Kusum Yojana Scheme: కేంద్రం పేరుతో సోషల్ మీడియాలో అసత్యప్రచారం.. ఆదమరిచారో డబ్బులు గల్లంతే..!

|

Feb 26, 2021 | 10:41 AM

Kusum Yojana Scheme: దేశంలోని పేద ప్రజలను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక పథకాలను ప్రవేశపెట్టిన..

Kusum Yojana Scheme: కేంద్రం పేరుతో సోషల్ మీడియాలో అసత్యప్రచారం.. ఆదమరిచారో డబ్బులు గల్లంతే..!
Follow us on

Kusum Yojana Scheme: దేశంలోని పేద ప్రజలను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక పథకాలను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అటు కేంద్రం, ఇటు రాష్ట్రాల ప్రభుత్వాలు ఎన్నో పథకాలను అమలు చేస్తున్నాయి కూడా. ఈ పథకం ద్వారా అత్యధిక మంది ప్రజలు లబ్ధి పొందాలనే ఉద్దేశంతో ప్రభుత్వ పథకాల సమాచారాలను అధికారిక వెబ్ సైట్‌లలో ప్రచురిస్తున్నారు కూడా. అయితే కొందరు వ్యక్తులు ఈ పథకాలను ఆసరాగా చేసుకుని అమాయకులను అడ్డంగా మోసం చేస్తున్నారు. వారి వద్ద నుంచి డబ్బులు లాగేస్తున్నారు.

తాజాగా కేంద్ర ప్రభుత్వ పథకమైన ‘కుసుమ్ యోజన’ పథకం గురించి సోషల్ మీడియాలో ఓ అసత్య కథనం ప్రచారం అవుతోంది. ఈ కథనంలో కుసుమ్ పథకానికి సంబంధించి సమస్త సమాచారంతో పాటు.. రూ.5,600 చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అచ్చంగా ప్రభుత్వ ప్రకటనలా ఉన్న ఈ ప్రకటనతో ఎంతో మంది మోసపోయారు. అందుకే ఏదైనా ప్రకటనను చూసినప్పుడు అది నిజమో? కాదో? ఒకసారి చెక్ చేసుకోవడం చాలా అవసరం.

ఫేక్ లెటర్ ప్యాడ్‌లో ఏముందంటే..
‘కుసుమ్ పథకం’ లెటర్ ప్యాడ్‌లా ఉన్న ఈ ఫోటోపై కేంద్ర ప్రభుత్వ అధికారిక చిహ్నమైన అశోక్ చక్ర ముద్ర కూడా ఉంది. ఇంగ్లీష్, హిందీ భాషలలో ముద్రించపడింది. ఇందులో ‘కుసుమ యోజన కింద వ్యవసాయ క్షేత్రాల్లో సౌర శక్తి పరికరాలను ఏర్పాటు చేయడానికి రూ. రైతులు 10 శాతం చెల్లిస్తే సరిపోతుంది. 90 శాతం ఖర్చును ప్రభుత్వం రైతులకు సబ్సిడీగా అందిస్తుంది.’ అని పేర్కొన్నారు. అంతేకాదు.. ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే ముందుగా ప్రాసెసింగ్ ఫీజు కింద రూ.5,600 చెల్లించాల్సి ఉంటుందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. దానికి అనుబంధంగా కొన్ని బ్యాంక్ ఖాతా నెంబర్లను కూడా అందులో ముద్రించారు. అంతేకాదు.. దీని కోసం ఫేక్ వెబ్‌సైట్‌ను కూడా క్రియేట్ చేశారు. ఇలా ప్రకటనలతో అమాయక ప్రజల నుంచి డబ్బులు కాజేస్తున్నారు కేటుగాళ్లు.

