Snakes: పాములు చనిపోయాక కూడా కాటు వేస్తాయా..?
చనిపోయిన పాములు కూడా కాటేస్తాయా? పలు సంఘటనలు ఈ ప్రశ్నను లేవనెత్తాయి. మరణం తర్వాత కూడా కొన్ని పాములు కాటు వేయగలవని, వాటి విషం పనిచేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వెన్నుపాము ప్రతిచర్యలు, విష నియంత్రణ కోల్పోవడం దీనికి కారణం. చనిపోయిన పాముల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

పాము చనిపోయిన తర్వాత కూడా కాటు వేయగలదా? ఈ ప్రశ్న తరచుగా తలెత్తుతుంటుంది. అస్సాంలో 2022, 2023లో నమోదైన మూడు నిర్ఘాంతపరిచే సంఘటనలు ఈ ప్రశ్నకు అవుననే సమాధానం చెబుతున్నాయి. ఈ ఘటనలలో, మోనోక్లెడ్ కోబ్రా, బ్లాక్ క్రైట్ వంటి విషపూరిత పాములు చనిపోయిన కొన్ని గంటల తర్వాత కూడా మనుషులను కరిచి, తీవ్రమైన ఆరోగ్య సమస్యలను సృష్టించాయి. ఈ పరిణామాలు చనిపోయిన పాము విషం నిజంగానే పనిచేస్తుందా అనే అనుమానాలకు దారితీశాయి.
అస్సాం ఘటనలు:
తొలి సంఘటన అస్సాంలోని శివసాగర్ జిల్లాలో చోటుచేసుకుంది. తెగిపడిన కోబ్రా తల ఒక వ్యక్తిని బొటనవేలిపై కాటు వేయడంతో, ఆ ప్రాంతం నల్లగా మారి, తీవ్రమైన నొప్పి భుజాల వరకు వ్యాపించింది. సకాలంలో వైద్య చికిత్స, విషానికి విరుగుడు ఇంజెక్షన్ అందించడంతో ఆ వ్యక్తి కోలుకున్నారు. రెండవ సంఘటన కూడా శివసాగర్ జిల్లాలోనే జరిగింది. ఒక రైతు ట్రాక్టర్ నడుపుతుండగా నాగుపాము చక్రాల కింద పడి ఛిద్రమైంది. కొన్ని గంటల తర్వాత ఆ రైతు ట్రాక్టర్ నుండి దిగగానే, చనిపోయిన నాగుపాము ఆయన్ని కాటేసింది. 25 రోజుల చికిత్స అనంతరం రైతు కోలుకున్నారు. మూడవ సంఘటన అస్సాంలోని కామ్రూప్ జిల్లాలో నమోదైంది. చనిపోయిన మూడు గంటల తర్వాత ఒక కట్లపాము ఒక వ్యక్తిని కాటు వేసింది. కొద్దిసేపటికే ఆ వ్యక్తి శరీరంలో న్యూరోటాక్సిన్ ప్రభావం కనిపించి, తీవ్ర ఆందోళనతో పాటు ఒళ్ళంతా నొప్పులు మొదలయ్యాయి. ఆరు రోజుల చికిత్స తర్వాత ఆయన కోలుకున్నారు.
