
పుట్టగొడుగులు కేవలం కూరగాయలు మాత్రమే కాదు, అవి ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటాయని, వాటికి దాదాపు 50 పదాల భాష ఉందని తెలిస్తే ఆశ్చర్యపోక తప్పదు! ఈ సంచలన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. పక్షులు, జంతువులు సంభాషించుకోవడం గురించి విన్నాం, కానీ మట్టిలోపల నిశ్శబ్దంగా ఉండే పుట్టగొడుగులు కూడా సమాచారాన్ని పంచుకుంటాయని కొత్త అధ్యయనాలు చెబుతున్నాయి.
యూనివర్శిటీ ఆఫ్ ది వెస్ట్ ఆఫ్ ఇంగ్లాండ్‌కు చెందిన ప్రొఫెసర్ ఆండ్రూ ఆడమట్స్కీ ఈ వినూత్న పరిశోధన చేశారు. పుట్టగొడుగుల దారాలతో కూడిన మైసీలియం అనే భూగర్భ నెట్‌వర్క్‌ల ద్వారా అవి విద్యుత్ సంకేతాలను పంపుకుంటాయని ఆయన గుర్తించారు. ఈ సంకేతాలు మన మనుషుల భాషలోని పదాల లాగే ఒక క్రమ పద్ధతిలో ఉంటాయని ఆయన పరిశోధనలో తేలింది.
ఈ అధ్యయనం ప్రకారం, పుట్టగొడుగులు 50 రకాల “పదాలను” ఉపయోగించి ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటాయని, ఈ ఫలితాలు ‘రాయల్ సొసైటీ ఓపెన్ సైన్స్’ పత్రికలో ప్రచురితమయ్యాయి.
డా. ఆడమట్స్కీ బృందం కొన్ని రకాల పుట్టగొడుగులపై లోతైన పరిశోధనలు చేశారు. మైసీలియంలోకి చిన్న మైక్రోఎలక్ట్రోడ్‌లను అమర్చి వాటి విద్యుత్ కార్యకలాపాలను నమోదు చేసుకున్నారు. వాటిని విశ్లేషించగా, పుట్టగొడుగులు పంపిన సంకేతాలు మన భాషలోని పదాలను పోలి ఉన్నాయని తేలింది.
పుట్టగొడుగులకు ఆహారం దొరికినప్పుడు లేదా అవి దెబ్బతిన్నప్పుడు ఈ విద్యుత్ సంకేతాలు పెరిగాయి. అంటే, అవి ఆహారం గురించి లేదా ప్రమాదం గురించి ఒకదానికొకటి చెప్పుకుంటాయని అర్థం.
ప్రొఫెసర్ ఆడమట్స్కీ, పుట్టగొడుగులు మనలాగే మాట్లాడుతాయని ఖచ్చితంగా చెప్పలేనని, కానీ సమాచారాన్ని పంచుకునే విధానంలో చాలా పోలికలు ఉన్నాయని అంటున్నారు. ఈ అధ్యయనం ప్రకృతిలోని జీవుల మధ్య మేధస్సు, కమ్యూనికేషన్ గురించి మన అవగాహనను పూర్తిగా మార్చగలదని నిపుణులు భావిస్తున్నారు. భవిష్యత్‌లో ఈ పుట్టగొడుగుల “భాష” గురించి మరింత లోతైన పరిశోధనలు జరగాల్సి ఉంది.