కుసుమ్ పథకం గురించి వాస్తవం ఏంటి?
సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోన్న ఈ లెటర్‌ప్యాడ్‌ను పరిశీలించిన కొందరు.. ఇది పూర్తిగా అవాస్తవం అని తేల్చారు. నకిలీ లెటర్ ప్యాడ్ అని గుర్తించారు. అందులో ప్రచురించిన పూర్తిగా తప్పు అని చెబుతున్నారు. ఎందుకంటే.. ప్రభుత్వం ప్రాసెసింగ్ ఫీజు పేరుతో ముందుగా డబ్బులు తీసుకోవడం లేదు. ఎటువంటి బ్యాంక్ ఖాతాల నెంబర్లనూ ఇవ్వలేదు. ఇదే విషయాన్ని పలువురు స్పష్టం చేస్తున్నారు. పొరపాటున కూడా ఎవరూ అటువంటి బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ చేయవద్దని సూచిస్తున్నారు.

ఇకపోతే.. ఈ అసత్య ప్రచారంపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్ స్పందించింది. ఇదీ నిజం అంటూ ట్వీట్ చేసింది. ఈ తప్పుడు ప్రచారాన్ని ఖండించింది. ‘పునరాత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ పేరుతో సోలార్ పంపు సెట్లను వ్యవస్థీకరించడానికి చట్టపరమైన ఛార్జీల పేరుతో కుసుమ్ పథకం కింద రూ. 5,600 డిమాండ్ చేస్తున్నారు. ఇది పూర్తిగా అబద్ధం. నకిలీ లెటర్ ప్యాడ్. కేంద్రం ప్రభుత్వం ఎటువంటి లెటర్ ప్యాడ్‌ను విడుదల చేయలేదు. ప్రజలెవరూ దీనిని నమ్మి మోసపోవద్దు’ అని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ స్పష్టం చేసింది.

అసలు కుసుమ్ పథకం అంటే ఏమిటి?
భారతదేశంలోని రైతులకు నీటిపారుదల సమస్య నుంచి ఉపశమనం కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం కుసుమ్ యోజన పథకాన్ని తీసుకువచ్చింది. సాగు నీటి విషయంలో భారతదేశ రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారడంలో ఎలాంటి సందేహం లేదు. అత్యల్ప వర్షాల కారణంగా రైతుల పంటలు ఎండిపోయిన సందర్భాలు కోకొల్లలు అనే చెప్పాలి. దాంతో రైతులు బోరు మోటార్లను ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రైతులకు బాసటగా.. కేంద్ర ప్రభుత్వం కుసుమ్ యోజన పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద రైతుల భూమిలో సౌర శక్తితో నడిచే పంపు సెట్లను ఏర్పాటు చేసి పొలాలకు సాగునీరు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

కుసుమ్ యోజన సహాయంతో, రైతులు తమ భూమిపై సౌర ఫలకాలను ఏర్పాటు చేసుకోవచ్చు. అలా ఉత్పత్తి చేయబడిన విద్యుత్తుతో పొలాలకు నీటి సౌకర్యాన్ని కల్పించుకోవచ్చు. అంతేకాదు.. రైతు భూమిలో ఉత్పత్తి అయ్యే విద్యుత్తుతో గ్రామంలో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా కూడా చేయవచ్చు. కాగా, ఈ పథకం ద్వారా ప్రభుత్వం రైతులకు రెండు విధాలుగా ప్రయోజనం చేకూరుస్తుంది. రైతులు నీటిపారుదల కోసం విద్యుత్తును ఉచితంగా పొందుతారు, అదనపు విద్యుత్తును తయారు చేసి గ్రిడ్‌కు పంపినట్లయితే ఆదాయం కూడా పొందవచ్చు. ఇక సౌరశక్తి పరికరాలను ఏర్పాటు చేయడానికి రైతులు 10 శాతం డబ్బు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన 90శాతాన్ని కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది.

PIB Tweet:

Also read:

రహస్యాలకు కేరాఫ్‌గా మారిన సరస్సు.. నాసా శాస్త్రవేత్తలే చేతులెత్తేశారు.. భారత్‌లో ఎక్కడుందంటే..

వారు మా రాష్ట్రానికి వస్తే.. కరోనా నెగిటివ్ సర్టిఫికెట్ చూపించాల్సిందే: రాజస్థాన్ ప్రభుత్వం ఆదేశాలు