Milk: పాలను కల్తీ చేస్తే ఎలాంటి శిక్ష పడుతుందో తెలుసా.? చట్టం ఏం చెబుతోందంటే..
కల్తీ జరగని వస్తువు ఏదైనా ఉందంటే కచ్చితంగా ఇది ఉందని చెప్పలేని పరిస్థితి నెలకొంది. మార్కెట్లో లభించే అన్ని రకాల వస్తువులను కేటుగాళ్లు కల్తీ చేసేస్తున్నారు. అయితే పాలతో పాటు ఆహార పదార్థాలను కల్తీ చేయడం నేరమని చట్టం చెబుతోంది. ఒకవేళ ఎవరైనా ఆహారాన్ని కల్తీ చేసి పట్టుబడితే ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు..
ప్రస్తుతం మార్కెట్లో అన్ని వస్తువులకు కల్తీ పుట్టుకొస్తున్నాయి. కాసుల కక్కుర్తి కోసం ప్రజల ప్రాణాలను సైతం ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు కొందరు కేటుగాళ్లు. ఉప్పు నుంచి పప్పు వరకు చివరికి పాలను కూడా కల్తీ చేస్తున్నారు. కొందరు పాలల్లో నీళ్లను కలిపి అమ్ముతుంటే మరికొందరు మాత్రం ఏకంగా రసాయనాలను ఉపయోగించే పాలను తయారు చేస్తున్నారు. అయితే ఆహార పదార్థాలను కల్తీ చేసే వారికి కచ్చితంగా తగిన శిక్ష పడుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఇందుకోసం ప్రత్యేక చట్టాలను రూపొందించారు. భారత్‌లో కల్తీ ఆహార పదార్థాలను నియంత్రించేందుకు గాను ఆహార భద్రత అండ్ ప్రమాణాల చట్టం, 2006ని రూపొందించారు. దీంతోపాటు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) నిబంధనలను కూడా పాటిస్తారు. ఈ చట్టం ప్రకారం, ఆహార పదార్థాలను ఎవరైనా కల్తీ చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు. పాలు మొదలు ఎలాంటి ఆహార పదార్థాలను కల్తీ చేసినా అది నేరం కిందికి వస్తుందని చట్టం చెబుతోంది.
ఒకవేళ నేరం రుజువైతే జరిమానా, శిక్ష లేదా రెండూ విధించే నిబంధన ఉంది. జరిమానా విషయానికొస్తే.. ఎవరైనా వ్యక్తి ఆహార పదార్థాలను కల్తీ చేసినట్లు నిరూపితమైతే రూ. 1 లక్ష వరకు జరిమానా విధించవచ్చు. అలాగే నేర తీవ్రత ఆధారంగా జరిమానాతో పాటు 6 నెలల నుంచి 7 ఏళ్ల వరకు కారాగారం కూడా విధించే అవకాశం ఉంటుంది. కల్తీ ఆహార పదార్థాలు తినడం వల్ల ఒక వ్యక్తి మరణిస్తే, కల్తీ చేసిన వ్యక్తికి జీవిత ఖైదు లేదా 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించవచ్చు.
ఆహార భద్రత ప్రమాణాల చట్టం, 2006తో పాటు, భారతీయ శిక్షాస్మృతి (IPC) కూడా కల్తీకి సంబంధించిన నేరాలకు నిబంధనలు ఉన్నాయి. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 272 , 273 ప్రకారం కల్తీ ఆహార పదార్థాలను విక్రయించే వ్యక్తికి 6 నెలల నుంచి 2 సంవత్సరాల వరకు జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధించే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు.
మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..