిన హక్కును వినియోగించుకున్నాడు. చిత్తశుద్ధి ఉండాలేగానీ దేనికీ అవిటితనం అడ్డుకాదని అతడు నిరూపించాడు. 20 ఏళ్ల క్రితం జరిగిన ఓ ప్రమాదంలో తన రెండు చేతులూ తెగిపోయాయని అంకిత్ సోని తెలిపాడు. అయినా గత 20 ఏళ్లలో తాను ఏనాడూ ఓటు వేయకుండా ఉండలేదని చెప్పాడు. చేతులు లేకపోయినా కాలి వేళ్లతో తాను ఓటు వేస్తానని తెలిపాడు. అంకిత్ కాలితో ఓటు వేసిన వీడియో నెట్టింట ప్రత్యక్షం కావడంతో వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు.. ఓటు వేసేందుకు బద్దకించే వాళ్లు అంకిత్ సోనిని ఆదర్శంగా తీసుకోవాలని కామెంట్ చేస్తున్నారు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…