షాకింగ్ నిజాలు.. చీమలు అంతరించిపోతే ఏం జరుగుతుంది..?
79శాతం ఫిజియన్ స్థానిక చీమల జాతుల సంఖ్య వేగంగా పడిపోతున్నట్లు ఓ అధ్యాయనంలో తేలింది. పరిశోధకులు మ్యూజియం జెనోమిక్స్ ఉపయోగించి ఈ విషయాన్ని కనుగొన్నారు. మానవ మనుగడ, వాణిజ్యం, దురాక్రమణ వంటివి చీమల పెరుగుదలతో ముడిపడి ఉన్నాయి. అసలు చీమలు అంతరించిపోతే ఏం జరుగుతుంది..? అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..

మనిషి ప్రకృతిని మొత్తం చెరబడుతున్నాడు. అభివృద్ధి పేరుతో విధ్వంసానికి పాల్పడుతున్నాడు. మనుషులు చేసే పనుల వల్ల ఇప్పటికే ఎన్నో జీవులు అంతరించిపోయాయి. అరుదైన పక్షి, జంతు జాతులు కానరాకుండా అయిపోతున్నాయి. ఇప్పుడు కీటకాలు ప్రధానంగా చీమల వంతు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా కీటకాల సంఖ్య ఆందోళనకరంగా తగ్గిపోతోంది. ఇది పర్యావరణ వ్యవస్థలకు పెను ముప్పుగా మారనుంది. ఈ నేపథ్యంలో శాస్త్రవేత్తలు తాజాగా నిర్వహించిన ఒక అధ్యయనంలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఓకినావా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిశోధకులు ఫిజీ దీవుల్లోని చీమల జాతులపై పరిశోధన చేశారు. ఇందులో భాగంగా మ్యూజియంలలో ఉన్న పాత నమూనాల నుంచి జన్యుపదార్థాన్ని విశ్లేషించారు. దశాబ్దాలుగా ఈ చీమల జనాభాలో ఎలాంటి మార్పులు వచ్చాయో తెలుసుకోవడానికి ప్రయత్నించారు.
పరిశోధనలో షాకింగ్ నిజాలు
ఈ అధ్యయనంలో ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి. ఫిజీలో నివసించే 79 శాతం స్థానిక చీమల జాతుల సంఖ్య వేగంగా పడిపోతోంది. మానవులు ఫిజీ దీవులకు వచ్చినప్పటి నుంచి ఈ చీమల సంఖ్య గణనీయంగా తగ్గిందని పరిశోధకులు గుర్తించారు. ముఖ్యంగా యూరోపియన్ల రాక, ప్రపంచ వాణిజ్యం, ఆధునిక వ్యవసాయ పద్ధతులు అవి తగ్గిపోవడానికి ప్రధాన కారణాలని పరిశోధకులు తేల్చి చెప్పారు. మరోవైపు మానవులు ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన చీమల జాతులు మాత్రం విపరీతంగా వృద్ధి చెందుతున్నాయి. దీనివల్ల పర్యావరణ వ్యవస్థలో స్థానిక కీటకాలకు స్థానం లేకుండా పోతోంది.
ఎందుకీ అధ్యయనం?
కీటకాలు పర్యావరణ సమతుల్యతకు చాలా ముఖ్యమైనవి. అవి పంటల పరాగ సంపర్కానికి, పోషకాల వలయానికి, మట్టిని సారవంతం చేయడానికి సహాయపడతాయి. అయినా చాలామంది వాటి ప్రాముఖ్యతను గుర్తించడం లేదు. ఫిజీ వంటి చిన్న ద్వీపాలు మానవ ప్రభావానికి త్వరగా ప్రభావితమవుతాయి. అందుకే వీటిని “బొగ్గు గనిలో కానరీ” అని పేర్కొన్నారు. అంటే పర్యావరణంలో వచ్చే మార్పులను అవి మొదటగా సూచిస్తాయి.
ఈ అధ్యయనంలో ‘మ్యూజియమోమిక్స్’ అనే సరికొత్త సీక్వెన్సింగ్ పద్ధతిని ఉపయోగించారు. దీని ద్వారా పాత మ్యూజియం నమూనాల్లోని జన్యువులను విశ్లేషించి, కాలక్రమేణా కీటకాల జనాభాలో వచ్చిన మార్పులను గుర్తించారు. ఈ పరిశోధన కీటకాల సంరక్షణపై మరిన్ని అధ్యయనాలకు ప్రేరణనిస్తుందని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో మనం ఈ జాతులను కాపాడుకోకపోతే, అది మానవాళికి కూడా ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని హెచ్చరించారు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం క్లిక్ చేయండి..