శాస్త్రీయ అధ్యయనం, నిపుణుల అభిప్రాయం: ఈ సంఘటనలపై పరిశోధకులు అధ్యయనం చేశారు. “ఫ్రాంటియర్స్ ఇన్ ట్రాపికల్ డిసీజెస్”లో ప్రచురించిన నివేదిక ఈ అంశాన్ని విస్తృతంగా చర్చించింది. ఈ నివేదిక ప్రకారం, కొన్ని పాములు చనిపోయిన మూడు గంటల తర్వాత కూడా కాటు వేయగలవు. పాము శరీరంలో ఉన్న విషం కొన్ని గంటల పాటు చురుగ్గా ఉండి, కరిచిన వారిపై ప్రభావం చూపుతుంది. పలువురు నిపుణులు ఈ విషయాన్ని ధృవీకరించారు. మనిషిలో మెదడు నుంచి ప్రారంభమై వెన్నుపూస ద్వారా శరీరమంతటికీ విస్తరించి ఉండే నాడీ వ్యవస్థ (కేంద్ర నాడీ వ్యవస్థ) మాదిరిగానే, పాముల నాడీ వ్యవస్థ కూడా మరణం తర్వాత పూర్తిగా నిలిచిపోదని ఆయన వివరించారు. కొన్ని అరుదైన సందర్భాలలో, మరణం తర్వాత కూడా వెన్నుపాము నుంచి కాటు వేసే ప్రతిచర్యలు (reflex actions) ఉండవచ్చని ఆయన చెప్పారు. పాములు విషాన్ని విడుదల చేసే గ్రంథిని తమ కోరలకు అనుసంధానించి ఉంటాయి, ఇది సిరంజిలా పనిచేస్తుంది. పాము కాటు వేసినప్పుడు, విషం ఈ గ్రంథుల నుండి విడుదలై దంతాల ద్వారా కరిచిన వ్యక్తి శరీరంలోకి చేరుతుంది. జీవించి ఉన్న పాములు విషం పరిమాణాన్ని నియంత్రించగలవు, కొన్నిసార్లు హెచ్చరించడానికి విషం లేకుండా కూడా కాటు వేయగలవు. అయితే, చనిపోయిన పాము శరీరంలో ఈ నియంత్రణ కోల్పోతుంది. అందువల్ల, మరణించిన తర్వాత కూడా ఏదైనా కదలిక వల్ల దాని దంతాలు ఎవరికైనా గుచ్చుకుంటే, విషగ్రంథిలో నిల్వ ఉన్న విషమంతా శరీరంలోకి ప్రవేశించే ప్రమాదం ఉందని అధ్యయనం చెబుతోంది.
ప్రమాదకరమైన పాముల జాతులు:
మోనోక్లెడ్ కోబ్రా, బ్లాక్ క్రైట్ వంటి అత్యంత విషపూరితమైన ఎలాపిడే జాతికి చెందిన పాములు (నాగుపాము, తాచుపాము, కట్లపాములు), విపిరిడే జాతికి చెందిన పాములు (రక్తపింజరి, చిన్న పింజరి), బొరియల్లో ఉండే అట్రాక్టాస్పిడిడే జాతికి చెందిన పాములలో ఈ రకమైన ప్రమాదం ఎక్కువగా ఉంటుందని నిపుణలు తెలిపారు. అమెరికాలోని రాటిల్ స్నేక్స్, ఆస్ట్రేలియాలోని పొడ పాములు, చైనాలోని కింగ్ కోబ్రాలు చనిపోయిన తర్వాత కూడా కాటు వేసిన ఘటనలు ఉన్నాయి. భారతదేశంలో రస్సెల్ వైపర్ (రక్త పింజరి), సా స్కేల్డ్ వైపర్ (చిన్న పింజరి), బాంబూ పిట్ వైపర్ (పసిరిక పాము), మలబార్ పిట్ వైపర్ (పింజరి జాతికి చెందినది), కోరల్ స్నేక్, బ్యాండెడ్ పిట్ వైపర్ వంటి పాముల నుంచి ఇలాంటి ముప్పు రావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
జాగ్రత్తలు, అవగాహన:
చాలామంది చనిపోయిన పామును పట్టుకోవాలని చూస్తారు, ఇది అత్యంత ప్రమాదకరం. పామును కొట్టి చంపినా, తల తెగిపడినా, కదలకుండా ఉన్నా అది పూర్తిగా చనిపోయిందని భావించకూడదు. పాముల మరణానికి స్పష్టమైన వైద్య నిర్వచనం లేదని నిపుణులు చెప్పారు. పాముకాటు, చనిపోయిన పాములతో వ్యవహరించాల్సిన తీరు గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలని అస్సాంలో జరిగిన సంఘటనలు స్పష్టం చేస్తున్నాయి. దేశంలో వన్యప్రాణుల సంరక్షణ చట్టాల కారణంగా చనిపోయిన పాములపై పూర్తిస్థాయి అధ్యయనాలు జరగడం కష్టమని పేర్కొన్నారు. అయితే, ఇలాంటి ఘటనల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండడం చాలా ముఖ్యం.
